Share News

అల్లుడే చంపేశాడు...

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:52 AM

తమ ఒక్కగానొక్క కుమార్తె రాధాగాయత్రిని అల్లుడు శ్రీచరణే పథకం ప్రకారం చంపేశాడని ఆమె తల్లిదండ్రులు సుధాకర్‌, సత్యవతి గురువారం విశాఖపట్నం పోలీస్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.

అల్లుడే చంపేశాడు...

పోలీస్‌ కమిషనరేట్‌లో రాధాగాయత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు

అనుమానిస్తున్నాడని చెబితే సర్దుకుపోవాలని సూచించా

భర్త పెడుతున్న బాధలన్నీ కుటుంబ సభ్యులందరి ముందు చెబుతా...

మీరు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటానంది

విశాఖపట్నం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):

తమ ఒక్కగానొక్క కుమార్తె రాధాగాయత్రిని అల్లుడు శ్రీచరణే పథకం ప్రకారం చంపేశాడని ఆమె తల్లిదండ్రులు సుధాకర్‌, సత్యవతి గురువారం విశాఖపట్నం పోలీస్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. విశాఖపట్నానికి చెందిన టెకీ రాధాగాయత్రి ముస్సోరిలోని హోమ్‌స్టేలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెను ఢిల్లీ నుంచి విహారయాత్రకు తీసుకువెళ్లిన భర్త శ్రీచరణ్‌ మరుసటిరోజు గదిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయిందని ఫోన్‌ చేస్తే, విశాఖ నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్లామని వారు విలేకరులకు వివరించారు. తాము అక్కడకు చేరేసరికి ముస్సోరి పోలీసులు పోస్టుమార్టం పూర్తిచేశారని ఆరోపించారు. ఆమెకు బీపీ, షుగర్‌, గుండె జబ్బు వంటివి ఏమీ లేవని, బ్రెయిన్‌ స్ట్రోక్‌ అనేది అవాస్తవమని పేర్కొన్నారు. ఆమె తల రక్తపు మడుగులో ఉందని చెప్పారని, బలమైన గాయం చేస్తే తప్ప అలా జరగదన్నారు. రాధాగాయత్రిని పెళ్లయిన నాటి నుంచే శ్రీచరణ్‌ అనుమానిస్తున్నాడని, ఈ విషయం తనకు చెబితే సర్దుకుపోవాలని సూచించానని తల్లి సత్యవతి వివరించారు. తండ్రికి అరవై ఏళ్లు పూర్తవుతున్నందున షష్ఠి పూర్తి కార్యక్రమం, సత్యనారాయణ స్వామి వ్రతానికి వారిద్దరూ కలిసి రావలసి ఉందని, కానీ ఇలా శవంలా వస్తుందని అనుకోలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. భర్త పెడుతున్న బాధలన్నీ విశాఖపట్నం వచ్చాక కుటుంబ సభ్యులందరి ముందు చెబుతానని, అంతా కలిసి ఏమి నిర్ణయిస్తే దాని ప్రకారమే నడుచుకుంటానని తన కుమార్తె చెప్పిందని సత్యవతి పేర్కొన్నారు. రెండు నెలలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకుంటానని, ఆ తరువాత పెద్దల నిర్ణయం ప్రకారం తన భవిష్యత్తును నిర్ణయించుకుంటానని చెప్పిందన్నారు. ఆ కష్టాలు ఏమిటో చెప్పకుండానే చనిపోయిందని, పోలీసులే దర్యాప్తు చేసి అవన్నీ బయట పెట్టాలని కోరారు. అల్లుడు శ్రీచరణే పథకం ప్రకారం చంపేశాడని, మరో ఆడపిల్లకు ఇలా జరగకుండా తమకు న్యాయం చేయాలని వారు కోరారు.


ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘రెండేళ్ల నమ్మకం’ పేరిట నిర్వహణ

అభివృద్ధి, సంక్షేమంపై స్టాళ్లు

విశాఖపట్నం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆర్కే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘రెండేళ్ల నమ్మకం’ పేరిట విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. సుమారు మూడు వేల మందితో సభ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఈ సభకు హాజరయ్యేందుకు ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై వీడియో ప్రదర్శించనున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై 11 శాఖలు స్టాళ్లు ఏర్పాటుచేయనున్నాయి. సభ అనంతరం మధ్యాహ్నం అందరికీ భోజనం అందించేందుకు ఏర్పాట్లుచేశారు.


రవాణా శాఖలో నిలిచిన సేవలు

గత నాలుగు రోజులుగా పనిచేయని సర్వర్‌

విశాఖపట్నం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):

ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో సర్వర్‌ పనిచేయకపోవడంతో గత నాలుగు రోజులుగా అన్నిరకాల సేవలు నిలిచిపోయాయి. మాధవధారలోని కార్యాలయానికి లెర్నర్స్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌), డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల ఫాన్సీ నంబర్‌ రిజిస్ర్టేషన్‌, పాత వాహనాల రీ రిజిస్ర్టేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ వంటి పనుల కోసం ప్రతిరోజూ కనీసం 150 మంది వరకు వస్తుంటారు. వీరంతా ఆయా పనుల కోసం ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గత నాలుగు రోజులుగా రవాణా శాఖ సర్వర్‌ పనిచేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నప్పటికీ సర్వర్‌ కనెక్ట్‌ కాకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగివెళుతున్నారు. తర్వాత ఎప్పుడు రావాలనే దానిపై అధికారులు, సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం రవాణా శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ పనిచేయడం లేదని, తాము చేసేదేమీ లేదని పేర్కొంటున్నారు.


ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాకు 11వ స్థానం

ప్రథమ సంవత్సరం 39 శాతం,

ద్వితీయ ఏడాదిలో 55 శాతం ఉత్తీర్ణత

విశాఖపట్నం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో విశాఖ జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం 4,946 మంది పరీక్షకు హాజరుకాగా 1,906 (39 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ ఏడాదిలో 6,074 మంది పరీక్షకు హాజరుకాగా 3,371 (55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కాగా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం ఈనెల 19 నుంచి 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు తెలిపారు. రీకౌంటింగ్‌కు రూ.260, రీ వెరిఫికేషన్‌కు రూ.1,300 చెల్లించాలని సూచించారు.

Updated Date - Jun 19 , 2026 | 12:52 AM