ఇసుకాసురుల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:25 PM
మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తీగలవలస సచివాలయ పరిధిలోని కామయ్యపేట గెడ్డ నుంచి కొందరు వ్యాపారులు రేయింబవళ్లు అక్రమంగా ఇసుక తవ్వి తరలించేస్తున్నారు.
యథేచ్ఛగా రేయింబవళ్లు కామయ్యపేట గెడ్డలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
పలు చోట్ల స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని విక్రయాలు
ట్రాక్టర్ లోడు రూ.3,500, టిప్పర్ లోడు రూ.12 వేల నుంచి రూ.16 వేల మధ్య అమ్మకాలు
జన్‌మన్ గృహ లబ్ధిదారులకు ఇసుక దొరక్క ఇబ్బందులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
హుకుంపేట, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తీగలవలస సచివాలయ పరిధిలోని కామయ్యపేట గెడ్డ నుంచి కొందరు వ్యాపారులు రేయింబవళ్లు అక్రమంగా ఇసుక తవ్వి తరలించేస్తున్నారు. గెడ్డలో లోతుగా తవ్వకాలు జరుపుతుండడంతో వర్షాలకు ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో గెడ్డ దాటుతూ పలు గ్రామాల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
మండలంలోని తీగలవలస సచివాలయ పరిధిలోని కామయ్యపేట గెడ్డ ఆంధ్ర సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ఈ గెడ్డను దాటి పెదబయలు మండలానికి ఆంధ్ర, ఒడిశా గిరిజనులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే గెడ్డలోని ఇసుకపై అక్రమార్కుల కన్నుపడింది. రోజూ గెడ్డ నుంచి 50 నుంచి 80 వాహనాల్లో ఇసుకను తరలించేస్తున్నారు. రేయింబవళ్లు తవ్వి తరలించేస్తుండడంతో గెడ్డలో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక్కడ నుంచి తరలించిన ఇసుకను పలు చోట్ల నిల్వ చేస్తున్నారు. ట్రాక్టర్ లోడు ఇసుకను రూ.3,500, టిప్పర్ లోడు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు విక్రయిస్తున్నారు. మండలంలో జన్‌మన్ పథకం కింద 1,762 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వీరు కూడా అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొందరికి ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించలేకపోతున్నారు. కాగా గెడ్డలో లోతుగా తవ్వకాలు జరపడంతో ప్రమాదకరంగా తయారైంది. వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఎక్కడ లోతు ఉందో తెలియక పలు గ్రామాల గిరిజనులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి గెడ్డలో అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.