Share News

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:42 AM

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులపాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
సత్కారం పొందిన ఉత్తమ ఉపాధ్యాయులతో కలెక్టర్‌ నిషాంతి, పీవో ఆదిత్యవర్మ, నాయకులు వంపూరు గంగులయ్య, గిడ్డి ఈశ్వరి, అధికారులు

గురుపూజోత్సవాల్లో కలెక్టర్‌ టి.నిషాంతి

70 మంది మంది ఉత్తమ గురువులకు సత్కారం

పాడేరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులపాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌. శంకరన్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజం బాగుకు ఉపాధ్యాయులే ఆయుధమన్నారు. అందరికీ ఉపాధ్యాయులే ఆదర్శంగా ఉన్నందున ఎప్పటికీ వారికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుందన్నారు. టీచర్‌ కేవలం పాఠాలు బోధించే వారు మాత్రమే కాదని, విద్యార్థులకు సరైన మార్గదర్శకులు, ప్రేరణకర్తలు, సమాజ భవిష్యత్‌ను తీర్చిదిద్దే శిల్పులని కలెక్టర్‌ నిషాంతి కొనియాడారు. గిరిజన విద్యార్థులకు సకల సదుపాయాల ఆశ్రమ విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కృషితోనే విద్యార్థులకు చక్కని భవిష్యత్‌ ఏర్పడుతుందన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి వారిని ప్రయోజకులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ వంపూరు గంగుయ్య మాట్లాడుతూ.. సమాజానికి ఎటువంటి స్వార్థం లేకుండా సేవలందించేది గురువులు మాత్రమేనన్నారు. ఇటీవల నేపాల్‌లో వరదల్లో చిక్కుకున్న 400 మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షించారని, త్యాగం, బాధ్యత, సేవే లక్ష్యంగా టీచర్లు పనిచేస్తున్నాన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేమని, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తితో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న టీచర్లకు అభినందనలు తెలిపారు. అంతకుముందు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అందరూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, సమగ్ర శిక్ష ఏపీడీ డాక్టర్‌ వీఏ.స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమిళ, విద్యాశాఖాధికారులు, ఉత్తమ టీచర్లు పాల్గొన్నారు.

70 మంది ఉత్తమ టీచర్లకు ఘన సత్కారం

స్థానిక ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన గురుపూజోత్సవాల్లో 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, అడిషనల్‌ ఎస్‌పీ వై.శృతి, జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఈవో భానుమూర్తిరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, టీడబ్ల్యూ డీడీ పీబీకే.పరిమిళ, తదితరులు వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించి సన్మానించారు.

Updated Date - Sep 06 , 2026 | 12:42 AM