Share News

ఉత్సవాలపై ఆది నుంచి అదే తీరు!

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:28 AM

మోదకొండమ్మ ఉత్సవ కమిటీ ఎన్నిక జరిగి సుమారుగా రెండు నెలలైనా ఉత్సవాలకు సంబంధించిన కనీస ఏర్పాట్లు జరగకపోవడం, ఉత్సవ కమిటీ ఉత్సాహంగా లేకపోవడంపై ఈ నెల 12న ‘ఆంధ్రజ్యోతి’లో ‘మోదకొండమ్మ ఉత్సవాలపై అయోమయం’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి పాఠకులకు తెలిసిందే.

ఉత్సవాలపై ఆది నుంచి అదే తీరు!
ఏప్రిల్‌ 12న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్‌

అయోమయ పరిస్థితిని ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

- అసలు విషయం తెలుసుకుని రంగంలోకి జిల్లా యంత్రాంగం

పాడేరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మోదకొండమ్మ ఉత్సవ కమిటీ ఎన్నిక జరిగి సుమారుగా రెండు నెలలైనా ఉత్సవాలకు సంబంధించిన కనీస ఏర్పాట్లు జరగకపోవడం, ఉత్సవ కమిటీ ఉత్సాహంగా లేకపోవడంపై ఈ నెల 12న ‘ఆంధ్రజ్యోతి’లో ‘మోదకొండమ్మ ఉత్సవాలపై అయోమయం’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి పాఠకులకు తెలిసిందే. వాస్తవానికి ఉత్సవ కమిటీ ఎన్నిక జరిగిన మరుసటి రోజు నుంచే ఆయా పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతారు. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా మోదకొండమ్మ ఉత్సవాల నిర్వహణకు ఉద్దేశించిన ఉత్సవ కమిటీ ఎన్నికలో సైతం ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాల్గొనకపోవడం, కమిటీ కార్యవర్గాన్ని సంపూర్ణంగా నియమించకపోవడం, ఎటువంటి పనులు ప్రారంభించకపోవడంతో ఉత్సవాల నిర్వహణపై ఫిబ్రవరి 21న ప్రకటించిన కమిటీకి ఆసక్తి లేదని జనానికి స్పష్టమైంది. అందుకే ఎన్నికైన కమిటీ అధికారులు, ఇతరులను ఉత్సవాలకు సంబంధించిన అంశాల్లో భాగస్వాములను చేయలేదని, కనీస సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే ఈ నెల ఒకటో తేదీన ఉత్సవాలపై జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ నిర్వహించిన సమావేశానికి సైతం ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుని హోదాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హాజరుకాలేదు. అలాగే మంగళవారం కలెక్టర్‌ టి.నిశాంతి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి సురేశ్‌కుమార్‌ హాజరుకాలేదు. కాగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మే 12న మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుకలను మాత్రమే నిర్వహించాలని, ఉత్సవాల జోలికి వెళ్లకూడదని అంతర్గతంగా నిర్ణయించారని ప్రచారం జరుగుతున్నది. దీంతో జిల్లా యంత్రాంగానికి ఉత్సవ కమిటీ తీరు స్పష్టంగా అర్థమైంది. ఈ తరుణంలో ఉత్సవాల తేదీల్లో మార్పులు చేయడంతో పాటు అధికారులు, ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యుల సమక్షంలోనే ఉత్సవాల నిర్వహణకు మంగళవారం కలెక్టరేట్‌లో అధ్యక్షుడి ఎన్నికను నిర్వహించారు. దీంతో అందరూ ఏకగ్రీవంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే ఉత్సవాల విషయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఒంటరిని చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 22 , 2026 | 12:28 AM