ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - May 05 , 2026 | 12:50 AM
మన్యంలో సోమవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గత మూడు రోజులుగా ద్రోణి ప్రభావంతో ఒడిశాను ఆనుకుని ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు, సీలేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది.
- పెదబయలు వారపు సంతలో చెట్టు కూలి ఇద్దరు మహిళల మృతి
- డుంబ్రిగుడ మండలంలో పిడుగుపాటుకు బాలిక దుర్మరణం
- ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ, ఆ తరువాత భారీ వర్షం
పాడేరు, మే 4(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గత మూడు రోజులుగా ద్రోణి ప్రభావంతో ఒడిశాను ఆనుకుని ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు, సీలేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. అలాగే సోమవారం సైతం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీవ్రమైన ఎండ కాసినప్పటికీ, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఒక మోస్తరు వర్షం మాత్రమే కురవగా, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, జీకేవీధి మండలాల్లో భారీగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో పెదబయలు మండల కేంద్రంలో ఒక చెట్టు కూలిన ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. డుంబ్రిగుడ మండలం కండ్రూం పంచాయతీ సిందిరిగూడ గ్రామంలో పిడుగుపాటుకు ఎస్.దివ్య(13) అనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే ఒడిశాకు సరిహద్దున ఉన్న ప్రాంతాల్లోనే భారీ వర్షాలు, ఈదురుగాలులు ప్రభావం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కొనసాగిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
మన్యంలో వాతావరణం మార్పుల నేపథ్యంలో సోమవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేకపోవడం విశేషం. పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 35.1, కొయ్యూరులో 34.3, జి.మాడుగుల 33.6, అరకులోయలో 32.6, చింతపల్లిలో 32.4, పెదబయలులో 31.8, అనంతగిరిలో 30.9, ముంచంగిపుట్టులో 30.7, హుకుంపేటలో 30.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం మొదలైంది. సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాలకు వెళ్లే మట్టి రహదారులు బురదమయంగా మారాయి. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.
సీలేరులో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండలో సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ తరువాత వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. దీంతో ఎండకు అల్లాడిన జనం వర్షంతో ఊరట చెందారు.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ దురు గాలుల ప్రభావంతో నడింపాలెం-శరభన్నపాలెం గ్రామాల మద్య విద్యుత్ తీగ తెగి గేదెపై పడడంతో అది మృతి చెందింది. స్థానికులు గుర్తించి వెంటనే విద్యుత్ లైన్‌మన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి విద్యుత్ తీగలను సరిచేశారు.