వణికిన ఉక్కు నగరం
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:46 AM
స్టీల్ ప్లాంటు ఉద్యోగులు భయపడినంతా జరిగింది. ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారని, కాంట్రాక్టు కార్మికులను తొలగించారని...ప్లాంటులో నిర్వహణ పనులు సరిగ్గా చేయడం లేదని ఏడాదిన్నరగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు.
ఎస్‌ఎంఎస్ విభాగంలో పేలుడు
తొమ్మిది మంది మృతి, మరో ఐదుగురికి గాయాలు
భయపడినంతా జరిగింది
ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఏడాదిన్నరగా ఉద్యోగులు, కార్మికుల ఆందోళన
పట్టించుకోని యాజమాన్యం...ఇప్పుడు భారీ మూల్యం
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు ఉద్యోగులు భయపడినంతా జరిగింది. ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారని, కాంట్రాక్టు కార్మికులను తొలగించారని...ప్లాంటులో నిర్వహణ పనులు సరిగ్గా చేయడం లేదని ఏడాదిన్నరగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని, ప్రాణాపాయం పొంచి ఉందని అధికారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఇటువంటి తరుణంలో సోమవారం సాయంత్రం ఎస్‌ఎంఎస్ (స్టీల్ మెల్ట్ షాపు) విభాగంలో సంభవించిన భారీ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. సుమారు 1500 డిగ్రీల వేడి గల ద్రవపు ఉక్కు మీద పడడంతో వారంతా కాలిపోయి బొగ్గులా మారిపోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు.
నిర్వహణ నిల్
స్టీల్‌ప్లాంటులోని చాలా విభాగాల్లో గత మూడేళ్లుగా నిర్వహణ పనులు చేపట్డడం లేదు. కొత్త స్పేర్ పార్టులు ఇవ్వడం లేదు. సీనియర్ ఉద్యోగులు ఉన్నవాటికే మరమ్మతులు చేసుకొని నెట్టుకువస్తున్నారు. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటులో కన్వేయర్ బెల్ట్‌లు తెగిపోతున్నాయి. వాటిని ఉద్యోగులే కోసేస్తున్నారని గత సీఎండీ ఏకే సక్సేనా తీవ్ర ఆరోపణలు చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. స్వయంగా పోలీస్ కమిషనర్ విచారణ చేసి అలాంటిదేమీ లేదని తేల్చారు.
సేఫ్టీ ప్రొటోకాల్ ఎక్కడ
ప్రస్తుతం తక్కువ సిబ్బందితో పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని యాజమాన్యం ఒత్తిడి పెడుతోంది. ‘మీరు ఏమి చేస్తారో మాకు అనవసరం. 100శాతం లక్ష్యం సాధిస్తేనే పూర్తి జీతం. లేదంటే కోతే’ అని హెచ్చరించి, అలాగే జీతాలు ఇస్తోంది. ఈ క్రమంలో ప్లాంటులో స్టీల్ తయారీలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ వస్తున్నారు. సేఫ్టీ ప్రొటోకాల్ పాటించడం లేదు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం కూడా కాస్టింగ్ డిపార్ట్‌మెంట్‌కు త్వరగా హాట్‌మెటల్ పంపాలనే ఆత్రం ప్రదర్శించడం వల్లే భారీ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.
అంతా షాక్..
స్టీల్ మెల్టింగ్ షాపులో ల్యాడిల్ పేలుడు ఘటన సోమవారం సాయంత్రం ప్రమాదం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇంత భారీ ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. అది కూడా ల్యాడిల్ పేలిన ఘటనలు ఎక్కడా నమోదు కాలేదు. ఇది కొత్త తరహా ప్రమాదం. తీవ్రమైనది. చాలా నష్టం జరిగింది. ఎలా జరిగిందనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.
కుటుంబాల ఆందోళన
ప్రమాదం విషయం తెలుసుకొని ఉద్యోగ, కార్మిక సంఘాలు, కుటుంబాలు ప్లాంటు వద్దకు చేరుకున్నాయి. మృతదేహాలనకు కేజీహెచ్‌కు తరలించకుండా అడ్డుకున్నాయి. రాజకీయ నాయకులు వచ్చి పలకరించబోతే కార్మిక సంఘాలు ముఖం చాటేశాయి. ఇన్నాళ్లూ తాము సమస్యలు చెబితే పట్టించుకోలేదని నిరసన వ్యక్తంచేశారు. ప్లాంటు యాజమాన్యం తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. హుటాహుటిన సహాయ కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం అందించడానికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది.
హాహాకారాలు...ఆర్తనాదాలు
ఉక్కు జనరల్ ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
ఉక్కుటౌన్ షిప్/కూర్మన్నపాలెం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
విశాఖ స్టీలుప్లాంటులో సోమవారం సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదం కార్మిక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు నగరంలోని సుమారు 40 అంబులెన్సులు ఉక్కునగరం ఆస్పత్రికి చేరుకున్నాయి. ఒకపక్క మోగుతున్న సైరన్లు, మరోపక్క మృతులు ఎంతమంది, క్షతగాత్రులు ఎంతమందో తెలియక ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులు భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంగణంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
మృతదేహాలు తరలించకుండా అడ్డగింత
క్షతగాత్రుల కుటుంబసభ్యులు భారీగా చేరుకోవడంతో ఆస్పత్రి వద్ద రోదనలు మిన్నంటాయి. ఏం జరిగిందో స్పష్టమైన సమాచారం లేక శనివాడ, అగనంపూడి సమీప గ్రామాలు నుంచి వచ్చిన ఉక్కు కార్మికుల కుటుంబసభ్యులు రోదిస్తూ పోలీసులు, ఉక్కు కార్మికుల చుట్టూ తిరుగున్న వైనం అక్కడివారిలో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించకుండా వారి కుటుంబసభ్యులు అంబులెన్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారుల, స్టీల్‌ప్లాంటు సీఎండీ ఆస్పత్రి వద్దకు రావాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కార్మికుల కుటుంబసభ్యుల మధ్య తోపులాట జరిగింది.
ఘటనపై ప్లాంటు అధికారుల ఆరా
ప్రమాదం సంభవించిన అనంతరం స్టీలుప్లాంటు యాజమాన్యం అత్యవసర సమావేశం నిర్వహించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి, విచారణకు ఆదేశించింది. విధి నిర్వహణలో లోపాలా లేక సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. స్టీల్‌ప్లాంటులో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.
అమ్మో జూన్...
జూన్ వచ్చిందంటే ఉక్కు కార్మికులు తీవ్రంగా కలత చెందుతున్నారు. 2012 జూన్ 12న ఎస్‌ఎంఎస్-2లో జరిగిన ఘోర ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అప్పటి ఘటనలో 19 మంది ఉక్కు కార్మికులు మృతిచెందారు. ఆ చేదు ఘటన కొన్నేళ్ల పాటు కార్మికుల కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది. మళ్లీ 2026 జూన్ 8న ఎస్‌ఎంఎస్-1లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరి కొందరు క్షతగాత్రులవడంతో జూన్ మాట వింటేనే బెంబేలెత్తిపోతున్నారు.
నేడు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాక
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం నగరానికి రానున్నారు. ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం మృతుల కుటుంబాలను, గాయపడినవారిని పరామర్శిస్తారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్
ఆస్ప్రత్రుల వద్ద అధికారులకు విధులు
విశాఖపట్నం, జూన్ 8 (ఆంరఽధజ్యోతి):
ఉక్కు కర్మాగారంలో సోమవారం ప్రమాదం జరిగిన నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేశారు. ప్రమాద సమాచారం తెలియజేయడానికి కంట్రోల్‌రూమ్‌లో సిబ్బందిని నియమించారు. కంట్రోల్‌రూమ్ (ఫోన్ నంబరు 0891-2590100, 0891-2590102)కు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చునని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశ్‌ర్ తెలిపారు. కాగా, క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వద్ద అధికారులు, సిబ్బందిని నియమించారు. వెంకోజీపాలెం మెడికవర్ ఆస్ప్రత్రి వద్ద కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ పి.శేషశైలజ (ఫోన్ నంబరు 91000 64971), రామ్‌నగర్‌లోని ఎంజీఎం సెవెన్‌హిల్స్ వద్ద భీమిలి ఆర్డీవో సంగీల్‌మాధుర్ (98499 03854), షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద గోపాలపట్నం తహశీల్దారు సీహెచ్‌వీ రమేష్ (91000 64976), ఉక్కునగరంలో జనరల్ ఆస్పత్రి వద్ద గాజువాక తహశీల్దారు ఎస్‌ఎ త్రినాథ్ (98499 03843)విధులు నిర్వహిస్తున్నారు.
కలెక్టర్‌కు సీఎం ఫోన్
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద ఘటన, క్షతగాత్రులకు అందుతున్న చికిత్స, ప్రస్తుత పరిస్థితిని సీఎంకు కలెక్టర్ వివరించారు. ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారని, గాయపడిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీఎంకు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు.