Share News

ఠారెత్తించిన ఎండ

ABN , Publish Date - May 21 , 2026 | 01:08 AM

వాయువ్య భారతం నుంచి రాష్ట్రం మీదుగా వేడి గాలులు వీస్తుండడంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దీనికితోడు తీవ్ర వడగాడ్పులు వీచడంతో జనం అల్లాడిపోయారు. జిల్లాలో 24 మండలాలకుగాను 17 మండలాల్లో 40 డిగ్రీలకుపైబడి ఉష్ణోగత్రలు నమోదుకావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతున్నది.

ఠారెత్తించిన ఎండ
ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన కోటవురట్ల మెయిన్‌ రోడ్డు

3-5 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు

వడగాడ్పులు, ఉక్కబోతతో జనం విలవిల

మాకవరపాలెంలో అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదు

17 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అనకాపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): వాయువ్య భారతం నుంచి రాష్ట్రం మీదుగా వేడి గాలులు వీస్తుండడంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దీనికితోడు తీవ్ర వడగాడ్పులు వీచడంతో జనం అల్లాడిపోయారు. జిల్లాలో 24 మండలాలకుగాను 17 మండలాల్లో 40 డిగ్రీలకుపైబడి ఉష్ణోగత్రలు నమోదుకావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతున్నది. మాకవరపాలెం మండలంలో రికార్డుస్థాయిలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాయడంతోపాటు వేడి గాలులు వీచాయి. దీనికితోడు ఉక్కపోతతో జనం విలవిలలాడారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వడగాడ్పుల కారణంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో మరో నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా ఇదే విధంగా నమోదు అవుతాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. బుధవారం ఆయా మండలాల్లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. నర్సీపట్నంలో 43.6, నాతవరంలో 43.7, బుచ్చెయ్యపేటలో 42.2, రావికమతంలో 43.2, రోలుగుంటలో 43.3, చీడికాడలో 41.6, చోడవరంలో 41.6, దేవరాపల్లిలో 42.1, గొలుగొండలో 42.2, కె.కోటపాడులో 40.5, కశింకోటలో 42, మాడుగులలో 41.5, మునగపాకలో 40.6, ఎలమంచిలిలో 40.2, ఎస్‌.రాయవరంలో 40.1, అనకాపల్లిలో 39.7, పాయకరావుపేటలో 39.5, సబ్బవరంలో 38.7, రాంబిల్లిలో 37.9, అచ్యుతాపురంలో 39.7, నక్కపల్లిలో 39.5, పరవాడలో 36.2 డిగ్రీలు నమోదయ్యాయి.

Updated Date - May 21 , 2026 | 01:08 AM