Share News

ఆకాశమే హద్దు

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:46 AM

కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె ఐఐటీలో ఎంటెక్‌ సీటును వదులుకున్నారు.

ఆకాశమే హద్దు

  • మహిళలు సాధించలేనిదేమీలేదు

  • లక్ష్యం చేరుకునేంత వరకూ వెనక్కి తిరిగి చూడొద్దు

  • అమ్మే స్ఫూర్తి

  • ఫలితం కోసం ఆశించకుండా పనిచేసేతత్వం ఆమెది

  • పది మందికి సేవ చేయవచ్చుననే సివిల్స్‌కు ప్రిపేరయ్యా

  • మహిళలు అటు ఉద్యోగం, ఇటు కుటుంబం రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి

  • ‘ఆంధ్రజ్యోతి’తో జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి

  • విశాఖలో పనిచేయడం గొప్ప అనుభూతి

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):

కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె ఐఐటీలో ఎంటెక్‌ సీటును వదులుకున్నారు. సొంత పాఠశాలలో పాఠాలు బోధించారు. ఆ సమయంలో సమాజంలో ఉపాధ్యాయుడి విలువ తెలుసుకుని...టీచర్‌గా స్థిరపడాలనుకున్నారు. ఆనక ఉపాధ్యాయరాలిగా కంటే ప్రభుత్వ సర్వీస్‌లో చేరితే పది మందికి సేవ చేయవచ్చునని గుర్తించి సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తొలిసారి విజయం దక్కకపోయినా నిరాశ చెందకుండా నాలుగో ప్రయత్నంలో 211వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు గొబ్బిళ్లి విద్యాధరి. కందుకూరు సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆమె, ప్రస్తుతం విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిలో ఎక్కడా ఇబ్బందిలేకుండా పనిచేస్తున్నానంటే...అందుకు తన తల్లి సుజాతే స్ఫూర్తి అని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యాధరి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...

మాది ఐఎఎస్‌ల గ్రామం

కడప జిల్లా నందలూరు మా సొంతూరు. మా ఊరిని ఐఏఎస్‌ల గ్రామం అని పిలుస్తారు. చాలా ఏళ్ల క్రితం నందలూరు నుంచి ఐదుగురు ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. ఏవీఎస్‌ రెడ్డిగారు నందలూరుకు చెందినవారే. తిరిగి 40 ఏళ్ల తరువాత ఊరి నుంచి ధీరజ్‌ అనే వ్యక్తి 2018 బ్యాచ్‌లో ఐపీఎస్‌కు ఎంపికై మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. 2021లో నేను 211వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ సాధించి ఏపీ కేడర్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో నా తరువాత తమ్ముడు కృష్ణశ్రీవాస్తవ 2024వ బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌కు (ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌) ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నాడు. నా భర్త సోమశేఖర్‌ కూడా 2021వ బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి. ఆయన లక్షద్వీప్‌లో పనిచేస్తున్నారు. మాకు ఒక పాప..పేరు వాన్షిక.

ముంబై ఐఐటీలో ఎంటెక్‌ సీటు వదిలి

అమ్మ సుజాత, నాన్న సుబ్బరామయ్య. నందలూరులో 1986లో నాన్న స్కూలు ప్రారంభించారు. అమ్మ, నాన్న ఇద్దరు స్కూలు నడిపేవారు. పదో తరగతి వరకు సొంత స్కూలులోనే చదువుకున్నా. ఆ తరువాత ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్లు (ఇంటర్‌ ప్లస్‌ ఇంజనీరింగ్‌) చదువుకున్నా. ఇంజనీరింగ్‌లో ఈసీఈ బ్రాంచి తీసుకున్నా. 2014లో ఇంజనీరింగ్‌ పూర్తయిన తరువాత గేట్‌లో మంచి ర్యాంకు రావడంతో ముంబై ఐఐటీలో ఎంటెక్‌ సీటు వచ్చింది. అదే సమయంలో కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు రావడంతో పాఠశాలను చూసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో పిల్లలకు పాఠాలు బోధించాను. అన్ని సబ్జెక్టులకు ఫ్యాకల్టీ దొరకరు కాబట్టి నేనే మేథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీష్‌ పాఠాలు చెప్పాను. నాకు తొలి నుంచి టీచర్‌ వృత్తి అంటే ఎంతో ఇష్టం. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఉపాధ్యాయుడి పాత్ర ఉంటుంది. అటువంటి వృత్తిలో కొనసాగాలని ఉండేది.

ఐఏఎస్‌ కావాలని నిర్ణయించుకున్నా..

స్కూలు నిర్వహించే సమయంలో సమాజానికి ఏదో చేయాలనే తపన ఉండేది. సాధ్యమైనంతగా ఫీజుల్లో రాయితీ ఇచ్చేవాళ్లం. అదే సమయంలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు సమాజం గురించి ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలపై నిందలు వేసేవారు. అప్పటివరకు టీచర్‌గా కొనసాగాలనుకున్న నేను..ప్రభుత్వ సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఆలోచన వచ్చిన వెంటనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంపి చేసుకుని 2016లో సివిల్స్‌ ఇంటర్వ్యూకు వెళ్లా. ఆ తరువాత మరో రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపిక కాలేదు. ప్రిపరేషన్‌లో ఏదో లోపం ఉందని గుర్తించి 2020లో తెలుగు ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నా. 2021లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా.

విశాఖలో పనిచేయడం గొప్ప అనుభూతి

సివిల్స్‌ శిక్షణ తరువాత కందుకూరులో సబ్‌ కలెక్టర్‌గా చేరిన వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఎంతో కష్టపడి ఎన్నికలు సాఫీగా నిర్వహించా. ఆ తరువాత చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అక్కడ రెవెన్యూ సమస్యలు చాలా ఎక్కువ. వాటిని ఎంతో ఓర్పుతో పరిష్కరించేందుకు ప్రయత్నించి అనేకమంది రైతులకు న్యాయం జరిగేలా చేశా. కుప్పం ఆర్‌ఈసీఎస్‌కు చిత్తూరు జేసీ పర్సన్‌ ఇన్‌చార్జిగా ఉంటారు. ఆర్‌ఈసీఎస్‌లో పని విధానం, ఉద్యోగ నియామకాలు, నిర్వహణలో అనేక లోపాలు గుర్తించా. విద్యుత్‌ బిల్లులు నెలకు నాలుగు నుంచి రూ.ఐదు కోట్లు మాత్రమే వసూలయ్యేవి. ఇందుకు ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ రూపొందించి అమలు చేస్తే నెలకు ఆదాయం రూ.10 కోట్లకు చేరింది. చిత్తూరు నుంచి విశాఖ జేసీగా బదిలీపై వచ్చాను. అక్కడకు భిన్నమైన సమస్యలు విశాఖలో ఉన్నాయి. ఇక్కడ భూముల విలువ ఎంతో ఎక్కువ. ప్రభుత్వ భూములు పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో విశాఖకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అభివృద్ధి చెందుతున్న నగరం. ఇక్కడకు వచ్చే పెట్టుబడిదారులకు అవసరమైన చోట్ల భూములు కేటాయించాలి. ఇంకా ఇక్కడ అనేక సదస్సులు, ఈవెంట్లు జరుగుతుంటాయి. వాటిని నిర్వహించాలి. విశాఖలో పనిచేయడం ఎంతో గొప్ప అవకాశంగా భావిస్తాను.

అమ్మ నుంచి చాలా నేర్చుకున్నా

స్కూలు నిర్వహించాలంటే ఎంతో మనో ధైర్యం ఉండాలి. అనేక ఒత్తిళ్లు ఉంటాయి. నాకు 18 నుంచి 20 సంవత్సరాల వయస్సులోనే ఆమె పడిన బాధ, తపన, కష్టం ప్రత్యక్షంగా చూశాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా...ఉదయం లేచేసరికి అవన్నీ మరిచిపోయి విధి నిర్వహణలోనే మమేకమయ్యేది. ‘నా పని నేను చేసుకోవాలి. అది నా బాధ్యత.’ అనే ఆలోచనతో ధైర్యంగా ముందుకు నడిచింది అమ్మ. ఎంత ఒత్తిడి ఉన్నా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే అమ్మను చూస్తే నాలో ధైర్యం వచ్చేది. నిబద్ధత, అంకితభావం కలిగి ఉండడంతో పాటు ఇబ్బందుల్లో ఉన్నవారికి చేతనైనంత సాయపడే అమ్మే నాకు స్ఫూర్తి. నాన్న కాలం చేసిన తరువాత ఆమెకు ఇష్టమైన పాఠశాలను క్లోజ్‌ చేశాం.

విజయం సాధించేంత వరకు పోరాడండి

విజయం అనేది అంత సులువుగా రాదు. ఎంతో కష్టపడితేనే దక్కుతుంది. వెంటనే ఫలితం రాకపోతే నిరాశ చెందొద్దు. ముఖ్యంగా మహిళలు, చదువుకునే బాలికలు ఏ లక్ష్యం పెట్టుకున్నారో అది సాధించేంత వరకూ వెనక్కి తిరిగి చూడొద్దు. విజయానికి హద్దులు లేవు. ఆకాశమే హద్దు. మహిళలు సాధించలేనిది ఏదీలేదు. లక్ష్య సాధనకు పక్కాగా ప్రణాళిక రూపొందించుకోండి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు.

ముందు తరాల పోరాటాలతోనే నిలబడ్డాం

సమాజంలో మహిళ పాత్ర ఎంతో సంక్లిష్టమైనది. ఎంతో గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ మహిళకు కుటుంబ బాధ్యత ఉంటుంది. మహిళలు అటు ఉద్యోగం, ఇటు కుటుంబం రెండూ చూసుకోవాలి. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తారు. ఒకప్పుడు మహిళలు సమాజంలో నిలదొక్కుకునేందుకు అనేక సవాళ్లు ఎదుర్కొనాల్సి వచ్చేది. రెండు, మూడు తరాలు హక్కుల కోసం చాలా కష్టపడ్డారు. కాబట్టే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా. నాలాగే ఎందరో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలకు సమాజంలో ఎంతో గౌరవం పెరిగింది. అన్నింటా పోటీపడుతున్నారు. పాతతరం మహిళల పోరాటాలను గుర్తుంచుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో తోటి మహిళలకు సాయపడాలి. సాయం కోసం వచ్చే మహిళలను ఆదుకోవాలి. ఉద్యోగ జీవితంలో ఇంతవరకూ నాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. అందరూ చాలా మర్యాదగా, గౌరవంగా ఉండడం ఆనందంగా ఉందని చెప్పాలి.

Updated Date - Mar 08 , 2026 | 01:46 AM