ఎంపీడీవో తీరుపై సిబ్బంది గుర్రు
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:05 AM
మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల ఎంపీడీవో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగులతో సొంత కారును తుడిపించుకుంటున్నారని ఆరోపిస్తూ వేంపాడు ఎంపీటీసీ సభ్యుడు కుంచె మధు, జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ
సిబ్బందితో కారు తుడిపిస్తున్నారని జడ్పీ సీఈవోకు ఎంసీటీపీ సభ్యుని ఫిర్యాదు
నక్కపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల ఎంపీడీవో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగులతో సొంత కారును తుడిపించుకుంటున్నారని ఆరోపిస్తూ వేంపాడు ఎంపీటీసీ సభ్యుడు కుంచె మధు, జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందుకు తగిన ఆధారాలను ఫొటోతో సహా జతచేశారు. వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరోవైపు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది కూడా ఎంపీడీవో తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీస గౌరవం ఇవ్వడం లేదని, చీటికీమాటికీ చిర్రుబుర్రులాడుతున్నారని, ఇలా అయితే తాము పనిచేయలేమని సీనియర్ ఉద్యోగులు, కార్యదర్శులు అంటున్నారు. అవసరమైతే మూకుమ్మడిగా సెలవు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కేటాయించిన కారును కాకుండా, ఎంపీడీవో తన సొంతకారును మండల పరిషత్ సిబ్బందితో ఎలా తుడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ విషయమై సోమవారం ఎంపీడీవో చైతన్య, కార్యాలయం సిబ్బంది మధ్య పంచాయితీ జరిగింది. కారు తుడుస్తున్న ఫొటోలను ఎందుకు బహిర్గతం చేశారని ఎంపీడీవో ప్రశ్నించారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అనంతరం ఈ విషయమై ఎంపీడీవో చైతన్యను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. అటెండర్‌తో కారు శుభ్రం చేయించుకోవచ్చని డ్యూటీ చార్టులో వుందని చెప్పారు. అలా ఎక్కడ వుందో చూపించాలని విలేకరులు అడగ్గా.. ఆ విషయాన్ని పక్కనపెట్టి, తనపై కావాలనే కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.