తిరుగు ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:13 PM
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపు, ఆటోల స్టాండ్‌లు తిరుగు ప్రయాణికులతో శనివారం రద్దీగా ఉన్నాయి.
ప్రత్యేక సర్వీసులను నడిపిన ఆర్టీసీ అధికారులు
రద్దీగా మారిన జీపు, ఆటో స్టాండ్
పాడేరురూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపు, ఆటోల స్టాండ్‌లు తిరుగు ప్రయాణికులతో శనివారం రద్దీగా ఉన్నాయి. సంక్రాంతి పండగకు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు తిరుగు ప్రయాణం కావడంతో ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్ కిటకిటలాడాయి. పాడేరు నుంచి చోడవరం వెళ్లే జీపులు, మైదాన ప్రాంతాలకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పండగ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రైవేటు జీపులు లేకపోవడం, బస్సులు రద్దీగా ఉండడంతో బస్సు, జీపుల కోసం ప్రయాణికులు ఎదురుచూశారు. ప్రయాణికుల రద్దీని గుర్తించిన ఆర్టీసీ డీఎం పసగాడ శ్రీనివాసరావు, కంట్రోలర్ దొర పాడేరు- విశాఖ, పాడేరు-చోడవరం, పాడేరు-అనకాపల్లి రూట్‌లలో ప్రత్యేక బస్సులను నడిపారు. ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపినప్పటికీ సాయంత్రం 6 గంటల వరకు కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గలేదు.