సరస్వతీ నిలయంలో సమస్యల కొలువు
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:37 PM
మండలంలోని మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి దశాబ్దం అయినా దశ మారలేదు. పదేళ్లు అయినా పురిటినొప్పులతో కళాశాల కొనసాగుతోంది. దీంతో అల్లూరి జిల్లాలో ఉన్న ఏకైక మహిళా కళాశాలలో విద్యార్థినులు సమస్యల నడుమ చదువులు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలలో వసతి, తరగతి గదుల కొరత, అధ్యాపకులు, ఫర్నీచర్ లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దశాబ్దం కిందట ప్రారంభమైనా ఇప్పటికీ గాడిన పడని మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాల
15 మంది లెక్చరర్లకు ఉన్నది ముగ్గురే..
350 మంది విద్యార్థినులకు మూడు తరగతి గదులే..
ఫర్నీచర్ లేక నేలపై చదువులు
చాలీచాలని వసతి
కరెంట్ పోతే అంధకారమే..
కళాశాల ప్రాంగణంలో పారిశుధ్య లోపం
ప్రతి ఏడాదీ విద్యార్థులకు తప్పని తిప్పలు
కొయ్యూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఏజెన్సీలో విద్యార్థినులకు ఉన్నతాభ్యాసాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2011లో మండలంలోని మూలపేట శివారు మర్రిపాలెంలో మహిళా డిగ్రీ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కళాశాల ప్రారంభంలో ఇక్కడ తగిన వసతి లేక రెండేళ్లు చింతపల్లిలో కళాశాలను నిర్వహించారు. అనంతరం మర్రిపాలెంలో రూ.కోటి 80 లక్షలతో కళాశాల భవనం, విద్యార్థులకు వసతి గృహం, కిచెన్ కమ్ డైనింగ్ హాలు భవనాన్ని సమకూర్చారు. 2014-15 విద్యాసంవత్సరం నుంచి మర్రిపాలెంలో కళాశాలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. మెదటి సంవత్పరం 168 విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాలలో ప్రస్తుతం 350 మంది విద్యార్థినులు బీఏ, బీకాం, బీఎస్సీల్లో (ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు చెందినవారు) విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 150 మంది కళాశాలలో ప్రవేశం పొందనున్నారు. కళాశాల నిర్వహణకు 15 మంది బోధన సిబ్బందికి గానూ ఏడాది క్రితం ముగ్గురు రెగ్యులర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయగా.. మిగిలిన వారంతా అతిథి అధ్యాపకులతో నిర్వహిస్తున్నారు. కళాశాలకు నిర్మించిన భవనంలో 10 గదులు ఉండగా.. వాటిలో ప్రిన్సిపాల్, లైబ్రరీ, స్టాఫ్ రూం, ఇంగ్లీష్ లాంగ్వేజీ ల్యాబ్‌లకు 7 గదులు కేటాయించగా.. కేవలం మూడింటిలో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో గదులు చాలక వరండాలోనూ, శ్లాబ్‌పైన విద్యాబోధన జరుపుతుండడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలకు మూడేళ్ల క్రితం నర్సీపట్నంకు చెందిన వైద్యుడు 25 బెంచీలు సమకూర్చగా.. మరో 100 బెంచీలను విద్యార్థినులు చందాలు వేసుకుని సమకూర్చుకున్నారు. అయినా కొందరు నేలపై కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ కళాశాల విద్యార్థినులకు కాస్మోటిక్స్, శానటరీ నాఫ్‌కీన్స్ వంటివి సరఫరా లేదు. విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతుండడంతో వసతి సమస్య ఏర్పడుతున్నది. కళాశాలలో ల్యాబ్‌లు లేవు. వీటి ఏర్పాటుకు గత ఏడాది నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ అసంపూర్తిగా పనులను వదిలేశారు. కన్వెన్షన్ కోర్సులతో తరగతుల నిర్వహణకు 12 గదులు కావాల్సి ఉన్నా.. మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఇక.. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న వసతిగృహంలో కార్యాలయ నిర్వహణ, స్టోర్‌రూం, సిక్‌రూం, తదితర అవసరాలకు నాలుగు రూంలు మినహాయించగా.. మిగిలిన ఎనిమిది గదుల్లో విద్యార్థినులు ఉంటున్నారు. 2020లో అదనపు వసతి గృహ భవన సముదాయానికి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేయగా.. బిల్లులు చెల్లించకపోవడంతో గత ఆరేళ్లుగా భవనం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. ఇటీవల మరుగుదొడ్లకు మరమ్మతులు చేయడంతో కొంత మేర ఈ సమస్య తప్పింది. ప్రస్తుతం మరో పది మరుగుదొడ్లు నిర్మాణాలు సాగుతున్నాయి. కళాశాల ప్రాంగణమంతా తుప్పలు పెరగడం, రాత్రి సమయాల్లో లైటింగ్ లేకపోవడంతో చీకటి పడితే భయానకంగా ఉంది. మహిళా కళాశాలలో అధ్యాపకుల కొరత, వసతి, ల్యాబ్‌లు, ప్రాంగణంలో పారిశుధ్యం మెరుగుపరచడం, విద్యుత్ లైట్లు వేయడం, కళాశాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని విద్యార్థినులు కోరుతున్నారు.
ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి
బచ్చలి ఇంద్రజ, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం
కళాశాలలో తగినన్ని గదులు లేక ల్యాబ్‌ల ఏర్పాటు చేయలేదు. ల్యాబ్ సామగ్రి ఉన్నా వాటిని అటకెక్కించారు. అదనపు భవనాలను నిర్మించి ల్యాబ్ సౌకర్యం కల్పించాలి. ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.
శాశ్వత బోధన సిబ్బంది లేక వెనుకపడుతున్నాం
కేవీ సంతోషి, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం
కళాశాలలో గడిచిన మూడు నెలలుగా అతిథి అధ్యాపకులు బోధన జరుపుతున్నారు. బోధన పద్ధతి సక్రమంగా లేక చదువులో వెనుకపడుతున్నాం. శాశ్వత బోధన సిబ్బందిని నియమిస్తే ఈ సమస్య తీరుతుంది.
సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతున్నాం
కె. సుధ, ప్రిన్సిపాల్
కళాశాల నిర్వహణకు అదనపు వసతి, ఫర్నీచర్, రెగ్యులర్ అధ్యాపకులు, వసతిగృహానికి అదనపు భవనాలు వంటి సమస్యలను గతంలో కళాశాలను సందర్శించిన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. ఈ సమస్యల పరిష్కారానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. బోధన సిబ్బంది తగినంత లేక అతిథి అధ్యాపకులతో బోధన చేయిస్తున్నాం. ముఖ్యమైన పాఠ్యాంశాల బోధనకు సిబ్బంది లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.