Share News

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ బాధ్యత మాదే

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:54 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు ఫ్యాక్టరీని ఇథనాల్‌ లేదా డిస్టిలరీగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత కార్మికులకు, రైతులకు ఉపాధి కల్పించే బాధ్యత తాము తీసుకుంటున్నామని మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రకటించారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని, చెరకు రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చే స్తూ రైతు, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గోవాడ వద్ద చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సందర్శించి ఆందోళన చేస్తున్న రైతులు, కార్మికులనుద్దేశించి మాట్లాడారు.

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ బాధ్యత మాదే
గోవాడలో దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పక్కన చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు

- ఇథనాల్‌ లేదా డిస్టిలరీపై సీఎంతో చర్చించి త్వరలో నిర్ణయం

- వారంలోగా కార్మికుల బకాయిలు చెల్లిస్తాం

- ఫిబ్రవరి మూడవ వారంలో చెరకు రైతుల బకాయిలు చెల్లింపునకు చర్యలు

- భరోసా ఇచ్చిన మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు బండారు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు

చోడవరం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు ఫ్యాక్టరీని ఇథనాల్‌ లేదా డిస్టిలరీగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత కార్మికులకు, రైతులకు ఉపాధి కల్పించే బాధ్యత తాము తీసుకుంటున్నామని మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రకటించారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని, చెరకు రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చే స్తూ రైతు, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గోవాడ వద్ద చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సందర్శించి ఆందోళన చేస్తున్న రైతులు, కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దశలవారీగా గోవాడ రైతులు, కార్మికుల సమస్యలతో పాటు ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ముందుగా వారం రోజుల్లోగా కార్మికుల బకాయిలతో పాటు రిటైరైన కార్మికుల గ్రాట్యుటీ డబ్బులు కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై కలెక్టర్‌ను కలిసి వారంలోగా బకాయిలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరకు రైతులకు సంబంధించిన బకాయిలు రూ.28.43 కోట్లు చెల్లించేందుకు ఫిబ్రవరి 15 తరువాత సీఎంతో చర్చించి ఆ వెంటనే నిధులు విడుదల చేసి రైతుల బకాయిలు క్లియర్‌ చేస్తామని భరోసా ఇచ్చారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని కాపాడే బాధ్యత తమదేనని, ఫ్యాక్టరీ ఇలా ఉండడం తమకూ బాధగా ఉందని, దీనిని ఇలా వదిలేయడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పారు. సీఎంతో చర్చించిన అనంతరం ఫ్యాక్టరీ మహాజన సభ ఏర్పాటు చేసి రైతులు, అఖిలపక్షాల నేతలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యంగా ఇథనాల్‌ లేదా డిస్టిలరీగా దీనిని అభివృద్ధి చే సేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని, ఇక్కడ కార్మికులకు, రైతులకు భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే చెరకు రైతులు, కార్మికులతో సీఎం చంద్రబాబును కలిసి గోవాడ ఫ్యాక్టరీ అభివృద్ధిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫ్యాక్టరీని గాడిలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రైతు సంఘం, కార్మిక సంఘం నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, శరగడం రామునాయుడులు మాట్లాడుతూ గోవాడ చెరకు రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు ఫ్యాక్లరీని తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే డిస్టిలరీ లేదా ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేంత వరకూ రైతులు ప్రత్నామ్నాయ పంటల వైపు మరలిపోకుండా ఫ్యాక్ట ్టరీ నడిచేలా క్రషింగ్‌ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం దీక్షలు చేస్తున్న కార్మికులకు ఎమ్మెల్యేలు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో గోవాడ షుగర్స్‌ ఎండీ ఎం.వెంకటేశ్వరరావు, రైతు, కార్మిక సంఘాల నాయకులు కోన మోహనరావు, గండి నాయనిబాబు, నందారపు భాస్కరరావు, ఎస్‌.వీ,నాయుడు, పడాల కొండలరావు, రాయి సూరిబాబు, సేనాపతి సత్యారావు కామిరెడ్డి పాత్రునాయుడు, కిల్లి దేముడు, పైలా రమేశ్‌, ఏడువాక రాజు, కార్మికులు పొట్నూరి అప్పలరాజు, బీవీ నూకరాజు, వేగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటు, గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బొడ్డేడ గంగాధర్‌, టీడీపీ మండల అధ్యక్షుడు మత్స్యరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాగా చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు తాము ఆందోళనను విరమిస్తున్నామని, గోవాడకు న్యాయం కోసం వేచిచూస్తామని, హామీ అమలుకాని పక్షంలో మళ్లీ ఆందోళనకు దిగుతామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి ప్రకటించారు.

Updated Date - Jan 25 , 2026 | 12:54 AM