రక్త పరీక్షా కేంద్రాల దందా
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:40 AM
రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, పలు మండల కేంద్రాల్లో రోగుల నుంచి యథేచ్ఛగా డబ్బుల దోపిడీ జరుగుతున్నది. ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేయాలన్నది వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేయకపోవడంతో ఆయా ల్యాబ్‌లు, కలెక్షన్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టంవచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారు
రోగుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు
ప్రభుత్వ ఆస్పత్రుల పరిసరాల్లో యథేచ్ఛగా ఏర్పాటు
కేంద్రాల నిర్వాహకులతో కొంతమంది వైద్యులు కుమ్మక్కు
నిబంధనలకు విరుద్ధంగా కలెక్షన్ సెంటర్లు
పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, పలు మండల కేంద్రాల్లో రోగుల నుంచి యథేచ్ఛగా డబ్బుల దోపిడీ జరుగుతున్నది. ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేయాలన్నది వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేయకపోవడంతో ఆయా ల్యాబ్‌లు, కలెక్షన్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టంవచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారు. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు పొందకుండా పలువురు ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్లు సొంతంగా ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులకు సమీపంలో చిన్నపాటి షాపులు, కంటెయినర్ తరహా దుకాణాలను ఏర్పాటు చేసుకొన్నారు. వీటిలో కొన్ని ల్యాబ్‌లు వుండగా, మరికొన్ని కలెక్షన్ సెంటర్లు వున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరంలో అనధికారికంగా కలెక్షన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను పరీక్షించిన తరువాత, కొంతమంది వైద్యులు వివిధ రకాల రక్త పరీక్షల కోసం సమీపంలో వున్న ల్యాబ్‌లు, కలెక్షన్ సెంటర్లకు రిఫర్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా ల్యాబ్‌లలో పూర్తిస్థాయిలో సదుపాయాలు లేవు.. అర్హులైన సిబ్బంది సైతం లేదు.
అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆస్పత్రి చుట్టుపక్కల పలు కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. వైద్యులు రాసిన ప్రిస్ర్కిప్షన్ ప్రకారం వీటిలోని సిబ్బంది రోగుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. వీటిలో కొన్ని సెంటర్లకు ఎటువంటి అనుమతులు లేవని సమాచారం. అనకాపల్లిలోనే కాకుండా జిల్లాలోని మునిసిపాలిటీలు, మండలాల్లో వున్న ప్రభుత్వ ఆస్పత్రులకు సమీపంలో అనధికార రక్తపరీక్షల కేంద్రాలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వాస్తవంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ రకాల రక్త, మూత్ర, కఫం, ఇతర పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. అయితే ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల వద్ద రద్దీగా వుండడం, రిపోర్టులు ఆలస్యంగా ఇస్తారన్న ఉద్దేశంతో పలువురు రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ పరీక్షకు ఎంత వసూలు చేయాలన్నది ఆయా కేంద్రాల వద్ద అందరికీ కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ ఏ ఒక్క ల్యాబ్‌లో కూడా ఫీజుల బోర్డులు కనిపించవు. ఎవరికి నచ్చినట్టు వారు ఫీజులను నిర్ణయించుకొని రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇందులో 20 నుంచి 40 శాతం వరకు ఆయా వైద్యులకు కమిషన్ రూపంలో ఇస్తుంటారని తెలిసింది.
తనిఖీలు ఏవీ...
జిల్లాలో 91 రక్తపరీక్షా కేంద్రాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి వుంది. కానీ ఇంతకు నాలుగైదురెట్ల సంఖ్యలో రక్త పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రముఖ ల్యాబ్‌లు.. ప్రభుత్వ ఆస్పత్రుల సమీపంలో, రద్దీగా వుండే ప్రాంతాల్లో ‘కలెక్షన్ సెంటర్ల’ను నిర్వహిస్తున్నారు. వీటిల్లో రక్త, మూత్ర, ఇతర నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు పంపుతుంటారు. అనధికార రక్తపరీక్షా కేంద్రాలపై తనిఖీలు నిర్వహించాలని మంత్రి వంగలపూడి అనిత గతంలో ఒకసారి ఆదేశించడంతో అప్పటి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి హైమావతి అడ్డ్డరోడ్డు జంక్షన్‌లో ఒక రక్తపరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి, అనుమతులు లేని కారణంగా మూసివేయించారు. అయితే కొద్ది రోజులకే ఈ పరీక్షా కేంద్రం తెరుచుకుంది. ల్యాబ్‌లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం నిఘా వుండాలి. నెలలో ఐదు నుంచి పది రక్తపరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలి. కానీ అధికారులు ఆయా ల్యాబ్‌ల నిర్వాహకులను తమ కార్యాలయానికి పిలిపించుకొని, తనిఖీలు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసుకొని చేతులు దులుపుకుంటున్నట్టు తెలిసింది. రక్తపరీక్షల పేరుతో కలెక్షన్ సెంటర్ల నిర్వహణపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అచ్యుతకుమారి వివరణ కోరగా.. కలెక్షన్ సెంటర్లకు అనుమతి ఇవ్వడం అంటూ ఏమీ వుండదని, అనుమతి పొందిన కేంద్రాల్లో మాత్రమే రక్తపరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అనధికార కలెక్షన్ సెంటర్లు, అధిక ఫీజుల వసూళ్లపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు.