ప్రలోభాల వల
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:03 AM
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అభ్యర్థులు నగదు భారీగానే పంపిణీ చేశారు.
ఓటుకు రూ.500
వార్డుల్లో మూడు వేల నుంచి ఐదు వేల మందికి డబ్బులు పంచిన కార్పొరేటర్ అభ్యర్థులు
కొన్నిచోట్ల రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు పంచిన స్వతంత్రులు
మేయర్ అభ్యర్థి పేరుతో కొన్నిచోట్ల మరో రూ.500
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అభ్యర్థులు నగదు భారీగానే పంపిణీ చేశారు. ఈ విషయంలో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటీపడ్డారు. ఇప్పుడు అభ్యర్థులు ఇస్తున్న మొత్తం, గత సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాటితో ఓటర్లు బేరీజు వేసుకుంటున్నారు.
వార్డుల్లో కార్పొరేటర్ అభ్యర్థులు ఓటుకు రూ.500 చొప్పున పంచిపెట్టారు. కార్పొరేషన్లో మొత్తం 120 వార్డులు ఉండగా వార్డుకు సగటున 15 వేల మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థులు వార్డులో ఓటర్లందరికీ కాకుండా వారికి ఎక్కడైతే ప్రతికూలమైన ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి, అక్కడే డబ్బులు పంచిపెట్టారు. పార్టీ పట్ల అభిమానం, పార్టీ వల్ల ప్రయోజనాలు పొందిన వారికి నగదు పంచి పెట్టలేదు. పేదలు, నోటు ఇస్తే తప్ప ఓటు వేయరని భావించిన వారికి పంపిణీ చేశారు. ఇలా ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఐదు వేల ఓట్లకు రూ.25 లక్షల వరకు పంచిపెట్టారు. అధికార పక్షం, ప్రతిపక్షం కూడా ఇదే విధానం అనుసరించాయి. పారిశ్రామిక ప్రాంతం, నగరంలో కొన్ని కీలకమైన వార్డుల్లో ప్రధాన పార్టీల టికెట్లు లభించక స్వతంత్రులుగా బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్లు ఓటుకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పంచిపెట్టారు. ఒక అభ్యర్థి అయితే ఎంపిక చేసుకున్న కాలనీకి ఓటుకు రూ.4 వేలు చొప్పున పంచిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇక మేయర్ అభ్యర్థుల విషయానికి వస్తే ప్రధానంగా పోటీ పడుతున్న పార్టీల అభ్యర్థుల తరఫున నగదు పంపిణీ జరిగింది. వార్డుల్లో కార్పొరేటర్ అభ్యర్థి ఇచ్చిన రూ.500కు మరో రూ.500 ఇచ్చి వేయి రూపాయల చొప్పున పంపిణీ చేయించారు. ఎగువ మధ్య తరగతి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ చేయలేదు. అలాగే గేటెడ్ కమ్యూనిటీలతో పాటు అపార్లమెంట్ల జోలికి కూడా వెళ్లలేదు. కేవలం పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఉండే ప్రాంతాల్లోనే నగదు పంపిణీ చేశారు.
ముందే మద్యం కొనుగోళ్లు
పార్టీకి పనిచేసినవారు, కార్యకర్తలు, మురికివాడల్లో ఓటర్లకు పంచడానికి అభ్యర్థులు మద్యం ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకున్నారు. వాటిని రహస్యంగా శనివారం సాయంత్రం నుంచి పంపిణీ చేశారు. ఆదివారం పోలింగ్ బూత్ల వద్దకు ఆటోలు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ రావాలని పార్టీ కార్యకర్తలతో ఇళ్లకు కబురు అందించారు. నలుగురు నుంచి ఆరుగురు ఒక ఆటోలో రావాలని, ఆ ఆటోలోనే తిరిగి ఇళ్ల వద్ద దించుతామని అభ్యర్థులు హామీ ఇచ్చారు. అయితే చాలా మంది ఓటర్లకు ఇంకా స్లిప్పులు అందకపోవడం గమనార్హం.