Share News

నామినేషన్ల జోరు

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:29 AM

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం జోరందుకుంది. దీంతో రెండో రోజు జడ్పీటీసీ స్థానాలకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జడ్పీటీసీ ఆశావహుల నుంచి రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ నామినేషన్లను స్వీకరించారు.

నామినేషన్ల జోరు
పాడేరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న అడపా ప్రీతి మధుమతి

- రెండో రోజు జడ్పీటీసీలకు 40, ఎంపీటీసీ స్థానాలకు 407...

- పోటా పోటీగా దాఖలు చేసిన వివిధ పార్టీల ఆశావహులు

- నేటితో ముగియనున్న గడువు

- ఆఖరు రోజు భారీగా పడనున్న నామినేషన్లు

పాడేరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం జోరందుకుంది. దీంతో రెండో రోజు జడ్పీటీసీ స్థానాలకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జడ్పీటీసీ ఆశావహుల నుంచి రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ నామినేషన్లను స్వీకరించారు. అలాగే మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లను అక్కడి రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తున్నారు. దీంతో రెండో రోజు జిల్లాలోని మొత్తం 40 జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో చింతపల్లికి 5, జీకేవీధికి 3, కొయ్యూరుకు 4, జి.మాడుగులకు 4, పాడేరుకు 5, డుంబ్రిగుడ 3, అరకులోయ 6, ముంచంగిపుట్టు 3, హుకుంపేట 5, అనంతగిరి స్థానానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. పాడేరు జడ్పీటీసీ స్థానానికి అడపా కీర్తి మధుమతి(టీడీపీ), సీదరి రాంబాబు(వైసీపీ), కుడుముల దీప్తి(బీజేపీ), పాంగి నవీన్‌(భారత చైతన్య యువజన పార్టీ), డప్పోడి కల్యాణ వరప్రసాద్‌(స్వతంత్ర), చింతపల్లి స్థానానికి సాగిన అన్నపూర్ణ దేవి(టీడీపీ), వనుము రత్నకుమారి(టీడీపీ), ఉల్లి సింహాచలం(జనసేన), మొట్టడం ప్రభ(జనసేన), గుసుముల శ్రావణి(వైసీపీ), హుకుంపేట స్థానానికి పొట్టంగి పద్మ(టీడీపీ), కిలగాడ సింహాచలం(వైసీపీ), దనసాని సత్యవతి(వైసీపీ), సమిఢ వెంకటపూర్ణిమ(వైసీపీ), సీదరి దేవి(భారత చైతన్య యువజనపార్టీ), ముంచంగిపుట్టు స్థానానికి పాంగి పాండురంగస్వామి(టీడీపీ), రెయ్యల శ్రావణ్‌కుమార్‌(జనసేన), కొర్రా త్రినాథ్‌(సీపీఎం), కొయ్యూరు స్థానానికి మొట్టడం హిమబిందు(టీడీపీ), గొడ్డేటి మాధవి(వైసీపీ), అనంతగిరి స్థానానికి కిల్లో మనీషా(స్వతంత్ర), బావన సాయిజయశ్రీ(జనసేన), అరకులోయ స్థానానికి పాచిపెంట చినస్వామి(కాంగ్రెస్‌), పాచిపెంట శాంతకుమారి(కాంగ్రెస్‌), దురియా ఆనంద్‌కుమార్‌(వైసీపీ), గెమ్మెలి చినబాబు(సీపీఎ), అగతంబిడి కృష్ణమూర్తి(బీజేపీ), డుంబ్రిగుడ స్థానానికి తుడుము సుబ్బారావు(టీడీపీ), కోనేది మాలతి(జనసేన), కిల్లో రాజభరత్‌(భారత చైతన్య యువజనపార్టీ), సొనబారికి పోతురాజు(సీపీఎం), జీకేవీధి స్థానానికి వంపూరగి బుబ్బిబాబు(సీపీఐ), గొర్లె వీరవెంకట సత్యనారాయణ(జనసేన), పాంగి కృష్ణారావు(జనసేన), జి.మాడుగుల స్థానానికి సోమెలి అఖిలప్రియ(టీడీపీ), సోమెలి ప్రేమలత(టీడీపీ), లోచలి సత్యవతి(వైసీపీ), ఐసరం మహేశ్వరి(వైసీపీ) తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. వారి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, సహాయ రిటర్నింగ్‌ అధికారి ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, జడ్పీ ఏవో సతీశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీటీసీ స్థానాలకు 407 మంది నామినేషన్లు

జిల్లాలో రెండో రోజు గురువారం 407 మంది ఎంపీటీసీ సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారు. పాడేరులో 48, అరకులోయలో 44, చింతపల్లిలో 58, హుకుంపేటలో 29, డుంబ్రిగుడలో 59, అనంతగిరిలో 27, పెదబయలులో 40, ముంచంగిపుట్టులో 23, జీకేవీధిలో 43, కొయ్యూరులో 36, జి.మాడుగులలో 53 నామినేషన్లను అభ్యర్థులు సమర్పించారు. రెండు రోజుల్లో జడ్పీటీసీ సభ్యులుగా 46 మంది, ఎంపీటీసీ సభ్యులుగా 479 మంది నామినేషన్లను దాఖలు చేశారు. కాగా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌ కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లోని నామినేషన్‌ కేంద్రాలను గురువారం సందర్శిఽంచారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద రెండో రోజు పటిష్ట పోలీసు బందోబస్తు కొనసాగుతున్నది. జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించే స్థానిక ఐటీడీఏ కార్యాలయం, ఎంపీటీసీ సాన్థాల నామినేషన్లను స్వీకరించే మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

నేడు భారీగా దాఖలు కానున్న నామినేషన్లు

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగియనుండడంతో ఆఖరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆఖరి రోజు కావడంతో అవకాశం ఉన్న మేరకు అధిక సంఖ్యలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఈ క్రమంలో శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని మండల కేంద్రాల్లో హడావిడి నెలకొంటుంది.

Updated Date - Oct 23 , 2026 | 12:29 AM