Share News

నేడే ప్రాదేశిక పోరు

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:21 PM

జిల్లాలో గురువారం ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది.

నేడే ప్రాదేశిక పోరు
ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళుతున్న సిబ్బంది

జిల్లాలో 617 పోలింగ్‌ కేంద్రాలకు సజావుగా పోలింగ్‌ సామగ్రి పంపిణీ

11 జడ్పీటీసీ స్థానాలకు 70 మంది, 172 ఎంపీటీసీ స్థానాలకు 648 మంది పోటీ

ఓటర్లు 4,98,467 మంది

జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 9560334841

ప్రతి మండలంలో పోలింగ్‌ కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గురువారం ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ప్రతి మండల కేంద్రంలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందించి, వారిని ప్రత్యేక వాహనాల్లో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.

జిల్లాలో మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు 70 మంది పోటీ పడుతుండగా, వారిలో వైసీపీ 11, టీడీపీ 6, జనసేన 3, కాంగ్రెస్‌ 8, బీజేపీ 4, సీపీఎం 4, ఆప్‌ 4, బీఎస్‌పీ 1, స్వతంత్రులు 29 మంది ఉన్నారు. మొత్తం 11 మండలాల్లో 172 ఎంపీటీసీ స్థానాలకు గాను 648 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 617 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం 4,98,467 మంది ఓటర్లుకాగా, వారిలో పురుషులు 2,41,447 మంది, మహిళలు 2,56,997 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు. ఇందులో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65,374 మంది ఓటర్లుండగా, అనంతగిరిలో అత్యల్పంగా 38,286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు. జిల్లాలో మొత్తం 617 పోలింగ్‌ కేంద్రాలుండగా, ఒక్కో కేంద్రానికి ఆరుగురు చొప్పున మొత్తం ఆరు వేల మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు 78 మంది జోనల్‌ అధికారులు, 117 రూట్‌ అధికారులను నియమించారు. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో మారుమూల ప్రాంతాల్లోని 44 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ నిర్వహిస్తారు. జిల్లాలోని 149 సమస్యాత్మక, 91 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, వాటికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు వాహన తనిఖీలతో సమస్యాత్మక కేంద్రాలపై నిఘా పెట్టారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో 1,718 మందిని బైండోవర్‌ చేశారు. ఇతరులు జిల్లాలోకి ప్రవేశించకుండా అనుమానిత ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌, హోటళ్లు లాడ్జీల తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ఓటర్లను బెదిరించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ పలు మార్లు హెచ్చరించారు.

Updated Date - Nov 04 , 2026 | 11:21 PM