Share News

బూదరాళ్ల పాఠశాలకు తాళం

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:10 PM

మండలంలో బూదరాళ్ల ప్రాథమిక పాఠశాలకు గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తాళం వేశారు. వేసవి సెలవుల అనంతరం ఇప్పటివరకు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదు. ఈ విషయాన్ని గ్రామస్థులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు శుక్రవారం ఆందోళనకు దిగారు.

బూదరాళ్ల పాఠశాలకు తాళం
ఉపాద్యాయుడు విధులకు హాజరు కాకపోవటంతో పాఠశాలకు తాళం వేస్తున్న తల్లిదండ్రులు

పునఃప్రారంభం నుంచి టీచర్‌ డుమ్మా

డిప్యూటేషన్‌ వేసిన టీచర్‌ కూడా హాజరుకాని వైనం

ఆగ్రహించిన తల్లిదండ్రులు.. పాఠశాలకు తాళం

రెండు రోజుల్లో టీచర్‌ని వేస్తానని ఎంఈవో హామీతో శాంతించిన తల్లిదండ్రులు

కొయ్యూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో బూదరాళ్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గణేశ్‌ వేసవి సెలవుల అనంతరం స్కూల్‌కు రాలేదు. దీంతో గ్రామస్థులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంఈవో విచారణ జరిపారు. అనారోగ్య కారణాలతో విధులకు హాజరు కాలేకపోయానని, సెలవులో వెళతానని గణేశ్‌ ఎంఈవోకి వివరించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న ఎంఈవో జీకేగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణను బూదరాళ్లకు డిప్యూటేషన్‌ వేశారు. ఆయన ఒకరోజు పాఠశాలకు వెళ్లి అనంతరం తన పాఠశాలకే పరిమితమయ్యాడు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసి తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌ నాశనమవుతుందనే ఆవేదనతో శుక్రవారం పాఠశాలకు తాళం వేశారు. అనంతరం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎంఈవో సింహాచలం హుటాహుటిన బూదరాళ్లకు వెళ్లి తల్లిదండ్రులను సముదాయించారు. ఉపాధ్యాయుల సర్దుబాటు చర్యలు చేస్తున్నానని, రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు శాంతించారు. ఈ విషయమై ఎంఈవో సింహాచలం మాట్లాడుతూ బూదరాళ్ల ఉపాధ్యాయుడు గణేశ్‌ సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరుకావడంపై డీఈవోకు నివేదిస్తున్నానన్నారు. డిప్యూటేషన్‌ వేసిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ కేటాయించిన విధులకు హాజరు కాకపోవడంపై చర్యలు తీసుకుంటామన్నారు. బూదరాళ్ల పాఠశాల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుడిని నియమిస్తానని చెప్పారు.

Updated Date - Jul 03 , 2026 | 11:10 PM