ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేస్తోంది..
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:28 AM
నక్కపల్లి మండలంలో ప్రైవేటు రంగంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముహూర్తం సమీపిస్తున్నది.
నక్కపల్లి మండలంలో ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్’ ప్లాంట్‌కు 23న భూమి పూజ
హాజరుకానున్న సీఎం చంద్రబాబునాయుడు
రెండు దశల్లో నిర్మాణం.. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 వేల మందికి ఉపాధి
అనకాపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
నక్కపల్లి మండలంలో ప్రైవేటు రంగంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముహూర్తం సమీపిస్తున్నది. లక్షన్నర కోట్ల పైచిలుకు పెట్టుబడితో ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్’ నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు ఈ నెల 23వ తేదీ భూమి పూజ జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అమరావతిలో ప్రారంభమైన కలెక్టర్ సదస్సులో వెల్లడించారు. రెండు దశల్లో నిర్మించే ఈ ప్లాంట్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశ, విదేశాలకు చెందిన పేరున్న కంపెనీలు, సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. విశాఖపట్నం- చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్‌లోని నక్కపల్లి క్లస్టర్‌లో ఏపీఐఐసీ ఇప్పటికే సేకరించిన భూముల్లో ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్’ సంయుక్తంగా భారీ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ ఉక్కు పరిశ్రమకు ఈనెల 23న భూమిపూజ జరగనుంది. ఈ విషయాన్ని బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్. నక్కపల్లి మండలంలోని డీఎల్ పురం, చందనాడ, వేంపాడు, రాజయ్యపేట తదితర గ్రామాల పరిధిలోని 2,200 ఎకరాల్లో రెండు దశల్లో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నులు.. మొత్తం 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది. ఇక ముడి సరుకుల దిగుమతి, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి కోసం పోర్టు నిర్మిస్తారు. ప్లాంట్‌కు కేటాయించిన భూమి నుంచి జాతీయ రహదారికి కనెక్టివిటీ కోసం నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నారు. మొదటి దశలో 30 వేలు, రెండో దశలో 35 వేలు.. వెరసి సుమారు 65 వేల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారీ ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా అనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ట్రాన్స్‌పోర్టు, లాజిస్టిక్స్, ఇతర రంగాలు అభివృద్ధి చెందనున్నాయి.
రెసిడెన్షియల్ పాఠశాలల్లో జీరో వేస్ట్
కలెక్టర్ విజయకృష్ణన్ వినూత్న ప్రయోగం
కలెక్టర్ల సదస్సులో పవర్ పాయింట్ ప్రజంటేషన్
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
అనకాపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ, గురుకుల పాఠశాలలను ‘జీరో వేస్ట్’ స్కూళ్లుగా మార్చుతూ చేపట్టిన వినూత్న కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నది. కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రయోగం అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చర్చనీయాంశంగా మారింది. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చెత్త నుంచి సంపద సృష్టి (జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్)కి అమలు చేస్తున్న విధానాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయంగా అమలు చేస్తూ జీరో వేస్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. మొత్తం 114 విద్యా సంస్థల్లో చెత్త, వ్యర్థాల నిర్వహణను సమర్థంగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసే విధానం అమలు చేస్తున్నారు. పాఠశాల పరిధిలో ప్రత్యేకంగా గుంతలు తవ్వి తడి చెత్తను కంపోస్టుగా తయారు చేస్తున్నారు. దీనిని స్థానిక రైతులకు నామమాత్రపు ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో వున్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న 24,776 మంది విద్యార్థులను చెత్త నుంచి సంపద తయారీ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. ప్రతి నెలా 57.1 టన్నుల తడి చెత్త, 24.5 టన్నుల పొడి చెత్త వస్తున్నది. కంపోస్టు అమ్మకం ద్వారా రూ.2.17 లక్షల ఆదాయం వస్తున్నది. పొడి చెత్తను రీసైక్లింగ్ కోసం సమీపంలోని స్వర్ణ సచివాలయాలకు అందిస్తున్నారు. హాస్టళ్ల నుంచి వచ్చే వాడుక నీటిని హానికరం కాని నీరు, హానికరం నీరు అని రెండు భాగాలుగా వేరు చేస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు చేస్తున్న జీరో వేస్ట్ విధానం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుందని కలెక్టర్ విజయకృష్ణన్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
సీఎం అభినందనలు
జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలను జీరో వేస్ట్ సంస్థలుగా మార్చడానికి మార్గదర్శకంగా వ్యవహరించిన కలెక్టర్ విజయకృష్ణన్‌ను సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లోని ఖాళీ స్థలాల్లో కూరగాయలు పండించి, వాటిని హాస్టళ్లలో వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ సేవలపై 68.8 శాతం సంతృప్తి
మూడు నెలల క్రితంతో పోలిస్తే 1.6 శాతం అధికం
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి
అనకాపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి 68.8 శాతానికి చేరింది. 2025 డిసెంబరులో జిల్లాలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి శాతం 67.2 శాతం నమోదు కాగా జనవరి, ఫిబ్రవరి నెలలో స్వల్పంగా 1.6 శాతం పెరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పాదర్శక సేవలు, పరిపాలనలో వేగం వంటి అంశాలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలపై ఇటీవల కాలంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి పెరిగినట్టు గుర్తించారు. పౌరసేవలు, సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారంలో అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజల్లో సానుకూల భావన ఏర్పడింది. ప్రజల మస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు కారణంగా సంతృప్తి శాతం పెరుగుతున్నది.