Share News

ఆరంభం అదిరింది

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:19 AM

కూటమి ప్రభుత్వ హయాంలో వరుసగా రెండో ఏడాది ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు తొలిరోజు గురువారం విజయవంతంగా సాగింది.

ఆరంభం అదిరింది

పెట్టుబడుల సదస్సుకు పెద్దఎత్తున తరలివచ్చిన పారిశ్రామికవేత్తలు

ముఖ్యమంత్రి సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు

పరిశ్రమల ఏర్పాటుకు కుదిరిన ఒప్పందాలు

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వ హయాంలో వరుసగా రెండో ఏడాది ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు తొలిరోజు గురువారం విజయవంతంగా సాగింది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సంప్రదాయ కళాకారులు తమ ప్రదర్శనలతో వారికి స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలకు ఉత్సాహపడిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ డప్పులు వాయించి సందడి చేశారు. అరకు థింసా నృత్యం వీక్షించి ఆనందం వ్యక్తంచేశారు.

అనంతరం ఏపీ పెవిలియన్‌, ఎంఎస్‌ఎంఈ పెవిలియన్‌లను కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ప్రాంతంలో ఏయే పంటలు పండుతున్నాయి, వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధికి గ్రోత్‌ స్టోరీలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల అభివృద్ధి, దేశాభివృద్ధికి ప్రధాని సూచనలను డిజిటల్‌ స్ర్కీన్‌పై అధికారులు ప్రదర్శించారు. అనంతరం ప్రధాన హాల్‌లో సదస్సు ప్రారంభ వేడుకలు జరిగాయి. సుమారు రెండున్నర గంటలపాటు సీఎంతో పాటు ఇతర ప్రముఖులు ప్రసంగించి, సదస్సు ఉద్దేశాన్ని, రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.

రోజంతా సమావేశాలు

భోజన విరామం తరువాత సమావేశ మందిరాల్లో వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, లోకేశ్‌ సమక్షంలో పలు ఒప్పందాలు జరిగాయి. తొలిరోజు రూ.5,84,345 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు 73 ఒప్పందాలు చేసుకున్నారు. వీటిని అమలుచేయడం ద్వారా 1,07,693 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. తొలిరోజు ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గ్రీన్‌కో ఎనర్జీస్‌, క్లీన్‌మ్యాక్స్‌ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్‌, మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, కియా ఇండియా తదితర భారీ సంస్థలు ఉన్నాయి.

ఏపీ పెవిలియన్‌కు ప్రశంసలు

రాష్ట్రంలో అభివృద్ధి, వనరులు, వ్యవసాయం, సాంకేతిక రంగం, అమరావతి నగరం విశిష్టత వివరించేలా సభా ప్రాంగణంలో తీర్చిదిద్దిన ఏపీ పెవిలియన్‌ అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. సదస్సుకు వచ్చిన వారంతా దీనిని సందర్శించి విశేషాలను తెలుసుకున్నారు. ఫొటోలు దిగారు. అరకు కాఫీ స్టాల్‌లో కాఫీ కోసం సందర్శకులు ఎగబడ్డారు. రాష్ట్ర్ట్రంలో ప్రసిద్ధులైన వ్యక్తుల ఫొటోలతో ఏర్పాటుచేసిన ఫ్రేమ్‌ ఆకర్షణీయంగా నిలిచింది. మంత్రి లోకేశ్‌ ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా గడిపారు. పలు హాళ్లలో నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారు. ఒక కార్యక్రమంలో అపోలో ఆస్పత్రి గ్రూప్‌ ప్రతినిధి, సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. కాగా సదస్సుకు వచ్చిన అతిఽథులు, ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం అపూర్వ స్వాగతం పలికింది. రెండోరోజు శుక్రవారం సదస్సు ముగింపు వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హాజరవుతారు.


పెట్టుబడులకు ఆసక్తి

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఆసక్తి, విధానాలు, సత్వర పాలనాపరమైన అనుమతులతో సంతృప్తి చెందామన్నారు.

రూ.42 వేల కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలోని సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రూ.42 వేల కోట్లతో సౌర, పవన విద్యుత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ చేసుకున్నాం. ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు అనుకూ లంగా ఉండడంతో వచ్చాం. ఇండియాలోని ఏడుచోట్ల మా సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. మూడు గిగావాట్ల విండ్‌, ఒక గిగావాట్‌ సోలార్‌లో పెట్టుబడులు పెట్టనున్నాం.

- వంశీ కృష్ణ పిల్లా, క్లీన్‌మ్యాక్స్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సౌత్‌ ఇండియా)

రూ.750 కోట్లతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు

సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న మా కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ చేసు కున్నాం. రూ.750 కోట్లతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు/ బ్యాటరీ రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నాం. తొలి దశలో తిరుపతి, విశాఖ, అమరావతిలో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించి 50 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. రానున్న రెండేళ్లలో మరో 450 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తొలి దశలో ప్రత్యక్షంగా వంద మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుంది.

- నాగరాజన్‌, లాయ్‌ యుయాన్‌ వెంగ్‌, ఎంఎన్‌ఎల్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్స్‌

బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌లో పెట్టుబడులు

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ రంగంలో పనిచేస్తున్నాం. ఏపీలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ చేసుకున్నాం. విజయనగరం జిల్లాలో 20 ఎకరాల్లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. దీనివల్ల 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భారీ బ్యాటరీలను వినియోగించి విద్యుత్‌ను నిల్వచేసి, అవసరమైన సమయంలో వినియోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థ అందిస్తుంది. ఏపీ ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహంతో వచ్చాం. ఏడాదిలో ప్రాజెక్టును ప్రారంభించడమే లక్ష్యం.

- అవినిష్‌ అగర్వాల్‌, ట్రైపోస్‌ పవర్‌ ఫౌండర్‌

రూ.50 కోట్లతో ఫర్నిచర్‌, ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ

రూ.50 కోట్లతో సబ్బవరంలో ఫర్నిచర్‌ అండ్‌ ఫుట్‌వేర్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఇండస్ర్టీ పెట్టేందుకు ఎంవోయూ చేసుకున్నాం. దీని ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి లభిస్తుంది.

- గంటా వెంకట సుభాష్‌కుమార్‌, దేవేంద్ర లెదర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

నక్కపల్లిలో రూ.45 కోట్ల పెట్టుబడి

నక్కపల్లిలో రూ.45 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ప్రారంభించేందుకు ఎంవోయూ చేసుకున్నాం. 12 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, చానెల్‌ పార్టనర్స్‌గా మరో 600 మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే 4,500 మంది ఇంప్లిమెంటేషన్‌ రిపేరింగ్‌ బిల్డింగ్స్‌ నేషనల్లీ (ఆర్‌బీఎన్‌) ఎకో సిస్టమ్‌లో భాగస్వాములుగా మారతారు. ట్రైనింగ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నాం.

- డాక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, రీహాబ్‌ టెక్నాలజీస్‌


విశాఖ క్లీన్‌, సేఫ్‌, గ్రీన్‌ సిటీ

మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం

2028 ఆగస్టు 15కి గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రారంభం

2027లో అరకు తీసుకువెళ్లి కాఫీ తాగిస్తా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

మరో మూడు మూడు, నాలుగు నెలలు...అంటే వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజక్టు పూర్తవుతుందని, విశాఖపట్నానికి పూర్తిస్థాయిలో నీరు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సు గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పర్యటన రద్దు కావడంతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఐటీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌ నాయుడులతో కలిసి సీఎం సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన వేదికపై నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడుతూ దేశంలోనే భారీ విదేశీ పెట్టుబడితో నిర్మిస్తున్న గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ 15 ఆగస్టు 2028 నాటికి ప్రారంభిస్తామని ప్రకటించారు.

విశాఖపట్నం నగరానికి అనేక ప్రత్యేకతలున్నాయని, తాజాగా దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం (క్లీన్‌ సిటీ)గా అవార్డు అందుకుందన్నారు. నగరంలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తూ, ఆహ్లాదకరంగా గ్రీన్‌ సిటీగా తలపిస్తోందన్నారు. మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. లింక్‌డ్‌ఇన్‌లో కూడా విశాఖ ప్రత్యేకత చాటుకుందన్నారు. సదస్సుకు వచ్చిన వారంతా అరకు కాఫీ రుచి చూడాలని, వచ్చే ఏడాది సదస్సుకు వచ్చే అతిథులను అరకు తీసుకెళ్లి అక్కడి కాఫీ తోటలు చూపిస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ సీఐఐ సదస్సులకు శాశ్వత వేదికగా చంద్రబాబు నాయుడు విశాఖను మార్చేశారని చమత్కరించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుతులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఐటీ మంత్రి లోకేశ్‌ సదస్సు ప్రాంగణం అంతా తిరిగి ఏపీ పెవిలియన్‌లో ప్రతి అంశాన్ని తెలుసుకున్నారు. సవర జాతికి చెందిన గిరిజనుడు ‘సవర ఆదివాసీ కళ’ పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్‌ వద్దకు వెళ్లి చంద్రబాబు, పీయూష్‌ గోయల్‌ కుంచెలు పట్టుకొని బొమ్మలకు రంగులు వేశారు. అరకు కాఫీ స్టాల్‌ వద్ద ఘుమఘుమలాడే కాఫీని సేవించారు. దూరంగా ఉన్న మంత్రులు లోకేశ్‌, రామ్మోహన్‌నాయుడులను కూడా పిలిచి కాఫీ ఆఫర్‌ చేశారు. ప్రవేశం ద్వారం వద్ద గిరిజనులతో కలిసి ధింసా నృత్యం చేశారు.

సదస్సులో భాగంగా తొలి రోజు శుక్రవారం 73 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్కడికక్కడే 15 జీవోలు జారీ చేసింది. దీని ద్వారా రూ.5,84,355 కోట్ల పెట్టుబడులు, ఆయా సంస్థల్లో 1,07,693 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.


వ్యాపారాభివృద్ధికి బిజినెస్‌ టు బిజినెస్‌

మద్దిలపాలెం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

సీఐఐ భాగస్వామ్య సదస్సులో వ్యాపార సంస్థల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రభుత్వంతోనే కాకుండా వ్యాపార సంస్థలు ఒకరితో ఒకరు ఒప్పందాలు చేసుకునేందుకు బి2బి (బిజినెస్‌ 2 బిజినెస్‌) సమావేశాలు నిర్వహించారు. ఓ లాంజ్‌లో 20 సీట్లతో వ్యాపారుల మధ్య సంభాషణలకు అవకాశమిచ్చారు. దేశ, విదేశాల వ్యాపారవేత్తలు తమ వ్యాపార పురోగతిపై ఏ సంస్థ నిర్వాహకులతో సంభాషించాలో వెబ్‌సైట్‌ ద్వారా ముందు నిర్ణయించుకున్నారు. ఆయా సంస్థలకు టేబుల్‌ కేటాయించి అక్కడే చర్చించుకోవడానికి 15 నిమిషాల సమయం కేటాయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. సుమారు 700 కంపెనీల నిర్వాహకులు తమ వ్యాపార ఒప్పందాలకు చర్చలు జరపగా 200 సంస్థల వరకు కలిసి వ్యాపారం చేసేందుకు నిర్ణయించుకున్నాయి.


ప్రత్యేక ఆకర్షణగా ‘ఏపీ పెవిలియన్‌’

వివిధ రంగాల ప్రత్యేకతలతో 14 విభాగాలు

అమరావతి నగర విశిష్టతలతో మరో విభాగం

ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి):

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యం, పెట్టుబడుల అవకాశాలు, పర్యాటకం, వారసత్వ సంపద, సంస్కృతితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియజేసేలా దీన్ని తీర్చిదిద్దారు. సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పెవిలియన్‌లోని 14 విభాగాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, వాటికి సంబంధించిన వీడియోలను డిజిటల్‌ స్ర్కీన్‌లపై వీక్షించి, తమకు కావాల్సిన వివరాలను అక్కడున్న ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కేంద్ర మంత్రులు పీయూష్‌ కుమార్‌ గోయల్‌, రామ్మోహన్‌ నాయుడుతో కలిసి సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అందులోని వివిధ విభాగాలను పరిశీలించారు. ‘ఏపీ పెవిలియన్‌’ బ్లాక్‌ రాష్ట్ర ప్రగతికి అద్దం పట్టిందని, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పారిశ్రామిక ప్రగతిని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించిందని చంద్రబాబు కితాబిచ్చారు. ఏ ప్రాంతంలో, ఏ పంటలు పండుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయనే అంశాలను డిజిటల్‌ స్ర్కీన్ల ద్వారా మంత్రి లోకేశ్‌, స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ను చంద్రబాబు వివరించారు. పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన అరకు కాఫీస్టాల్‌ను పీయూష్‌ గోయల్‌కు ప్రత్యేకంగా చూపించి, కాఫీ రుచి చూడాలని కోరారు. అనంతరం వారంతా కలిసి అరకు కాఫీ తాగారు.

Updated Date - Nov 13 , 2026 | 01:19 AM