గోదావరి ఉరకలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:37 AM
విశాఖ వాసులు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న గోదావరి జలాలు మరికొద్ది గంటల్లో నగరానికి చేరుకోనున్నాయి. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయానికి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు రానున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏలేరు కాలువలోకి విడిచిపెట్టారు. అక్కడ నుంచి 33 కిలోమీటర్ల దూరాన ఉన్న కేబీఆర్‌కు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కేబీఆర్ నుంచి జీవీఎంసీ అధికారులు మోటార్లు ద్వారా నరవ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు పంపింగ్ చేస్తారు.
నేడో రేపో విశాఖ రాక
పోలవరం ఎడమ కాలువ నుంచి
శుక్రవారం అర్ధరాత్రి కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద
ఏలేరు కాలువలోకి ప్రవేశం
నేటి రాత్రికి లేదా రేపు ఉదయానికి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరిక
అక్కడ నుంచి నరవ ట్రీట్‌ప్లాంట్‌కు పంపింగ్
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
విశాఖ వాసులు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న గోదావరి జలాలు మరికొద్ది గంటల్లో నగరానికి చేరుకోనున్నాయి. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయానికి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు రానున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏలేరు కాలువలోకి విడిచిపెట్టారు. అక్కడ నుంచి 33 కిలోమీటర్ల దూరాన ఉన్న కేబీఆర్‌కు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కేబీఆర్ నుంచి జీవీఎంసీ అధికారులు మోటార్లు ద్వారా నరవ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు పంపింగ్ చేస్తారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను ఈనెల రెండో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద అనకాపల్లి జిల్లాలోకి విడుదల చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయానికి కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్దకు చేరుకున్నాయి. సాయంత్రానికి తాళ్లపాలెం సమీపాన గల ఏలేరు కాలువకు అతి సమీపంగా వచ్చాయి. అయితే ఎడమ కాలువలో నీటి ప్రవాహం ఏలేరులో ప్రవహించే నీటి మట్టానికి సమానంగా వచ్చేంత వరకూ నిల్వ చేసేందుకుగాను మధ్యలో తాత్కాలికంగా గట్టు వేశారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయానికి పోలవరం కాలువలో నీటి ప్రవాహం, ఏలేరులో ప్రవాహానికి సమానంగా వచ్చింది. దీంతో ఎర్రటి గోదావరి జలాలను ఏలేరు కాలువలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి 100 క్యూసెక్కులు మాత్రమే ఏలేరు కాలువలోకి విడిచిపెట్టారు.
నగర నీటి అవసరాల కోసం ఇప్పటివరకూ ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం సమీపాన గల కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 250 క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే గోదావరి జలాలను పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తరలిస్తున్న నేపథ్యంలో ఏలేరు రిజర్వాయర్ అధికారులు ఈనెల రెండో తేదీ నుంచి నీటి విడుదలను క్రమేపీ తగ్గించారు. శుక్రవారానికి ఏలేరు కాలువలో తాళ్లపాలెం వద్ద 150 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జల వనరుల శాఖ అధికారులు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా శుక్రవారం అర్ధరాత్రి 100 క్యూసెక్కుల నీటిని ఏలేరు కాలువలోకి విడుదల చేశారు. కాలువ సామర్థ్యం మేరకు 250 క్యూసెక్కులు ప్రవహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాబోయే వారంలో ఏలేరు కాలువలోకి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా 250 క్యూసెక్కులు నీటిని సరఫరా చేయనున్నందున ఏలేరు రిజర్వాయర్ నుంచి సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నారు. అయితే దీనిపై జల వనరుల శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. గోదావరి నదిలో ప్రవాహం 14 అడుగుల మేర ఉన్నంత వరకూ పురుషోత్తపట్నం వద్ద నీటిని ఎడమ కాలువలోకి పంపింగ్ చేస్తారు. ఒకవేళ గోదావరిలో ప్రవాహం 14 అడుగుల కంటే తక్కువకు పడిపోతే మాత్రం తిరిగి ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని కాలువలోకి విడిచిపెడతారు.