పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:05 AM
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
కలెక్టర్ టి.నిషాంతి
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
పాడేరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆమె తొలుత కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తారని, అటువంటి పోలీసులను గౌరవించాలన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు అడుగులు వేస్తున్న పోలీసులకు ఆమె అభినందనలు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రత్యేకతను ఎస్‌పీ అమిత్‌బర్దార్ వివరించారు. సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం ఎంతో అంకితభావంతో పని చేస్తున్నదని ఎస్‌పీ కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.నిషాంతి చేతుల మీదుగా పలువురు అమర పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందించారు. కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్, సబ్ కలెక్టర్ కె.సాహిత్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు, పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు పరేడ్‌ను నిర్వహించి, అతిథులైన కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్, సబ్ కలెక్టర్ సాహిత్‌లకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పీ వై.శృతి, పాడేరు డీఎస్పీ వి.రాజసింహారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.