ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - May 04 , 2026 | 12:54 AM
పట్టణంలో ఆదివారం ఉదయం పెనుగాలులతో మోస్తరు వర్షం కురిసింది. గాలుల కారణంగా పలుచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగులు, చెట్లు నేలకొరిగాయి. జలాలు వీధిలో భారీ వృక్షం కూలి విద్యుత్ వైర్లపై పడింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక, మునిసిపల్ సిబ్బంది వచ్చి విద్యుత్ వైర్లపై పడిపోయిన చెట్టును తొలగించారు. ఈపీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం ఆకాశం మేఘావృతమై వుండడంతో సాయంత్రం వరకు వాతావరణం చల్లగానే వుంది.
ఎలమంచిలి, ‘పేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం
జిల్లాలో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, రాంబిల్లి, నాతవరం మండలాల్లో ఆదివారం ఉదయం భారీగా ఈదురుగాలులు వీచాయి. వర్షం మోస్తరుగా పడినప్పటికీ సుమారు గంటపాటు వీచిన గాలులధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రహదారులపై చెట్లు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ వైర్లపై కూలిన చెట్టు
ఎలమంచిలి, మే 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఆదివారం ఉదయం పెనుగాలులతో మోస్తరు వర్షం కురిసింది. గాలుల కారణంగా పలుచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగులు, చెట్లు నేలకొరిగాయి. జలాలు వీధిలో భారీ వృక్షం కూలి విద్యుత్ వైర్లపై పడింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక, మునిసిపల్ సిబ్బంది వచ్చి విద్యుత్ వైర్లపై పడిపోయిన చెట్టును తొలగించారు. ఈపీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం ఆకాశం మేఘావృతమై వుండడంతో సాయంత్రం వరకు వాతావరణం చల్లగానే వుంది.
నర్సీపట్నం- తుని రహదారిపై కూలిన చెట్లు
నాతవరం, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం ఈదురుగాలులతో వర్షం కురిసింది. నర్సీపట్నం- తుని మార్గంలో గన్నవరంమెట్ట, మన్యపురట్ల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై రెండు చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గన్నవరంమెట్ట వద్ద ఒక చెట్టు ఆటోపై పడడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. నాతవరం ఎస్‌ఐ తారకేశ్వరరావు, పోలీసు సిబ్బందితో చెట్లు కూలిన ప్రాంతానికి చేరుకొని రంపాలతో కోయించి తొలగించారు. కాగా ఈదురుగాలులకు జీడిమామిడి చెట్ల కొమ్మలు విరిగాయి.
ఇంటిపై కూలిన తాటిచెట్టు, విద్యుత్ స్తంభం
రాంబిల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం ఈదురు గాలులతో వర్షం కురిసింది. వాడనర్సాపురంలో తాటిచెట్లు విరిగి విద్యుత్ స్తంభంపై పడడంతో ఇదికూడా విరిగి పక్కనే వున్న కొమ్మోజు సన్యాసిరావు ఇంటిపై పడ్డాయి. దీంతో రేకులతో నిర్మించిన ఇంటి పైకప్పు దెబ్బతిన్నది. కాగా వర్షం కారణంగా సాయంత్రం వరకు వాతావరణం చల్లగా వుండడంతో ప్రజలు ఉపశమనం చెందారు.
నక్కపల్లి మండలంలో..
నక్కపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఈదురుగాలులు వీచాయి. ఈ సమయంలో సీతంపాలెం, నక్కపల్లి, రాజయ్యపేట, ఉపమాక, పెదదొడ్డిగల్లు, కాగిత, రేబాక, తిరుపతిపాలెం, జి.జగన్నాథపురం, ముకుందరాజుపేట, దోసలపాడు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో ఉదయం 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచింది.