Share News

దేశ రక్షణలో సీఐఎ్‌సఎఫ్‌ సేవలు కీలకం

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:21 AM

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌తో భాగస్వామ్యమయ్యేందుకు ప్రపంచం ఎదురుచూస్తోందని, ఈ తరుణంలో మరింత భద్రతతో ఉన్నామనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

దేశ రక్షణలో సీఐఎ్‌సఎఫ్‌ సేవలు కీలకం

భారత్‌ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ప్రపంచ దేశాల ఎదురుచూపు

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

నగరానికి చేరుకున్న సైక్లోథాన్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌తో భాగస్వామ్యమయ్యేందుకు ప్రపంచం ఎదురుచూస్తోందని, ఈ తరుణంలో మరింత భద్రతతో ఉన్నామనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. తీర ప్రాంత భద్రతపై అవగాహన కల్పించడానికి, జాతీయ ఐక్యత, సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర పారిశ్రామికా దళం (సీఐఎ్‌సఎఫ్‌) జనవరి 28న వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌-2026ను ప్రారంభించింది. ఇందులో 65 మంది మహిళలు సహా మొత్తం 135 మంది పాల్గొంటున్నారు. ఈ యాత్ర శుక్రవారం విశాఖపట్నం చేరింది. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ సీఐఎ్‌సఎఫ్‌ దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నదంటూ కొనియాడారు. సీఐఎ్‌సఎఫ్‌, సైకిల్‌, కోస్ట్‌ అనే మూడు సీ అక్షరాల మధ్య దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. సీఐఎ్‌సఎఫ్‌ దేశవ్యాప్తంగా 71 విమానాశ్రయాలు, 250కుపైగా పోర్టులను కాపాడుతోందని కితాబిచ్చారు. సీఐఎ్‌సఎఫ్‌ బడ్జెట్‌ 2014లో రూ.ఆరు వేల కోట్లు ఉండగా 2026లో రూ.15,973 కోట్లకు చేరిందన్నారు. ఇది సిబ్బంది త్యాగాలకు గౌరవంగా ఆయన పేర్కొన్నారు. సీఐఎ్‌సఎఫ్‌ అడిషనల్‌ డీజీపీ బినీత ఠాకూర్‌ మాట్లాడుతూ దేశ భక్తి, ప్రజల భాగస్వామ్యం, తీర ప్రాంత భద్రత పట్ల సీఐఎ్‌సఎఫ్‌ అచంచలమైన నిబద్ధతకు ఈ సైక్లోథాన్‌ నిదర్శనమన్నారు. ఈ సైక్లోథాన్‌ ఫిబ్రవరి 22న కొచ్చిలో ముగియనుందన్నారు. సీఐఎ్‌సఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ శరవణన్‌ మాట్లాడుతూ ఈ సైక్లోథాన్‌ కేవలం 6,600 కిలోమీటర్ల సైకిల్‌ ప్రయాణం మాత్రమే కాదని, ప్రజలతో నేరుగా మమేకమై భద్రతపై అవగాహన కలిగించే గొప్ప యజ్ఞమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఎ్‌సఎఫ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ డాక్టర్‌ ఎంజీ రాఘవేంద్ర కుమార్‌, ఎన్‌.ప్రకా్‌షరెడ్డి, రేఖా నంబియార్‌, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ వీపీఏ అరుణ్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 01:21 AM