Share News

తిరుగు ప్రయాణాలతో రద్దీ

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:38 AM

సంక్రాంతి తిరుగు ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రద్దీగా మారాయి.

తిరుగు ప్రయాణాలతో రద్దీ

రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

జనరల్‌ బోగీల్లో ఒంటికాలితో ప్రయాణం

సాధారణ బోగీలను తలపించిన స్లీపర్‌ క్లాస్‌ బోగీలు

243 ప్రత్యేక సర్వీసులు నడిపిన ఆర్టీసీ యాజమాన్యం

అత్యధికంగా విజయవాడ, రాజమహేంద్రవరానికి 40 చొప్పున బస్సులు

విశాఖపట్నం/ ద్వారకా బస్‌స్టేషన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి తిరుగు ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రద్దీగా మారాయి. అత్యధిక మంది పండుగ సంబరాలు ముగించుకుని ఆదివారం గమ్యస్థానాలకు బయలుదేరడంతో విశాఖ రైల్వే స్టేషన్‌, ద్వారకా బస్‌స్టేషన్‌లో సందడి వాతావరణ ఏర్పడింది. దాదాపు అన్ని రైళ్లకు ప్రయాణికులు పోటెత్తడంతో ప్లాట్‌ఫారాలు కిటకిటలాడాయి. ద్వారకా బస్‌స్టేషన్‌లో కూడా ఇంచుమించుగా పరిస్థితి ఇలానే వుంది. ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.

సంక్రాంతి పండుగ సంబరాలకు ఇతర ప్రాంతాల నుంచి విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిన వారిలో అత్యధిక శాతం మంది ఆదివారం తిరుగు ప్రయాణంలో కావడంతో ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌, ఇంటర్‌సిటీ, పాసింజర్‌ రైళ్లు రద్దీగా మారాయి. గోదావరి, గరీబ్‌రథ్‌, మహబూబ్‌నగర్‌, నాందేడు, దురంతో, ఎల్‌టీటీ, వందేభారత్‌, రత్నాచల్‌, జన్మభూమి, సింహాద్రి వంటి విశాఖ ఒరిజినేటింగ్‌ రైళ్లతోపాటు విశాఖ మీదుగా చెన్నై, బెంగళూరు వెళ్లే మెయిల్‌, కోరమండల్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సుమారు నెలరోజుల క్రితమే ఆదివారానికి (18న) రిగ్రెట్‌ ఏర్పడిన నేపథ్యంలో రిజర్వేషన్‌ లేని ప్రయాణికులు జనరల్‌ కోచ్‌లకు ఆశ్రయించాల్సి వచ్చింది. నిరీక్షణ జాబితాలో రిజర్వేషన్‌ టికెట్‌ పొందిన అత్యధిక మంది ప్రయాణికులకు బెర్తులు ఖరారు కాకపోడంతో జరిమానాలు చెల్లించేందుకు సిద్ధపడి రిజర్వేషన్‌ కోచ్‌లలోకి ఎక్కాడు. దీంతో స్లీపర్‌ క్లాసు కోచ్‌లు కూడా జనరల్‌ కోచ్‌లుగా మారిపోయాయి.

కిక్కిరిసి నడిచిన పలు రైళ్లు

సోమవారం నుంచి విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆదివారం తిరుగు ప్రయాణాలు ఊపందుకున్నాయి. ప్రయాణికులు పోటెత్తడంతో రైళ్లకు తీవ్ర రద్దీ ఏర్పడింది. తప్పనిసరిగా గమ్యాలకు చేరాల్సి ఉండడంతో రద్దీని సైతం లెక్కచేయకుండా ప్రయాణాలు చేశారు. దీంతో సాధారణ కోచ్‌ల్లో ఒంటి కాలితో ప్రయాణం చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు తీవ్ర రద్దీ ఏర్పడింది. విజయవాడ నుంచి విశాఖకు చేరిన వారితోపాటు ఇక్కడ నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు ఒకేసారి ప్లాట్‌ఫార మీద వుండడంతో జాతరను తలపించింది. గోదావరి, విశాఖ, మహబూబ్‌నగర్‌, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లతోపాటు ప్రత్యేక రైళ్లకు రద్దీ ఏర్పడడంతో జనరల్‌ బోగీలు కిక్కిరిశాయి. చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌, హౌరా వైపు వెళ్లే రైళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. భువనేశ్వర్‌ వైపు వెళ్లే రైళ్లలో జనరల్‌ కోచ్‌ల్లో ప్రయాణించిన వారి ఇక్కట్లు వర్ణణాతీతం.

ఆర్టీసీ 243 ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం ఆదివారం 243 ప్రత్యేక సర్వీసులు నడిపింది. వీటిల్లో సగానికిపైగా సర్వీసులు విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, హైదరాబాద్‌కు నడిపారు. తిరుగు ప్రయాణికులతో ద్వారకా బస్టేషన్‌తోపాటు మద్దిలపాలెం బస్టేషన్‌ కూడా రద్దీగా మారింది. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, ఉన్నత విద్య నిమిత్తం వేరే ప్రాంతాల్లో వుంటున్నవారు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవడానికి వారం రోజుల క్రితం సొంతూళ్లకు వచ్చారు. సంక్రాంతి ముగియడంతో తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనితో ప్రయాణికుల తాకిడి పెరిగింది. రోజూ నడిచే బస్సు సర్వీసులు చాలకపోవడంతో 243 ప్రత్యేక సర్వీసులు నడిపారు. దూరప్రాంతాలైన విజయవాడకు 40, రాజమహేంద్రవరానికి 40, కాకినాడకు 20, హైదరాబాద్‌కు 8 చొప్పున ప్రత్యేక బస్సులు నడిపారు. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళానికి 30, పలాసకు 20, టెక్కలికి 15, సోంపేటకు 10, మందసకు 10, పాతపట్నానికి ఐదు, విజయనగరానికి 20, బొబ్బిలికి 10, సాలూరుకు 10, రాజాంకు ఐదు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. సోమవారం కూడా తిరుగు ప్రయాణికుల రద్దీ ఉంటుందని, అందువల్ల 300 ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేస్తున్నామని రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు.

Updated Date - Jan 19 , 2026 | 12:38 AM