రోజ్‌గార్ మేళాతో లక్షల మందికి ఉద్యోగాలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:16 AM
ప్రభుత్వ ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్‌గార్‌మేళా విజయవంతమైందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ
అక్కయ్యపాలెం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్‌గార్‌మేళా విజయవంతమైందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. నగరంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగిన సీఐఎస్‌ఎఫ్ రోజ్‌గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. పలు శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగేదని, ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు వెలువడని పరిస్థితులు ఉండేవన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మిషన్ మోడ్‌లో చేపట్టి వేగవంతం చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 17 విడతల రోజ్‌గార్ మేళాలను నిర్వహించి సుమారు 11 లక్షల మందికి నియామక పత్రాలు అందజేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ 18వ రోజ్‌గార్ మేళాలో దేశవ్యాప్తంగా 61 వేల మందికి నియామక పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ ఐజీ శరవణన్, డీఐజీ డాక్టర్ రాఘవేంద్రకుమార్, పోర్టు సెక్రటరీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.