‘పట్టు’ జారింది
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:30 PM
చింతపల్లిలో పట్టు పరిశ్రమ మనుగడ కోల్పోయింది. కార్యాలయం, ల్యాబ్ భవనాలు శిథిలమయ్యాయి. పట్టు పరిశ్రమకు చెందిన భూములు నిరుపయోగంగా పడి వున్నాయి. ప్రయోగాలు, పట్టు గూళ్లు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయాయి. ఏడాదికి ఒకసారి మొక్కుబడిగా తక్కువ పరిమాణంలో మూగ, టస్సార్ పట్టు సాగు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులకు ఉపాధి దూరమైంది.
మనుగడ కోల్పోయిన పట్టు పరిశ్రమ
వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టు సాగు నిలిపివేత
శిథిలమైన కార్యాలయం, ల్యాబ్ భవనాలు
నిరుపయోగంగా మారిన భూములు
మొక్కుబడిగా మూగ, టస్సార్ పట్టు సాగు
ఉపాధి కోల్పోయిన గిరిజనులు
చింతపల్లి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):
చింతపల్లిలో 50 ఏళ్ల క్రితం పట్టు పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 25 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గతంలో పట్టు పరిశ్రమ అధికారులు మల్బరీ, ఎరీ, టస్సార్, మూగ పట్టు పురుగులు పెంచేవారు. 20 ఏళ్ల క్రితం చింతపల్లిలో మల్బరీ పట్టు గూళ్ల నుంచి పట్టుదారం సేకరించేవారు. కాలక్రమంగా పట్టుదారం సేకరించే యూనిట్‌ని ఎత్తివేశారు. ఆరేళ్ల క్రితం వరకు మల్బరీ, ఎరీ, టస్సార్ పట్టు గూళ్లను ఉత్పత్తి చేసి మార్కెట్ చేసేవారు. కేవలం అసొంలో మాత్రమే పెరిగే మూగ పట్టు చింతపల్లిలో ఉత్పత్తి చేసేందుకు అనుకూలమని అధికారులు గుర్తించడంతో చింతపల్లిలో మూగ పట్టు ఉత్పత్తిని ప్రారంభించారు. మూగ ఉత్పత్తికి సోమ్, సోల్ చెట్లు ఉండాలి. మూగ పట్టు పురుగులు చెట్లలోనే పెరిగి, అక్కడే గూళ్లు కట్టుకుంటాయి. దీంతో మూగ పట్టు ఉత్పత్తి కోసం మండల కేంద్రం అంతర్ల వద్దనున్న 16.5 ఎకరాల్లో ఆరు ఎకరాల్లో సోమ్, సోల్ మొక్కలను పెంచారు. పట్టుపరిశ్రమకు చెందిన 16.5 ఎకరాల్లో 4.5ఎకరాలు ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఏరియా ఆసత్రి నిర్మించే ప్రాంతంలోనున్న సోమ్, సోల్ మొక్కలు తొలగించారు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే సోమ్, సోల్ మొక్కలు ఉన్నాయి.
నిలిచిపోయిన పట్టు ఉత్పత్తి
చింతపల్లిలో పట్టు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతంలో ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో పట్టుగూళ్ల ఉత్పత్తిని చేసేవారు. ఆరేళ్ల క్రితం వరకు ఇక్కడ నాలుగు మల్బరీ, ఎరి, టస్సార్, మూగ పట్టును సాగు చేసేవారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి పట్టు ఉత్పత్తికి సరైన సహకారం లేకపోవడం, నిధుల కొరత కారణంగా పట్టు సాగును నిలిపివేశారు.
వెంటాడుతున్న ఉద్యోగుల కొరత
పట్టు పరిశ్రమకు ఉద్యోగుల కొరత వెంటాడుతుంది. గతంలో పట్టుపరిశ్రమలో సెరీకల్చర్ అధికారి, టెక్నికల్ అధికారులు ఇద్దరు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇద్దరు, ముగ్గురు అటెండర్లు ఉండేవారు. సుమారు 20మంది వరకు కార్మికులు ఉండేవారు. కాలక్రమంగా కార్మికులను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం పట్టుపరిశ్రమ పరిధిలో ఒక్క కార్మికుడు లేరు. ప్రస్తుతం టెక్నికల్ అధికారి, ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో ఉన్నారు.
మొక్కుబడిగా టస్సార్, మూగ సాగు
పట్టు పరిశ్రమలో మొక్కుబడిగా అతి తక్కువ పరిమాణంలో టస్సార్, మూగ సాగు చేపడుతున్నారు. గతంలో మల్బరీ, టస్సార్, మూగ పట్టుని భారీ మొత్తంలో సాగు చేసేవారు. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబరులో 200 టస్సారు పురుగులు పెంచగా ఐదు వేల గూళ్లు ఉత్పత్తి చేశారు. అలాగే 150 మూగ పురుగులను సాగు చేయగా 2,500 గూళ్లను ఉత్పత్తి చేశారు. మూగ గూళ్లను గౌహతి పంపించారు. అక్కడ రైతులు ఈగూళ్లను సీడ్‌గా ఉపయోగించుకున్నారు.
శిథిలమైన భవనాలు
పట్టు పరిశ్రమలో 40 ఏళ్ల క్రితం కార్యాలయం, ల్యాబ్, గోదాము, వర్మికంపోస్టు ఉత్పత్తి షెడ్ నిర్మించారు. ఈ భవనాల నిర్వహణ, మరమ్మతులపై గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పట్టుపరిశ్రమ కార్యాలయం, గోదాము, ల్యాబ్ పూర్తిగా శిథిలమైపోయాయి. వినియోగంలో లేకపోవడంతో భవనాలు కూలిపోయే దశకు చేరుకున్నాయి. పట్టుపరిశ్రమకు చెందిన భూములు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఈభూమిలో ఎటువంటి సాగు జరగడంలేదు. ఈ భూములపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో కొంత స్థలం ఆక్రమణకు గురైంది. అంతర్ల వద్ద నున్న సోమ్, సోల్ మొక్కలు కలిగిన భూములు మందుబాబులకు అడ్డాగా మారింది. పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొనిరావాలని ప్రాంతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
2027లో మూగ ప్రాజెక్టు ప్రారంభం
కె. అప్పారావు, డీఎస్‌వో, పట్టుపరిశ్రమ శాఖ, పాడేరు.
చింతపల్లిలో ప్రతిష్టాత్మకంగా 2027లో మూగ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. మూగ సాగుకి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. మూగ ఉత్పత్తిని భారీ స్థాయిలో చేపట్టనున్నాం. సోమ్, సోల్ మొక్కలను పెంచడం జరుగుతుంది. అలాగే నూతన భవనాలు నిర్మాణం, పాత భవనాల మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.