Share News

వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల దందా

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:48 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు.

వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల దందా

కుటుంబ సభ్యులు/బంధువుల పేర్లతో కాంట్రాక్టులు

తమ పరిధిలో ఇతర కాంట్రాక్టర్లు బిడ్‌ వేయకుండా బెదిరింపులు

తక్కువ లెస్‌కు బిడ్‌ వేసి జీవీఎంసీ ఖజానాకు గండి

పనుల నాణ్యతపైనా ప్రభావం

ఉన్నతాఽధికారులకు తెలిసినా చర్యలు శూన్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. కుటుంబ సభ్యులు/బంధువుల్లో ఒకరిని కాంట్రాక్టర్‌గా రిజిస్ర్టేషన్‌ చేయించి టెండర్లలో పాల్గొంటున్నారు. తాము పనిచేస్తున్న వార్డుల్లో ఇతర కాంట్రాక్టర్లు బిడ్‌లు వేయకుండా బెదిరింపులకు దిగుతున్నారు. తక్కువ లెస్‌కు బిడ్‌ వేసి జీవీఎంసీ ఖజానాకు గండి కొట్టడంతో పాటు పనుల్లో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు.

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో పర్మనెంట్‌, అవుట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 120 మంది ఉన్నారు. వారిలో సగానికిపైగా కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో టెండర్లు వేయిస్తున్నారు. తాము పనిచేసే వార్డులో పనులకు ఇతర కాంట్రాక్టర్లు టెండర్‌ వేయకుండా ఒప్పించడం లేదంటే బెదిరించడం చేస్తున్నారు. ఆ పనులను తక్కువ లెస్‌కు టెండర్‌ వేసి వారే దక్కించుకుంటున్నారు. ఎస్టిమేషన్‌ తయారీలో ఏఈలకు వారే సహకరించాల్సి ఉంటుంది కాబట్టి, అంచనాలను ఎక్కువగా చూపిస్తున్నారు. సిమెంట్‌, స్టీల్‌ అంచనాల్లో ప్రతిపాదించిన దానికంటే తక్కువ మోతాదులో వాడి, ఖర్చు తగ్గించుకుని పూర్తిపనికి బిల్లు తీసుకుంటున్నారు. దీనివల్ల జీవీఎంసీ ఖజానాకు గండిపడడంతోపాటు పనుల్లో నాణ్యత లోపిస్తోంది.

జీవీఎంసీ పరిధిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి తన బావమరిదిని కాంట్రాక్టర్‌గా రిజిస్ర్టేషన్‌ చేయించి, తన జోన్‌లో పనులు తానే చేసుకుంటున్నారు. ఈస్ట్‌ జోన్‌ పరిధిలో ఓ పర్మినెంట్‌ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ తన భార్య పేరుమీద పనులు చేస్తున్నారు. అత్యవసరం పేరుతో పిలిచే నామినేషన్‌ పనులను దక్కించుకుని భారీగా దోచుకుంటున్నారని ఆ విభాగంలోని సిబ్బందే ఆరోపిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి నీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు తదితర పనులు తూతూమంత్రంగా చేసి బిల్లు డ్రా చేసుకున్నట్టు చెబుతున్నారు. పెందుర్తి జోన్‌ పరిధిలో ఓ అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌..కాంట్రాక్టర్‌ అయిన తన బావ పేరుతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి జోన్‌లో ఇద్దరు అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కూడా కుటుంబసభ్యుల పేరుతో ఆర్‌అండ్‌బీలో కాంట్రాక్టర్లుగా రిజిస్ర్టేషన్‌ చేయించి జీవీఎంసీ టెండర్లలో పాల్గొంటున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి.

ఇతర కాంట్రాక్టర్లకు బెదిరింపులు

కాంట్రాక్టర్‌గా పనులుచేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు తమ వార్డులో జరిగే పనులకు టెండర్‌ పిలిచినప్పుడు ఎవరైనా బిడ్‌ వేస్తే బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఎవరైనా టెండర్‌ వేస్తే వేధించి నష్టం వచ్చేలా చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కోరినప్పుడు టెండర్‌ నుంచి ఇతరులు తప్పుకుంటున్నారు.

అసలు విధులలివి

వార్డు పరిధిలో అభివృద్ధి పనికి సంబంధించి ప్రతిపాదన వస్తే ఎంత ఖర్చవుతుందనే అంచనాలను ఏఈ స్థాయి అధికారి తయారుచేయాలి. ఇందుకోసం వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై ఆధారపడతారు. ప్రతిపాదిత పనికి కొలతలను వర్క్‌ ఇన్‌స్పెక్టరే తీస్తారు. పని మంజూరైన తర్వాత ఎస్టిమేషన్‌ ప్రకారం దగ్గరుండి కాంట్రాక్టర్‌తో పనిచేయించడం, నిర్మాణ సామగ్రి నాణ్యతను పరిశీలించడం వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల విధి. పూర్తయిన తర్వాత కొలతలు వేసి, అంచనాల మేరకు ఉందా?, లేదా?...అనేది ఏఈకి తెలియజేయాలి. అయితే వారే కాంట్రాక్టులు దక్కించుకోవడంతో పనుల్లో నాణ్యతకు పాతరేన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Apr 08 , 2026 | 12:48 AM