Share News

ఏయూలో మారని తీరు

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:16 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది.

ఏయూలో మారని తీరు

ఉన్నతాధికారుల నిర్ణయాలు వివాదాస్పదం

మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదులు

తూతూమంత్రంగా శతాబ్ది వేడుకలు

వీసీకి దూరంగా పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ఇక్కడి వ్యవహారాలను ఇప్పటికే పలువురు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. పాలకులు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. సంక్రాంతి సెలవులు తరువాత మెస్‌లు ఓపెన్‌ చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

నియామకాలపై తీవ్ర ఆరోపణలు

వర్సిటీలో ఇటీవల చేపట్టిన బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, కారుణ్య నియామకాలపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా, రహస్యంగా బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేశారనే విమర్శలు వచ్చాయి. వివాదాలు వెంటాడడంతో గత ప్రభుత్వ హయాంలో ఈ నియామకాలను నిలిపివేశారు. ప్రస్తుత అధికారులు ఎవరికీ తెలియకుండా వీటిని భర్తీచేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. నియామకాలను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడంతో వారికి జీతాల చెల్లింపుపై విద్యాశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అలాగే, 40కు పైగా కారుణ్య నియామకాలను అడ్డగోలుగా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలపై వర్సిటీ అధికారులు మాత్రం ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. వీటిని తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో తిరస్కరించినట్టు చెబుతున్నారు.

శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై అసంతృప్తి

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ నాటికి శత వసంతాలు పూర్తిచేసుకోబోతోంది. ఏడాది ముందు నుంచే శతాబ్ది వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం, వర్సిటీ అధికారులు నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకూ ఎక్కడా వేడుకల వాతావరణం కనిపించడం లేదు. అకడమిక్‌ కార్యక్రమాలను వందేళ్ల వేడుకలుగా పేర్కొంటూ కాలం గడిపేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.

దూరం.. దూరం..

వర్సిటీలో ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే...అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వీసీకి సీనియర్‌ ప్రొఫెసర్లు పలువురికి మధ్య సఖ్యత లేదు. సీనియర్‌ ప్రొఫెసర్లు ఎంతోమంది ప్రస్తుత వీసీ, ఇతర అధికారులకు సహకారాన్ని అందించడం లేదు. కీలక స్థానాల భర్తీ విషయంలో వీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్‌ ప్రొఫెసర్లు అసంతృప్తిగా ఉన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 01:16 AM