Share News

తుఫాన్‌ తగ్గింది... నష్టం మిగిల్చింది!

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:18 PM

ఆర్మబ్‌ తుఫాన్‌ తగ్గడంతో జిల్లాలో భారీ వర్షాలకు జరిగిన నష్టాలు వెలుగులోకి వస్తున్నాయి.

తుఫాన్‌ తగ్గింది... నష్టం మిగిల్చింది!
తుఫాన్‌కు దెబ్బతిన్న హుకుంపేట మండలం ఉప్ప- ఒల్డ గ్రామం మధ్యలో కాజ్‌వే

అనేక చోట్ల పాడైన రోడ్లు, వంతెనలు

ఈదురుగాలులకు నేలకొరిగిన వరి పంట

జిల్లాలో 587 హెక్టార్లలో పంటలు, 345 ఇళ్లు ధ్వంసం

తుఫాన్‌ నష్టం రూ.50.46 కోట్లుగా అధికారుల అంచనా

ముందస్తు చర్యలతో ప్రాణనష్టం లేదు..

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

ఆర్మబ్‌ తుఫాన్‌ తగ్గడంతో జిల్లాలో భారీ వర్షాలకు జరిగిన నష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. భారీ ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలకు అనేక చోట్ల గిరిజనులు ఇళ్లు కూలిపోగా, పలు చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసే వరి, రాగులు, సామలు, మొక్కజొన్న, రాజ్‌మా పంటలు చాలా వరకు నాశమయ్యాయి. అనంతగిరి ఘాట్‌ మార్గం కుంగిపోగా, కొయ్యూరు మండలంలో చింతాలమ్మ ఘాట్‌లో విరిగిన కొండచరియలు పునరుద్ధరించగా, పాడేరు ఘాట్‌లో కూలిన చెట్లను అధికారులు తొలగించారు. గ్రామీణా ప్రాంతాల్లోని రోడ్లు, కల్వర్టు, వంతెనలు, పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో తుఫాన్‌ కారణంగా అన్ని రంగాలకు రూ.50 కోట్ల 46 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం 587 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతినగా, 345 ఇళ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలో 24 మూగజీవాలు మృతి చెందగా, అధికారుల ముందస్తు చర్యలు, సహాయక చర్యల నేపథ్యంలో ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. చిన్ననీటిపారుదల శాఖకు చెందిన 29 సాగునీటి వనరులు, 53 కిలోమీటర్ల రోడ్లు, 13 కల్వర్టులు పాడవగా.. 10 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 398 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడగా.. ఒక్క విద్యుత్‌ సంస్థకే రూ.78 లక్షలు నష్టం వాటిల్లింది. అయితే అత్యధికంగా రోడ్లు ధ్వంసం కావడంతో రూ.27 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. తుఫాన్‌లో చిక్కుకోకుండా 474 మందిని సురక్షింత ప్రాంతాలకు తరలించగా, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 422 మందికి ఆశ్రయం కల్పించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం వివిధ పునరుద్ధరణ, సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టారు.

Updated Date - Oct 30 , 2026 | 11:18 PM