మెయిర్‌రోడ్డు విస్తరణకు రంగం సిద్ధం
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:40 PM
జిల్లా కేంద్రం పాడేరులోని మెయిన్‌రోడ్లు విస్తరణకు రంగం సిద్ధమైంది. స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి విశాఖపట్నం, అరకులోయ, చింతపల్లి మార్గాల వైపు రెండేసి కిలోమీటర్లు విస్తరించనున్నారు. చింతపల్లి వైపు మార్గాన్ని నేషనల్ హైవే అఽథారిటీ ఆధ్వర్యంలోను, అరకులోయ, విశాఖపట్నం వైపు మార్గాలను రోడ్ల, భవనాల శాఖ ద్వారా విస్తరణ చేయాలని గతంలోనే నిర్ణయించారు.
సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభం
జి.మాడుగుల వైపు పనులు
నేషనల్ హైవే అథారిటీ కి అప్పగింత
అరకులోయ, విశాఖపట్నం వైపు ఆర్‌అండ్‌బీకి..
చాలా చోట్ల ఆక్రమణల తొలగింపు
ఇప్పటికే నష్టపరిహారం చెల్లింపు
ఇంకా ఆక్రమణలు తొలగించని వారికి హైవే అథారిటీ నోటీసులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్ల విస్తరణ రోడ్ల, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని 2016లోనే ప్రతిపాదించారు. అందుకు గానూ 2018లోనే రూ.47 కోట్లు మంజూరు చేశారు. కాని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను రద్దు చేసింది. తర్వాత 2023లో వైసీపీ ప్రభుత్వం సైతం రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు చేసి విఫలమైంది. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ మెయిన్‌రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం రాజమండ్రి నుంచి విజయనగరం వరకు 516ఈ జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. దీంతో పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా చింతపల్లి వైపు ఉన్న మెయిన్‌రోడ్డు విస్తరణ పనులను నేషనల్ హైవే అథారిటికే అప్పగించారు. ఇప్పటికే రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాల ఎంపిక, ఆక్రమణలు గుర్తింపు పూర్తి చేశారు. ఆక్రమణల తొలగింపులో నష్టపోతున్న వారికి నష్టపరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈక్రమంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆక్రమణలను మరో వారం రోజుల్లో తొలగించాలని, తాజాగా హైవే అథారిటీ అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అంబేడ్కర్ సెంటర్ నుంచి అరకులోయ వైపు, విశాఖపట్నం వైపు ఉన్న రోడ్ల విస్తరణకు సైతం సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలోనే ఆ రెండు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను రెవెన్యూ, రోడ్ల, భవనాల శాఖాధికారులు తొలగించారు.
మెయిన్ రోడ్లు విస్తరణ జరిగేదిలా..
పాడేరు మెయిన్‌రోడ్ల విస్తరణలో భాగంగా స్థానిక అంబేడ్కర్ కూడలి సెంటర్ పాయింట్‌గా అటు అరకులోయ వెళ్లే మార్గం, ఇటు విశాఖపట్నం వెళ్లే రోడ్డు, మరోవైపు చింతపల్లి వెళ్లే రహదారి ఉంది. అంబేడ్కర్ సెంటర్ నుంచి మూడు మార్గాల్లోని మెయిన్ రోడ్డును రెండు కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డు 21 అడుగులు, అరకులోయ, విశాఖపట్నం వెళ్లే రోడ్లు 30 అడుగులు చొప్పున వెడల్పున్నాయి. దీంతో మూడు రోడ్లను 54 అడుగులుగా విస్తరించాలని, దానిలో ఇరువైపులా ఆరేసి అడుగుల చొప్పున నడకదారి, మధ్యలో 42 అడుగుల తారురోడ్డు వేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 35 అడుగుల చొప్పున స్థల సేకరణ ప్రక్రియ చేపట్టారు.
విస్తరణతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
పాడేరు మెయిన్‌రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టగలమని అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు రెవెన్యూ డివిజన్ కేంద్రం, ఐటీడీఏ ప్రధాన కేంద్రంగా ఉన్న పాడేరు 2022 ఏప్రిల్ నుంచి జిల్లా కేంద్రం కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. అలాగే విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలంటే పాడేరు మీదుగా వెళ్లాలి. ఈ క్రమంలో పాడేరు పట్టణంలోని ప్రస్తుతం ఉన్న రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈక్రమంలో జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్లను విస్తరించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.