Share News

దారులు ఛిద్రం.. ప్రయాణం నరకం

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:19 PM

మండలంలోని భీమవరం, సుకూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని తోటకూరపాడు, గంగవరం గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తికాకముందే ఛిద్రమైంది. ఒక వైపు నిర్మాణం చేపడుతుంటే మరోవైపు గోతులు, పెచ్చులూడి దర్శనమిస్తోంది.

దారులు ఛిద్రం.. ప్రయాణం నరకం
పగుళ్లు ఇచ్చి అధ్వానంగా ఉన్న తోటకూరపాడు రోడ్డు

గంగవరం, తోటకూరపాడు రోడ్లు పూర్తికాక మునుపే శిథిలం

నాణ్యతా లోపంతో బీటలువారి అధ్వానంగా మారిన వైనం

వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

హుకుంపేట జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి); మండలంలోని భీమవరం, సుకూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని తోటకూరపాడు, గంగవరం గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తికాకముందే ఛిద్రమైంది. ఒక వైపు నిర్మాణం చేపడుతుంటే మరోవైపు గోతులు, పెచ్చులూడి దర్శనమిస్తోంది. దీంతో మట్టిరోడ్డు ఉన్న సమయంలో కంటే ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో ఏళ్లకు తోటకూరపాడుకు రోడ్డు నిర్మాణంతో కష్టాలు తీరతాయని ఈ ప్రాంత గిరిజనులు ఆశపడ్డారు. అయితే రోడ్డు నిర్మాణం చేపడుతున్నా నాణ్యత లేకపోవడంతో వర్షాలకు అధ్వానంగా మారి, రాకపోకలకు మరింత అవస్థలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గంగవరం గ్రామానికి తొలుత నుంచి రోడ్డు సదుపాయం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకే ఈ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే గత ఏడాది వచ్చిన భారీ తుఫాన్‌కు రోడ్డు మొత్తం గుంతలు పడి, కోతకు గురై అధ్వానంగా మారింది. దీంతో ఈ పంచాయతీకి చెందిన ప్రజలు ఆటవీ ఉత్పత్తులు, పంటలను వారపు సంతకు తీసుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారినపడినా, గర్భిణులు, బాలింతలను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వీలు కావడంలేదు. అధికారులు స్పందించి ఈ రహదారి పునఃనిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 11:20 PM