డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పదోన్నతులను పునఃపరిశీలించాలి
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:39 AM
స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,480 మంది డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు పనిచేస్తున్నారని, సిబ్బంది రేషనలైజేషన్ ప్రక్రియలో కొంతమందికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వం పునఃపరిశీలించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో కోరారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొణతాల వినతి
అనకాపల్లి టౌన్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,480 మంది డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు పనిచేస్తున్నారని, సిబ్బంది రేషనలైజేషన్ ప్రక్రియలో కొంతమందికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వం పునఃపరిశీలించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల అర్హతలు, అనుభవానికి అనుగుణంగా ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో 580 పోస్టులు, రెవెన్యూ శాఖలో 1,372 కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్‌లో 619 పోస్టులు, మెడికల్ అండ్ హెల్త్ శాఖలో 2,241 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం కంటే, కంప్యూటర్, డేటాబేస్ నిర్వహణలో అనుభవం ఉన్న సచివాలయాల సిబ్బందికి అర్హత ఆధారంగా అవకాశాలు కల్పించాలన్నారు. పరిపాలనలో పారదర్శకత పెరగడంతో పాటు అవకతవకలను కూడా అరికట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన సూచించారు.