Share News

కల్యాణ వైభోగమే

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:29 AM

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచలం వరాహలక్ష్మీనృసింహుడు, భూదేవి, నీలాదేవిల వార్షిక తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి భక్తుల హరినామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

కల్యాణ వైభోగమే

సింహగిరికి ఉత్సవ శోభ

అంగరంగవైభవంగా సింహాచలేశుడి వార్షిక తిరు కల్యాణోత్సవం

వాద సంవాదాల నడుమ ఎదురుసన్నాహం

హరినామ స్మరణల నడుమ ఘనంగా రథోత్సవం

సింహాచలం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచలం వరాహలక్ష్మీనృసింహుడు, భూదేవి, నీలాదేవిల వార్షిక తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి భక్తుల హరినామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా చైత్రమాస శుక్లపక్ష దశమి నుంచి కల్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈనెల 28న అంకురార్పణతో కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, ప్రభాత ఆరాధనలు, విశేష హోమాలు, బాలభోగ నివేదన, గ్రామబలిహరణం చేశారు. మధ్యాహ్నం 3 నుంచి ఆస్థాన మండపంలో రోలురోకలితో పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవం నిర్వహించారు. ఇందులో ఈవో వెంకటరావు దంపతులు, మహిళలు పాల్గొని పసుపు దంచారు. అనంతరం నూతన యాగశాలలో అగ్నిప్రతిష్ఠాపన చేసి విశేష హోమాలు చేశారు.

దేవతల ఆహ్వానం..

వరాహలక్ష్మీనృసింహుని వార్షిక తిరుకల్యాణ మహోత్సవానికి దివిలోని ముక్కోటి దేవతలకు ఆహ్వానంగా ధ్వజారోహణం చేపట్టారు. గరుడ చిత్తర్వుగల పటానికి పూజలు చేసి, అష్టదిక్పాలకులకు ఆహ్వానం పలుకుతూ గరుడ గద్యలను డోలు వాయిద్యంతో లయబద్ధంగా వాయిస్తూ పాటలు పాడారు. అనంతరం ప్రధానాలయ ముఖద్వారం వద్దగల ధ్వజస్తంభానికి గరుడ ధ్వజాన్ని ఎగురవేసి దేవతలను ఆహ్వానించారు. గరుడ ప్రసాదాన్ని దీర్ఘకాలంగా సంతానలేమితో బాధపడుతున్న భక్తులు స్వీకరించారు.

ఉత్సాహంగా ఎదురుసన్నాహం

రాత్రి 6.30 గంటలకు బంగారు తొళిక్కినియాన్‌లో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని, ముత్యాల పల్లకిలో భూదేవి, నీలాదేవిలను అధిష్ఠింపజేసి పడమర మాడవీధిలో జోడుభద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై అధిష్ఠింపజేసి ఎదురు సన్నాహోత్సవం నిర్వహించారు. అర్చకస్వాములు ఇరువురి గోత్రనామాలు, ప్రవరలు, రుషులు, గుణగణాలు వివరించి ఇరువురిని వివాహానికి అంగీకరింపచేసి కల్యాణ లగ్నపత్రికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పుష్పమాలికల మార్పిడి ఘట్టాన్ని అర్చకులు నాద వాయిద్యానికి అనువుగా నర్తిస్తూ ఆవిష్కరించిన తీరు ప్రత్యేకతను సంతరించుకుంది. సంవాదసేవలో సంస్కృత, వేద పండితులు పుల్లెల సత్యనారాయణశర్మ, ముష్టి పవన్‌కుమారశర్మలు వాదనా పటిమతో ఆకట్టుకున్నారు.

ఆనందోత్సాహాల నడుమ రథోత్సవం

ఎదురుసన్నాహం అనంతరం ఇద్దరు దేవేరులతో స్వామివారిని రాజగోపురం ఎదురుగా నిలిపి విద్యుద్దీపాలు, పూలమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన రథంలో అధిష్ఠింపజేసి విశేష అలంకరణలు చేశారు. రథానికి ఆలయ అనువంశిక ధర్మకర్త కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు కొబ్బరికాయ కొటి,్ట తొలిపూజ చేసి రథయాత్రను ప్రారంభించారు. ఉత్తరాంరఽధ నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తుల హరినామస్మరణల నడుమ రథసారధి జాలరికుల పెద్ద కదరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో సింహగిరి మాడవీధుల్లో రథయాత్ర శోభాయమానంగా సాగింది. ఈ సందర్భంగా కళాకారుల పులివేషాలు, తప్పెటగుళ్లు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. రథోత్సవంలో దివంగత ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతి, కుమార్తె ఊర్మిళా గజపతి, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు దంపతులు, చోడవరం ఎమ్మెల్యే జీఎస్‌ఎన్‌ రాజు పాల్గొన్నారు.

వైభవంగా కల్యాణోత్సవం

రథయాత్ర అనంతరం నృసింహ మండపంపై పరిమళభరిత పుష్పాలతో నయనానందకరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక కల్యాణ వేదికపైకి స్వామి, అమ్మవార్లను తొడ్కొని వచ్చారు. ఆలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ పర్యవేక్షణలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో విష్వక్సేనారాధనతో వార్షిక తిరుకల్యాణమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ముడు కలశాలకు పుణ్యాహవాచనము జరిపిన పవిత్ర జలాలతో కల్యాణవేదికను, సంబారాలను, భక్తులను, అతిథులను, ఆలయ సిబ్బందిని ప్రోక్షణ గావించారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణలు చేసిన తర్వాత మధుపర్కాలను వధూవరులకు సమర్పించారు. కన్యాదానం, పాదప్రక్షాళనం జరిపిన తర్వాత శుభముహూర్తవేళ మంగళవాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్రా బెల్లం ఉంచారు. మాంగళ్య దేవతలకు షోడశోపచారాలతో పూజలు చేసి, లక్ష్మీఅష్టోత్తర శతనామావళితో అర్చించారు. భక్తుల గోవిందనామ స్మరణలు, దేవతల ఆశీర్వచనాల నడుమ మాంగళ్యధారణ గావించారు. ముత్యాలు కలిపిన తలంబ్రాలతో అక్షితారోపణము వేడుకగా చేపట్టారు. అనంతరం ప్రత్యేక కౌంటర్లలో తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాల భక్తులకు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భక్తులకు సేవలందించారు.

Updated Date - Mar 30 , 2026 | 01:29 AM