పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:56 AM
గ్రామ పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి ముగియనుంది. గడువులోగా ఎన్నికల నిర్వహణకు కీలకమైన ఓటర్ల జాబితాల రూపకల్పన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జిల్లా పంచాయతీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
- ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం
- ఈసీ ఆదేశాలతో ఓటర్ల జాబితాల రూపకల్పనపై అధికారుల కసరత్తు
- ఓటర్ల జాబితాల ప్రకటన తరువాత ఎన్నికల తేదీల వెల్లడి
- గ్రామాల్లో మొదలైన రాజకీయ వేడి
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
గ్రామ పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి ముగియనుంది. గడువులోగా ఎన్నికల నిర్వహణకు కీలకమైన ఓటర్ల జాబితాల రూపకల్పన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జిల్లా పంచాయతీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జిల్లా పంచాయతీ అధికారులు ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాల తయారీపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 24 మండలాల్లో 646 గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితాల రూపకల్పనపై సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల పంచాయతీల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా 31 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపినా ఆమోదం తెలుపుతూ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 646 గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డుల వారీగా ఫొటోలతో ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో 14,94,947 మంది జనాభా ఉండగా, 2026 జనవరి 1వ తేదీ నాటికి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు రూపొందించనున్నారు. జిల్లాలో 2024లో సార్వత్రిక ఎన్నికల నాటికి ఎస్‌ఈసీ ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,73,591 మంది ఓటర్లు ఉన్నారు. 2025 జనవరిలో ఎస్‌ఈసీ ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 12,91,044 మంది ఉన్నారు. గత ఏడాది 17,453 మంది ఓటర్లు పెరిగారు. ఈ ఏడాది మరో 15 వేల పైచిలుకు ఓటర్లు పెరగనున్నారని అంచనా వేస్తున్నారు. ఇంకా 2026 ఓటర్ల జాబితా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఈ నెల 9వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటన అనంతరం పంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు రూపొందించనున్నారు. ఎన్నికల సంకేతాలు రావడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోవైపు గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్‌ల ఖరారుపై కూడా కసరత్తు జరుగుతోంది. ఓటర్ల జాబితాల రూపకల్పనకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుందని, దాని ఆధారంగా గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించి ముసాయిదా జాబితాలను పంచాయతీ కేంద్రాల్లో ప్రకటిస్తామని జిల్లా పంచాయతీ అధికారి సందీప్ తెలిపారు. 2026 జనవరి 1 నాటికి జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తామన్నారు. అయితే ఈ ప్రక్రియ జరిపేందుకు ఎస్‌ఈసీ నుంచి ఇంకా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉందని తెలిపారు.