ప్రభుత్వ నిర్ణయాల అమలు బాధ్యత ప్రజా ప్రతినిధులదే
ABN , Publish Date - May 07 , 2026 | 01:11 AM
ప్రజలకు మేలు చేసేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కూటమి పార్టీల నేతలు, క్యాడర్ మధ్య సఖ్యత ఉండాలని, క్యాడర్ బాగోగులు పట్టించుకోవాలని సూచించారు. ఇందుకుగాను కూటమి నేతలు తరచూ సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. బుధవారం రాత్రి అమరావతిలో విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం నారా చంద్రబాబునాయుడు
కూటమి పార్టీల నేతలు, క్యాడర్ మధ్య సఖ్యత ఉండాలి
సమస్యలు నివేదించిన ఎమ్మెల్యేలు
ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ
కేజీహెచ్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్‌కు ఆదేశం
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, టిడ్కో ఇళ్ల కేటాయింపు, ఫ్లైఓవర్‌ల నిర్మాణం ప్రస్తావించిన శాసనసభ్యులు
విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి):
ప్రజలకు మేలు చేసేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కూటమి పార్టీల నేతలు, క్యాడర్ మధ్య సఖ్యత ఉండాలని, క్యాడర్ బాగోగులు పట్టించుకోవాలని సూచించారు. ఇందుకుగాను కూటమి నేతలు తరచూ సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. బుధవారం రాత్రి అమరావతిలో విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల పనితీరు, వ్యవహారశైలి, సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి అంశాల ఆధారంగా నివేదికలు రూపొందించామన్నారు. విశాఖపట్నం కూటమికి కంచుకోట అని అందుకు తగినట్టుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ ప్రజలు అంటే తనకు ఎంతో గౌరవమని, 2019లోనూ నగరవాసులు టీడీపీ వెంటే నిలిచారని గుర్తుచేశారు. విశాఖ చాలా ప్రశాంత నగరమని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదని స్పష్టంచేశారు. విశాఖలో సైబర్ నేరాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన పనులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేస్తామన్నారు. కేజీహెచ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరగా, మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ కేజీహెచ్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆర్థికతోడ్పాటు అందిస్తారని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ గెజిట్ రావడానికి విశేషంగా కృషిచేసిన చంద్రబాబునాయుడుకు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, టిడ్కో ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని సీఎంను కోరారు. హౌసింగ్ కాలనీల్లో మంచినీరు సరఫరా చేయాలని కోరారు. హనుమంతువాక, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ నుంచి ఎయిర్‌పోర్టు నడుమ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు.
ఎమ్మెల్యేల ప్రస్తావించిన సమస్యలు, పనుల వివరాలు...
- ఉత్తర నియోజకవర్గంలో పీఎంఈవై గృహాల నిర్మాణం పూర్తిచేయాలి.
- పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అచ్చెంనాయుడులోవలో టిడ్కో ఇళ్లకు అప్రోచ్ రోడ్డు.
- గాజువాకలోని గంగవరం పోర్టు మత్య్సకార నిర్వాసిత కుటుంబాలకు జీవనభృతి ప్యాకేజీ అమలు, పోర్టు వద్ద బ్రేక్ వాటర్ జెట్టీ నిర్మాణం, ఫార్మా సిటీ కాలనీల్లో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి.
- తూర్పు నియోజకవర్గ పరిధిలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణంతో రోడ్డునపడిన 47 మందికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలి. ముడసర్లోవ గ్రామంలో నివాస గృహాలను క్రమబద్ధీకరించాలి.
- దక్షిణ నియోజకవర్గ పరిధిలోని కేజీహెచ్‌లో మాతా,శిశు సంరక్షణ ఓపీ బ్లాక్ నిర్మాణం. ఎండోమెంట్ భూముల్లో నివాస గృహాల క్రమబద్ధీకరణ, పూర్ణామార్కెట్ ఆధునికీకరణ
- భీమిలికి సంబంధించి అడవివరం-శొంఠ్యాం రోడ్డు పనులకు అటవీ శాఖ అనుమతులు, భీమిలీ సీహెచ్‌సీ, మధురవాడ పీహెచ్‌సీ అప్‌గ్రేడేషన్, సోలార్ పవర్‌ప్లాంటు ఏర్పాటుకు దేవదాయ భూములు కేటాయింపు, అల్లూరి సీతారామరాజు జన్మస్థలం అయిన పద్మనాభం మండలం పాండ్రంగిలో అభివృద్ధి పనులు చేపట్టాలి.
ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌బాబు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.