ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:51 AM
ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ అన్నారు.
ఎన్నికల పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ
అనకాపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణ, మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలపై కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ముందురోజు సాయంత్రమే కేంద్రానికి చేరుకొనేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల ద్వారా జరుగుతాయని, నివేదికలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను నేరుగా వివరణ అడిగే అవకాశం ఉందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఒకే కేంద్రంలో 3 లేదా 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ సదరు కేంద్రమంతటికీ ఒకే మైక్రో అబ్జర్వర్ బాధ్యత వహించాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్ ప్రధాన బాధ్యత కేవలం పర్యవేక్షించడం మాత్రమేనని, పోలింగ్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోరాదన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వరాదన్నారు. ఏదైనా అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే వాటిని నమోదు చేసి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌వో సత్యనారాయణరావు, డ్వామా పీడీ నిర్మలాదేవి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.