షెల్టర్ ఒక చోట.. బస్సులు ఆగేది మరో చోట
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:43 PM
చింతపల్లి పాత బస్టాండ్‌లో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పాత బస్టాండ్‌లో బస్ షెల్టర్ ఒక చోట ఉండగా, బస్సులు మరో చోట ఆగుతున్నాయి.
చింతపల్లి పాత బస్టాండ్ వద్ద ప్రయాణికుల అవస్థలు
నిల్చొనే బస్సుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి
మరుగుదొడ్లకు తలుపుల్లేక వినియోగించలేని పరిస్థితి
పట్టించుకోని అధికారులు
చింతపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి పాత బస్టాండ్‌లో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పాత బస్టాండ్‌లో బస్ షెల్టర్ ఒక చోట ఉండగా, బస్సులు మరో చోట ఆగుతున్నాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు నిల్చొనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే పాత బస్టాండ్‌లో మరుగుదొడ్లు మరుగునపడిపోయాయి. దీని వలన ప్రయాణికులు మల, మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చింతపల్లి మీదుగా సీలేరు, భద్రాచలం, పాడేరు, కొయ్యూరు, జీకేవీధి, అరకులోయ, నర్సీపట్నం ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు సర్వీసు వాహనాలు అత్యధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రయాణికులు చింతపల్లి మీదుగా ప్రయాణిస్తుంటారు. దీనికి తోడు చింతపల్లి వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి పాత బస్టాండ్‌లో బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. చింతపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నప్పటికి కిలోమీటరు దూరంలో ఉన్న పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ దుకాణాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఆర్టీసీ బస్సు పాత బస్టాండ్ నుంచి వెనుదిరుగుతుంది. దీంతో సీట్లు రిజర్వు చేసుకునేందుకు సైతం ప్రయాణికులు పాత బస్టాండ్‌లోనే నిరీక్షిస్తుంటారు. పాత బస్టాండ్‌లో గ్రంథాలయానికి సమీపంలో బస్ షెల్టర్ ఉంది. అయితే ఆర్టీసీ బస్సు ఒక్కటీ షెల్టర్ వద్ద ఆగదు. బస్సులన్నీ పాత బస్టాండ్ ఏరియా ఆస్పత్రికి ఎదురుగా ఉన్న రహదారిపైన ఆగుతున్నాయి. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు పాత బస్టాండ్ ఏరియా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో నిల్చొని నిరీక్షిస్తున్నారు. కొంత మంది దుకాణాల వద్ద కూర్చొని బస్సు వచ్చే వరకు వేచి వుంటున్నారు. ఏరియా ఆస్పత్రికి వంద అడుగుల దూరంలో బస్ షెల్టర్ ఉండడం, ఆర్టీసీ డ్రైవర్లు బస్ షెల్టర్ వద్ద ఆపకపోవడం వల్ల ప్రయాణికులు దానిని వినియోగించడం లేదు. ప్రస్తుతం పాత బస్టాండ్ వద్ద షెల్టర్ అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నది. బస్ షెల్టర్‌ను ప్రయాణికులు వినియోగించకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులు వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు.
మరుగునపడిన మరుగుదొడ్లు
పాత బస్టాండ్‌లో షెల్టర్ పక్కనే పంచాయతీ నిధులతో స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే బోరు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీ అధికారులు గాని, పంచాయతీ సిబ్బంది గాని పట్టించుకోకపోవడం వల్ల నిరుపయోగంగా వున్నాయి. ప్రస్తుతం మరుగుదొడ్లు మల, మూత్ర విసర్జనకు అనుకూలంగా లేవు. డోర్లు సైతం ఊడిపోయాయి.
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ఆర్టీసీ బస్సులు, సర్వీసు వాహనాలు పాత బస్టాండ్‌కు వచ్చి వెనుదిరుగుతాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు పాత బస్టాండ్‌లో దిగి మల, మూత్ర విసర్జనకు మరుగుదొడ్ల వద్దకు వెళ్లినప్పటికి వినియోగంలో లేకపోవడం వల్ల వెనుదిరగాల్సి వస్తుంది. పురుషులు పాత బస్టాండ్ దుకాణాల వెనుకవైపు, ఖాళీ స్థలాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.