చిన్నబోయిన పెద్దేరు
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:59 AM
మండలానికి జీవనాడి అయిన పెద్దేరు జలాశయం గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగంటుతున్నది. మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలు ప్రధానంగా పెద్దేరుపై ఆధారపడి ఉన్నాయి.
- ఎల్‌నినో ప్రభావంతో అడుగంటిన జలాశయం
- కనిష్ఠస్థాయి చేరుతున్న నీటిమట్టం
మాడుగుల రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మండలానికి జీవనాడి అయిన పెద్దేరు జలాశయం గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగంటుతున్నది. మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలు ప్రధానంగా పెద్దేరుపై ఆధారపడి ఉన్నాయి.
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవక జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరువవుతున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు. కనిష్ఠం 125.85 మీటర్లు కాగా, ప్రస్తుతం 128.70 మీటర్లకు చేరింది. జలాశయంలో నీరు లేకపోవడం వలన గేట్లు, రాళ్లు, మట్టిదిబ్బలు బయటకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే తప్ప జలాశయంలో నీరు చేరే పరిస్థితులు కనిపించడం లేదు.
పెద్దేరు జలాశయం కుడి కాలువ కింద 7,400 ఎకరాలు, ఎడమ కాలువ కింద 7,700 ఎకరాలు కలిపి మొత్తంగా 15,100 ఎకరాల ఆయకట్టుకి ఖరీఫ్ సీజన్‌లో జలాశయం నీటిని అందిస్తుంటారు. కాగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు చేసుకునేందుకు గత నెలలో జలాశయం నీటిని కుడి, ఎడమ కాలువల ద్వారా విడిచిపెట్టారు. ఆ సమయంలో జలాశయం నీటిమట్టం 134 మీటర్లు ఉంది. కుడి, ఎడమ కాలువలకు చెరొక 25 క్యూసెక్కులు చొప్పున సగటున రోజుకి 3.5 నుంచి 4 ఎంసీఎఫ్‌టీ లెక్కన ఇప్పటివరకు సుమారుగా 130 ఎంసీఎఫ్‌టీ నీటిని విడిచిపెట్టినట్టు జలాశయం అదికారులు చెబుతున్నారు. జలాశయం నీటిమట్టం అట్టడుగుకు చేరుతున్నందున ఐదు, ఆరు రోజుల్లో నీటి సరఫరా ఆగిపోతుందని చెబుతున్నారు. జలాశయం అడుగంటున్న తరుణంలో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.