Share News

వర్షం పోయింది.. గోతులు పెరిగాయి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:42 AM

తీవ్రవాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారులకు నష్టం మిగిల్చాయి. రోడ్ల మీదుగా వర్షం నీరు ప్రవహించడంతో గోతులు మరింత పెద్దవి మారాయి. వర్షం నీటితో చెరువులను తలపిస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

వర్షం పోయింది.. గోతులు పెరిగాయి
ఇటీవల కురిసిన వర్షాలతో చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో మెయిన్‌ రోడ్డుపై ఏర్పడిన భారీ గొయ్యిలో చేరిన నీరు

ఛిద్రమైన గ్రామీణ రహదారులతో జనం అవస్థలు

చోడవరం పట్టణంలో చెరువులను తలపిస్తున్న గోతులు

పరవాడ వద్ద తీవ్రంగా దెబ్బతిన్న మెయిన్‌ రోడ్డు

తీవ్రవాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారులకు నష్టం మిగిల్చాయి. రోడ్ల మీదుగా వర్షం నీరు ప్రవహించడంతో గోతులు మరింత పెద్దవి మారాయి. వర్షం నీటితో చెరువులను తలపిస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

చోడవరం మెయున్‌ రోడ్డు అధ్వానం

భారీ గోతులతో ఛిద్రమైన రహదారి

వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్టు

చోడవరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భీమిలి- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డుకు చోడవరం పట్టణంలో ఇంతవరకు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో గోతుల సమస్య నానాటికీ తీవ్రతరం అవుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. గోతులు మరింత పెద్దవి కావడంతోపాటు రాళ్లు లేచిపోవడంతో వాహనదారుల ఇక్కట్లు వర్ణనాతీతం.

భీమిలి- నర్సీపట్నం రోడ్డులో చోడవరం మండల పరిధిలో వెంకన్నపాలెం నుంచి చోడవరం పట్టణం కొత్తూరు జంక్షన్‌ సమీపం వరకు ఇటీవల అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అదేవిధంగా నర్సీపట్నం వైపు వెళ్లే రోడ్డులో చోడవరం అటవీ శాఖ కార్యాలయం నుంచి బుచ్చెయ్యపేట మండలం సరిహద్దు వరకు ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. నియోజకవర్గం కేంద్రంలో ప్రధాన రహదారి పనులు పూర్తికాకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రత్యేకించి ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో సుమారు వంద మీటర్ల మేర రహదారి పూర్తిగా ఛిద్రమై బీటీ రోడ్డు ఆనవాళ్లు కనిపించడంలేదు. వర్షం కురిస్తే భారీ గోతుల్లో నీరు చేరి, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గాంధీగ్రామం సమీపంలో కూడా పెద్ద పెద్ద గోతులతో దారుణంగా తయారైంది. వెంకన్నపాలెం- చోడవరం మధ్యలో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో కొంతమేర పనులు పెండింగ్‌లో వున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి, చోడవరం పట్టణ పరిధిలో బీఎన్‌ రోడ్డు అభివృద్ధి పనులను త్వరగా చేయించాలని స్థానికులతోపాటు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫొటోరైటప్‌ః

27పీవీడీ-1- పరవాడ వేబ్రిడ్జి సమీపంలో పూర్తిగా ఛిద్రమై ఆనవాళ్లు లేని రహదారి

27పీవీడీ- 2- పరవాడ సినిమాహాల్‌ జంక్షన్‌ వద్ద గోతులమయమైన రోడ్డు

ఏడాది తిరక్కుండానే..

తీవ్రంగా దెబ్బతిన్న పరవాడ మెయిన్‌ రోడ్డు

గోతులతో ఇబ్బంది పడుతున్న జనం

పరవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిలో మండల పరిధిలోని ఊటగెడ్డ జంక్షన్‌ నుంచి బంగ్లా జంక్షన్‌ వరకు రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనాలు దెబ్బతినడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి, ఏ గొయ్యి ఎంత లోతు వుందో అంచనా వేయకలేక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారికి సుమారు ఏడాది క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. అయితే వర్షం నీరు రహదారి మీదుగా ప్రవహిస్తుండడంతోపాటు నాణ్యతా లోపం కారణంగా ఏడాదికే గోతులు ప్రత్యక్షం అయ్యాయి. ఈ రహదారి మీదుగా సింహాద్రి ఎన్టీపీసీ, అచ్యుతాపురం సెజ్‌, ఫార్మాసిటీకి చెందిన కార్మికులు, ఉద్యోగులతోపాటు పరవాడ, వెన్నెలపాలెం, రావాడ, బొట్టవానిపాలెం, తదితర గ్రామాలకు చెందిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఎల్లవేళలా వాహనాల రద్దీ అధికంగా వుంటుంది. గోతుల కారణంగా రాత్రిపూట ప్రమాదాలకు గురవుతున్నట్టు ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు.

ఫోటో:26కేడీపీ 8- ఏఎల్‌పురం వద్ద రోడ్డుపై భారీ గోతులు

2)26కేడీపీ 10- ఏఎల్‌పురం- పాతకృష్ణాదేవిపేట మధ్య ఏర్పడిన పెద్ద గొయ్యి

భారీ గోతులతో బెంబేలు

కృష్ణాదేవిపేట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేట, కొంగశింగి, చోద్యం తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు గోతులతో అధ్వానంగా మారాయి. గతంలో చిన్నపాటి గోతులు ఉన్న ఈ రోడ్లలో తాజాగా కురిసిన భారీ వర్షాలకు నీరు నిలిచిపోయి భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే గోతులను పూడ్చాలని వాహనచోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:42 AM