Share News

ముందుకొచ్చిన సంద్రం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:33 AM

సముద్రం ముందుకొచ్చింది. ఆదివారం అమావాస్య కావడంతో పాటు సముద్రంలో మాన్‌సూన్‌ కరెంట్‌ తీవ్రత ఎక్కువవడంతో అలలు ఎగసిపడ్డాయి.

ముందుకొచ్చిన సంద్రం

కురుసుర మ్యూజియం ప్రహరీని తాకిన అలలు

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

సముద్రం ముందుకొచ్చింది. ఆదివారం అమావాస్య కావడంతో పాటు సముద్రంలో మాన్‌సూన్‌ కరెంట్‌ తీవ్రత ఎక్కువవడంతో అలలు ఎగసిపడ్డాయి. అలలు ఆర్కేబీచ్‌ నుంచి వైఎంసీఏ ఎదురుగా ఉన్న ఆల్‌ ఎబిలిటీపార్కువరకు గోడలను తాకాయి. సెలవు రోజు కావడంతో బీచ్‌కు సందర్శకులు పోటెత్తారు. బీచ్‌రోడ్డు నుంచి నిలబడి చూస్తే ఇసుకతెన్నెలు కనిపించని విధంగా అలలు ముందుకు వచ్చి బీచ్‌రోడ్డు ప్రహరీని తాకుతుండడంతో సందర్శకులు సముద్రంలో స్నానాలకు దిగి కేరింతలు కొట్టారు. సాధారణంగా ఆగస్టు తర్వాత తీవ్రతుఫాన్‌లు సంభవించినపుడు మాత్రమే సముద్రం ముందుకువస్తుంది. ఈ ఏడాది జూన్‌లోనే ముందుక రావడంతో వాతావరణశాఖ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సముద్రంలో ఆటుపోట్ల తీవ్రత పెరిగి కోతకు గురయ్యే ప్రమాదం ఉందని, సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఊరిస్తున్న వర్షం

నిరాశపరిచిన మేఘం

శివారు ప్రాంతాల్లో మోస్తరుగా జల్లులు

నగరంలో ఠారెత్తించిన ఎండ

ఎయిర్‌పోర్టులో 37.4 డిగ్రీలు నమోదు

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

నగర ప్రజలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఠారెత్తించే ఎండలతో సొమ్మసిల్లుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా వర్షం కురవడంలేదు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వడగాడ్పులతో కూడిన వేడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఒక్కసారిగా శివారు ప్రాంతాల నుంచి నగరంపైకి మేఘాలు ఆవరించాయి. వెంటనే చల్లనిగాలులు వీయడంతో అప్పటివరకు వేడి కుంపటిలా మారిన నగరంలో వాతావరణం చల్లబడింది. నగరంపై మేఘాలు కమ్మేయడంతో పలుచోట్ల చీకట్టు కమ్మేశాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన వర్షం పార్వతీపురం మన్యం, విజయనగరం మీదుగా విశాఖ జిల్లాలో పద్మనాభం, తగరపువలస, ఆనందపురం, మధురవాడ వరకు విస్తరించింది. పద్మనాభంలో 25.5 మి.మీల వర్షపాతం నమోదైంది. తగరపులవలసలో మోస్తరు వర్షం కురిసింది. మధురవాడలో చిరుజల్లులు కురిశాయి. అక్కడి నుంచి నగరం వైపుగా మేఘాలు రాలేదు. దీంతో నగర వాసులు తీవ్ర నిరాశపడ్డారు. సాయంత్రం ఆవరించిన మేఘాలతో నగరంలోనూ వర్షం కురుస్తుందని భావించారు. వేసవి ప్రారంభమైన తరువాత నగరంలో గత నెలరోజుల్లో ఒకటిరెండుసార్లు మాత్రమే వర్షం పడింది. శివారు ప్రాంతాల్లో తరచూ జల్లులు కురుస్తూనే ఉన్నప్పటికీ మేఘాలు నగర పరిధిలోకి రావడం లేదు. కాగా ఆదివారం నగరంలో తీవ్ర ఎండ కొనసాగింది. మధ్యాహ్న సమయంలో వేడిగాలులు వీచాయి. ఎయిర్‌పోర్టులో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Jun 15 , 2026 | 12:34 AM