Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - May 03 , 2026 | 12:37 AM

జిల్లాలోని సీలేరు, పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం ఈదురు గాలులతో వర్షం పడింది. గాలులకు పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.

ఈదురుగాలుల బీభత్సం

పలు గ్రామాల్లో ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

డుంబ్రిగుడ మండలం గుంటసీమలో

మహిళకు తీవ్ర గాయాలు

సీలేరు/పెదబయలు/డుంబ్రిగుడ, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సీలేరు, పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం ఈదురు గాలులతో వర్షం పడింది. గాలులకు పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.

జీకేవీధి మండలం సీలేరు, ధారకొండ, గుమ్మిరేవుల పంచాయతీల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలులకు కమ్మరితోట గ్రామంలో అడ్డవేలు శ్రీను ఇంటిపై భారీ చింతచెట్టు కూలిపోయింది. దీంతో ఇంటిలో ఉన్న భార్యాభర్తలు బయటకు పరుగులు తీశారు. కాగా శనివారం ఉదయం ఏడు గంటల నుంచి ఎండ తీవ్రంగా కాసింది. జనం ఇళ్లలో ఉండలేక చెట్ల నీడలో వెళ్లి ఉపశమనం పొందారు.

పెదబయలు మండలం గిన్నెలకోట, ఇంజరీ, బొంగరం పంచాయతీల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. పలు గ్రామాల్లో అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ మూడు పంచాయతీల్లో 25 ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.

డుంబ్రిగుడ మండలంలోని గుంటసీమ గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన కొర్రా బాలాజీ అనే గిరిజనుడి ఇంటిపై భారీ జీలుగు చెట్టు పడింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న భాలాజీ భార్య నీలమ్మకు విరిగిన రేకులు తలపై బలంగా తగలడంతో తీవ్ర గాయలయ్యాయి. రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.

Updated Date - May 03 , 2026 | 12:37 AM