Share News

నామినేషన్ల జోరు

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:09 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల రెండవ రోజైన శనివారం సందడి నెలకొంది.

నామినేషన్ల జోరు
ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కూటమి అభ్యర్థిగా పిళ్లా రమాకుమారి నామినేషన్‌ పత్రాలను శనివారం ఎన్నికల అధికారి కె.వరహాలుకు అందజేస్తున్న దృశ్యం

రెండవ రోజు ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీల్లో చైర్‌పర్సన్‌కు 7, వార్డులకు 135 దాఖలు

అనకాపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల రెండవ రోజైన శనివారం సందడి నెలకొంది. ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కూటమి అభ్యర్థిగా మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి తన అనుచరులతో కలిసి మునిసిపల్‌ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి, తహశీల్దార్‌ వరహాలుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అలాగే వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ బొద్దపు యర్రయ్యదొర సతీమణి బొద్దపు తులసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, రాష్ట్ర ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్‌, మాజీ ఎంపీపీ బొద్దపు యర్రయ్యదొర పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. వీరు కాకుండా మరో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు 41 నామినేషన్లు వచ్చాయి. అలాగే నర్సీపట్నంలో చైర్‌పర్సన్‌ 1, వార్డులకు 94 నామినేషన్లు దాఖలయ్యాయి.

చైర్‌పర్సన్‌కు 6, వార్డులకు 41 నామినేషన్లు

ఎలమంచిలి: ఎలమంచిలి మునిసిపల్‌ ఎన్నికలకు శనివారం మొత్తం 47 నామినేషన్లు దాఖలైనట్టు కమిషనర్‌ ప్రసాదరాజు తెలిపారు. వీటిలో చైర్‌పర్సన్‌ పదవికి 6, వార్డు కౌన్సిలర్లకు 41 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్‌పర్సన్‌కు పిళ్లా రమాకుమారి, బొద్దపు తులసి(రెండు సెట్లు), బొద్దపు లత, పిల్లా రోహిణి, లాలం రమణమ్మ నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 3, వైసీపీ నుంచి 3, జనసేన నుంచి ఒక నామినేషన్‌ దాఖలైంది. అలాగే వార్డులకు మొత్తం 41 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీ 10, వైసీపీ 31 ఉన్నాయి. కాగా ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కూటమి అభ్యర్థిగా పిళ్లా రమాకుమారి పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ శనివారం ఖరారు చేశారు.

చైర్‌పర్సన్‌కు 1, వార్డులకు 94...

నర్సీపట్నం: మునిసిపల్‌ ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్లు పోటెత్తాయి. శనివారం టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం నుంచి 92, స్వతంత్రులు ఇద్దరు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసినవారిలో టీడీపీ నుంచి 47, వైసీపీ నుంచి 35, జనసేన 7, బీజేపీ 2, సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు. చైర్‌పర్సన్‌ స్థానానికి బీఎస్‌పీ అభ్యర్థిగా కృష్ణాపురానికి చెందిన బొట్టా కృష్ణా రమాదేవి నామినేషన్‌ వేశారు.

Updated Date - Oct 18 , 2026 | 12:09 AM