Share News

డాక్యుమెంట్‌ ఏదైనా దండుకోవడమే పని

ABN , Publish Date - May 07 , 2026 | 01:05 AM

జిల్లాలోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పనితీరులో ఏ మాత్రం మార్పు లేదు. ఏ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు వచ్చినా దాని నుంచి ‘అదనంగా డబ్బులు ఎలా గుంజాలి?’ అనే దానిపైనే అక్కడి అధికారులు దృష్టి పెడుతున్నారు. వారి చేతిలో ఉన్న ‘పెండింగ్‌’ అధికారాన్ని అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోయినా, పెద్దలతో సిఫారసు చేయించుకున్నా వారికి చుక్కలు చూపిస్తున్నారు. డాక్యుమెంట్‌ వివరాలు నమోదు చేసి, కొర్రీలు వేసి ‘పెండింగ్‌’లో పెట్టేస్తున్నారు. దానిని విడిపించుకోవడానికి సదరు వ్యక్తులు కాళ్లు అరిగేలా తిరగడంతో పాటు ముందు అడిగిన మొత్తానికి మరింత జత చేసి ఇవ్వాల్సి వస్తోంది. జిల్లాలో కీలకమైన ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నవారే ఫోన్‌ చేసి చెప్పినా సరే...కొందరు అధికారులు లెక్క చేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డాక్యుమెంట్‌ ఏదైనా  దండుకోవడమే పని

అన్నీ సవ్యంగా ఉన్నా ‘పెండింగ్‌’ అస్త్రం ప్రయోగం

ఎవరు చెప్పినా డోంట్‌ కేర్‌

రిస్క్‌ అయితే ‘ఎనీవేర్‌’తో మస్కా

ఇదీ రిజిస్ర్టేషన్‌ శాఖలో

కొందరు అధికారుల తీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పనితీరులో ఏ మాత్రం మార్పు లేదు. ఏ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు వచ్చినా దాని నుంచి ‘అదనంగా డబ్బులు ఎలా గుంజాలి?’ అనే దానిపైనే అక్కడి అధికారులు దృష్టి పెడుతున్నారు. వారి చేతిలో ఉన్న ‘పెండింగ్‌’ అధికారాన్ని అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోయినా, పెద్దలతో సిఫారసు చేయించుకున్నా వారికి చుక్కలు చూపిస్తున్నారు. డాక్యుమెంట్‌ వివరాలు నమోదు చేసి, కొర్రీలు వేసి ‘పెండింగ్‌’లో పెట్టేస్తున్నారు. దానిని విడిపించుకోవడానికి సదరు వ్యక్తులు కాళ్లు అరిగేలా తిరగడంతో పాటు ముందు అడిగిన మొత్తానికి మరింత జత చేసి ఇవ్వాల్సి వస్తోంది. జిల్లాలో కీలకమైన ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నవారే ఫోన్‌ చేసి చెప్పినా సరే...కొందరు అధికారులు లెక్క చేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘ఎనీవేర్‌’ పేరుతో మరింత దోపిడీ

రాష్ట్రంలో ఎక్కడ ఆస్తి కొన్నా...నచ్చిన చోట రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దీనిని ‘ఎనీ వేర్‌’గా వ్యహరిస్తారు. సాధారణంగా ఏ కార్యాలయం పరిధిలో ఆస్తులు అక్కడే రిజిస్టర్‌ అవుతుంటాయి. కొన్ని ప్రతికూల సమయాల్లోనే కక్షిదారులు ఎనీవేర్‌కు దరఖాస్తు చేస్తారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ఆస్తికి సంబంధించి విశాఖలో రిజిస్ట్రేషన్‌కు పెట్టుకుంటే...ఇక్కడి అధికారులు ఆ పత్రాలను ఆ జిల్లాలో సదరు కార్యాలయానికి పంపించి సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితరాలు వెరిఫికేషన్‌ చేయించి, అప్రూవల్‌ తీసుకోవాలి. ఆ బాధ్యత అంతా ఇక్కడి అధికారిపైనే ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే జిల్లాలో కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని ఆస్తి అయినప్పటికీ నేరుగా దానిని రిజిస్టర్‌ చేస్తే ఇబ్బందులు వస్తాయనుకున్నప్పుడు, సదరు పార్టీకి ‘ఎనీవేర్‌’ కింద ఇతర జిల్లాలో చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. అప్పుడు అక్కడి నుంచి ఆ డాక్యుమెంట్‌ అప్రూవల్‌కు వస్తే దానికి ఓకే చేయడానికి ‘నజరానా’ రూ.లక్షల్లోనే పుచ్చుకుంటున్నారు. రిస్క్‌ మాత్రం ఎనీవేర్‌ చేసిన అధికారిపైకి తోసేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ జిల్లాలో తెలివిమీరిన సబ్‌ రిజిస్ట్రార్లే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి మీద ఫిర్యాదులు వచ్చినా తూతూమంత్రంగానే విచారణలు జరుగుతున్నాయనే అపవాదు కూడా ఉంది.

తప్పు జరిగితే కింది వారిపైకే

సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవుపై వెళితే...ఆరోజు ప్రతి డాక్యుమెంట్‌ను ఫొటో తీసి పెట్టి, ఆయన ఓకే చేస్తేనే సీనియర్‌ అసిస్టెంట్‌ రిజిస్టర్‌ చేయాలి. కాదు అంటే పెండింగ్‌లో పెట్టాలి. అన్నీ వారు చెప్పినట్టే చేసినా, ఏదైనా తిరకాసు వస్తే మాత్రం, ఆ సమయంలో లేమని, అందుకే అలా జరిగిందంటూ దిగువ స్థాయి సిబ్బందిపైకి నెట్టేస్తున్న సంఘటనలు కూడా ఉంటున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - May 07 , 2026 | 01:05 AM