రైల్వే స్టేషన్ కిటకిట
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:00 AM
సంక్రాంతి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో అంతా సొంత ఊళ్లకు బయలుదేరారు.
పండుగ ప్రయాణాలు షురూ
పోటెత్తిన ప్రయాణికులు
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు విపరీతమైన తాకిడి
గోదావరికీ అదే పరిస్థితి
ప్రధాన రైళ్లన్నీ ఫుల్
విశాఖపట్నం, జనవరి 10:
సంక్రాంతి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో అంతా సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో శనివారం ఉదయం 6.15 గంటలకు బయలుదేరే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805) నుంచి సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) వరకూ కిక్కిరిసి నడిచాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే కొంతమంది విశాఖ-లింగంపల్లి...జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240)లను ఆశ్రయించారు. ఇక శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాలకు వెళ్లేవారు మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరే విశాఖ-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18412)లో బయలుదేరారు. మరోవైపు సికింద్రాబాద్, చెన్నై, ముంబై, పూణె, తదితరచోట్ల నుంచి గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, మెయిల్, కోరమండల్, ఎల్‌టీటీ, కోణార్క్, ఫలక్‌నూమా, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో విశాఖ చేరిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు తాకిడి
విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, నిడదవోలు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం సుమారు రెండు గంటల ముందుగానే స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫామ్ కిటకిటలాడింది. విజయవాడ నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరింది. విజయవాడ నుంచి వచ్చిన ప్రయాణికులు కోచ్ నుంచి దిగుతుండగానే జనరల్ సీటు కోసం కొందరు లోపలకు ఎక్కే ప్రయత్నం చేయడంతో ప్రవేశద్వారం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికులకు నియంత్రించే ప్రయత్నం చేశారు. కొన్ని కోచ్‌ల వద్ద నియంత్రణ విఫలం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే కొందరు ప్రయాణికులు రత్నాచల్ తర్వాత విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015), గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రైళ్ల జనరల్ కోచ్‌లను ఆశ్రయించారు.
ప్రధాన రైళ్లు ఫుల్
విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిండు బెర్తులతో బయలుదేరాయి. గోదావరి (12727), విశాఖ (17015), గరీబ్‌రథ్ (12739), కోణార్క్ (11020), ఫలక్‌నూమా (12703), ఎల్‌టీటీ (18519), కోరమండల్ (12841), మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12839), టాటా-ఎర్నాకులం (18189), బొకారో ఎక్స్‌ప్రెస్ (13351) వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు శనివారం నిండు బెర్తులతో నడిచాయి. అయితే సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ రైళ్లు కొన్ని ఖాళీ సీట్లతో బయలుదేరాయి. కాగా ఆదివారం హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), గరీబ్‌రధ్ (12739), ఎల్‌టీటీ (18519), వందేభారత్ (20708, 20833)లో బెర్తులు రిజర్వు అయిపోయాయి. ఇక విశాఖ-చర్లపల్లి, శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి వంటి ప్రత్యేక రైళ్లకు సోమవారానికి బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
కిక్కిరిసిన బస్సులు
237 స్పెషల్స్ నడిపిన ఆర్టీసీ
హైదరాబాద్, విజయవాడ సహా దూర ప్రాంతాలకు 60
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు 177
ఆక్యుపెన్సీ రేషియో 130 శాతం
రూ.45 లక్షల మేర పెరిగిన ఆదాయం
ద్వారకా బస్‌స్టేషన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి ప్రయాణికులతో శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి రాత్రి 9.00 గంటల వరకూ రద్దీ కొనసాగింది. హైదరాబాద్, విజయవాడ, భీమవరం, రాజోలు, కాకినాడ, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు వెళ్లే షెడ్యూల్ సర్వీసులు, స్పెషల్స్ నూరుశాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.
దూర ప్రాంతాలకు వెళ్లే షెడ్యూల్ సర్వీసుల సీటింగ్ కెపాసిటీకి ముందుగానే రిజర్వేషన్ జరిగిపోయింది. అయినా వాటికి సంబంధించిన టికెట్ కౌంటర్‌ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. శ్రీకాకుళం, విజయనగరం నాన్ స్టాప్ కౌంటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో అధికారులు ఉదయం 7.00 గంటల నుంచే సంక్రాంతి స్పెషల్స్ ఆపరేట్ చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌కు 8, విజయవాడకు 26, భీమవరం 2, రాజోలు 2, కాకినాడ 10, రాజమండ్రికి 12 ప్రత్యేక సర్వీసులు నడిపారు. రాత్రి 8.00 గంటలకు కూడా ప్రయాణికుల డిమాండ్ కొనసాగుతున్నది.
విశాఖ నుంచి శ్రీకాకుళానికి ప్రతి అరగంటకు ఒక నాన్‌స్టాప్, 20 నిమిషాలకొక ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్రపల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం మీదుగా పలాస, టెక్కలి, పాతపట్నం, మందస, ఇచ్ఛాపురం, సోంపేట వెళ్లేందుకు 15 నిమిషాలకొక బస్సు ఉంది. ఇవన్నీ సేవలందిస్తున్నా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండడంతో అధికారులు శ్రీకాకుళానికి 55, ఇచ్ఛాపురానికి 14, పలాస 12, మందసకు 10, సోంపేటకు 7, పాతపట్నానికి 7, రాజాంకు 9 ప్రత్యేక సర్వీసులు నడిపారు.
విజయనగరానికి ప్రతి అరగంటకు ఒక నాన్‌స్టాప్, విజయనగరం మీదుగా బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాలకు 10 నిమిషాలకొక బస్సు ఉంది. అయినా ప్రయాణికుల డిమాండ్ కొనసాగడంతో విజయనగరానికి 32, బొబ్బిలి 9, సాలూరు 8, పార్వతీపురం 14 ప్రత్యేక సర్వీసులు నడిపారు.
రికార్డు స్థాయిలో 130 శాతం ఓఆర్ నమోదు
జోన్ పరిధిలో బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో 130 శాతంగా నమోదయ్యింది. బస్సుల్లో కూర్చుని ఎంతమంది ప్రయాణించారో, నిల్చొని అంతమంది ప్రయాణించారు. దాంతో ఈ ఆక్యుపెన్సీ నమోదైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే షెడ్యూల్, స్పెషల్ సర్వీసులు, నాన్‌స్టాప్ సర్వీసులు వంద శాతం ఆక్యుపెన్సీతో తిరిగాయి. సగటు ఆక్యుపెన్సీ రేషియో 125 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రూ.45 లక్షలు పెరిగిన ఆదాయం
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు రోజువారీ అదాయం ఒక్కమారుగా రూ.45 లక్షలు పెరిగింది. సంక్రాంతి ప్రయాణికుల తాకిడికి ముందు రోజుకు రూ.1.3 కోట్లు వచ్చేది. శనివారం ఒక్కరోజే రూ.1.75 కోట్లు వచ్చినట్టు అధికారులు లెక్కలు కట్టారు. ఆదివారంతో పాటు మరికొద్దిరోజులు ప్రయాణికుల తాకిడి కొనసాగే అవకాశం ఉందని ఆర్‌ఎం అభిప్రాయపడుతున్నారు.
75 శాతం స్త్రీశక్తి ప్రయాణికులే
స్త్రీశక్తికి సంబంధించిన ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారిలో 75 శాతం మంది మహిళలే ఉంటున్నారు. జీరోటికెట్ జారీచేసిన టిమ్స్ ద్వారా ఈ లెక్కలు తేలాయి. ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో ఈ పరిస్థితి ఉందని రీజియన్ అధికారులు తెలిపారు.
రాత్రి కూడా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు
బి.అప్పలనాయుడు, రీజనల్ మేనేజర్
సంక్రాంతి ప్రయాణికులను వారి గమ్యానికి చేర్చేందుకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటుచేస్తున్నాం. షెడ్యూల్ సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం. ప్రయాణికుల డిమాండ్ ఉంటే రాత్రి కూడా బస్సులు నడుపుతాం. అందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాం.
బెంగళూరుకు నాలుగు కొత్త రైళ్లు
ఇవి కూడా దువ్వాడ మీదుగానే...
విశాఖపట్నం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
బెంగళూరుకు వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా నాలుగు వీక్లీ రైళ్లు నడపడానికి రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. వాటిలో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఇవన్నీ విశాఖపట్నం రాకుండా దువ్వాడ మీదుగా వెళ్లిపోతాయి. ఈ కొత్త రైళ్లు ఈ నెల 17వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని రైల్వే వర్గాల సమాచారం.
- 20603/20604 నంబరుతో నడిచే అమృత్ భారత్ రైలు జలపాయ్‌గురి నుంచి దువ్వాడ మీదుగా నాగర్‌కోయల్ వెళుతుంది. ఇది ఆదివారం రాత్రి 11 గంటలకు జలపాయ్‌గురిలో బయలుదేరి బుధవారం ఉదయం ఐదు గంటలకు గమ్యం చేరుతుంది. దువ్వాడకు ఇటు నుంచి వచ్చేటప్పుడు ఉదయం 3.40 గంటలు, అటు నుంచి వచ్చేటప్పుడు సాయంత్రం 6.23 గంటలు అవుతుంది.
- 20609/20610 నంబరుతో మరో అమృత్ భారత్ రైలును జలపాయ్‌గురి నుంచి తిరుచురాపల్లి వరకు నడుపుతారు. ఇది ఇటు నుంచి బుధవారం, అటు నుంచి శుక్రవారం బయలుదేరుతుంది.
- 16597/16598 నంబరు కలిగిన రైలు బెంగళూరు నుంచి అలీపూర్‌దౌర్ వెళుతుంది. ప్రతి శనివారం 8.50 గంటలకు బయలుదేరి గమ్యానికి సోమవారం ఉదయం 10.25 గంటలకు చేరుతుంది. ఈ రైలు అటు నుంచి గురువారం బయలుదేరుతుంది.
- 16223/16224 నంబరుతో బెంగళూరు నుంచి రాధికాపూర్‌కి ప్రతి గురువారం రైలు నడుస్తుంది. ఇది శనివారం అక్కడికి చేరుతుంది.
నగరవాసుల అసంతృప్తి
విశాఖ నుంచి బెంగళూరుకు నేరుగా రైలు లేదు. గతంలో విశాఖ నుంచి నడిచిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును భువనేశ్వర్ తీసుకుపోయారు. ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది బెంగళూరుకు తరచుగా రాకపోకలు సాగిస్తుంటారు. కొత్త రైళ్లను వేయాల్సిందిగా ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నా రైల్వే అధికారులు స్పందించడం లేదు. ఈ డిమాండ్‌ను ప్రైవేటు ట్రావెల్స్ పూరిస్తున్నాయి. విశాఖ నుంచి రోజుకు సుమారు 40 బస్సులను నడుపుతున్నాయి. కనీస చార్జి రూ.2 వేల నుంచి మొదలై డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేల వరకు వెళుతోంది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన రైళ్లు కూడా నేరుగా విశాఖ నుంచి కాకుండా వేరే ప్రాంతాల నుంచి వేయడం, అవి కూడా దువ్వాడ మీదుగా నడపడంపై నగర ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.