ఐటీ కంపెనీల ఆపసోపాలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:25 AM
విశాఖపట్నంలో ఎకరా 99 పైసల చొప్పున భూమి తీసుకొని, అక్కడ భవనాల నిర్మాణం చేపట్టక ముందే ఆపరేషన్లు ప్రారంభిస్తామని చెప్పిన అతి పెద్ద ఐటీ కంపెనీలు రెండూ వాయిదాలపై వాయిదాలు వేసుకుంటూ పోతున్నాయి.
ఆపరేషన్ల ప్రారంభంలో తీవ్ర జాప్యం
వాయిదాలపై వాయిదాలు వేస్తున్న టీసీఎస్
అధికారులకు సమాచారం నిల్
ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించని కాగ్నిజెంట్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో ఎకరా 99 పైసల చొప్పున భూమి తీసుకొని, అక్కడ భవనాల నిర్మాణం చేపట్టక ముందే ఆపరేషన్లు ప్రారంభిస్తామని చెప్పిన అతి పెద్ద ఐటీ కంపెనీలు రెండూ వాయిదాలపై వాయిదాలు వేసుకుంటూ పోతున్నాయి. కారణాలు ఏమిటో వెల్లడించడం లేదు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు భూములతో పాటు రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో అందమైన భవనాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. అది ఆర్థిక మండలి పరిధిలో ఉందని, డీనోటిఫై చేయాలని కోరితే...ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆ పని కూడా పూర్తిచేసింది. అదే కొండపై 21.6 ఎకరాల భూమిని ఎకరా కేవలం 99 పైసలకే ఇచ్చింది. ఆ భూమిలో ఇప్పటివరకూ శంకుస్థాపన జరగలేదు. మిలీనియం టవర్లలో ఇంటీరియర్ మొత్తం పూర్తయిపోయి రెండు నెలలైంది. బోర్టులు కూడా పెట్టేశారు. సంక్రాంతి వెళ్లగానే ఆపరేషన్లు ప్రారంభిస్తామని ఏపీఐఐసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. జనవరి 29వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నామని ప్రభుత్వానికి తెలియజేశారు. ఏమైందో ఏమో ఆ తేదీకి ప్రారంభం కాలేదు. మరో తేదీని కూడా వెల్లడించలేదు. వాస్తవానికి ఏడాది నుంచి టీసీఎస్ ప్రారంభమవుతుందని ఐటీ వర్గాలు, జిల్లా అధికార యంత్రాంగం చెప్పుకుంటూ వస్తున్నాయి. ఏ కారణాల చేతనో ప్రారంభం కావడం లేదు. ఈ నెలలో అయినా ఉంటుందా? అంటే అదీ అనుమానమేనని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరిలో 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు తూర్పు నౌకాదళం భారీ కార్యక్రమాలు చేపడుతోంది. జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారు. ఆ సమయంలో ప్రారంభించే అవకాశం లేదు. అంటే మళ్లీ మార్చి నెలలోనే అనే మాటలు వినిపిస్తున్నాయి.
బోర్డు కూడా పెట్టని కాగ్నిజెంట్
కాగ్నిజెంట్‌కు కాపులుప్పాడలో 22.1 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చారు. ఆ భూమిలో డిసెంబరు 12వ తేదీన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి వారం సమీక్ష చేస్తామని ఐటీ మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఈ శంకుస్థాపనకు ముందు ఐటీ పార్కులోని హిల్ నంబరు 2లో మహతి భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించారు. 500 మందితో పనిచేస్తుందని ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆ భవనానికి కాగ్నిజెంట్ బోర్డు కూడా పెట్టలేదు. ఆపరేషన్లు కూడా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. విశాఖపట్నం రావడానికి 4,500 మంది ఆసక్తి చూపించారని అప్పట్లో ఆ సంస్థ పెద్దలు ప్రకటించారు. కానీ ఎందుకనో ఇంకా పూర్తిస్థాయి ఆపరేషన్లకు శ్రీకారం చుట్టలేదు.