ప్రాజెక్టు ఇక్కడ... అధికారులు ఎక్కడ!
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:32 AM
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి అధికారులు మాత్రం అమరావతిలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అది ప్రస్తుతానికి లాభదాయకం కాకపోయినా మెట్రో నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాజెక్టును పట్టాలపైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది.
‘మెట్రో రైలు కార్పొరేషన్ కార్యాలయం’
సీనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగులకే పరిమితం
అందుబాటులో ఉండని ఆఫీసర్లు
ప్రాజెక్టుకు నిధులు సమకూర్చే బాధ్యత
వీఎంఆర్‌డీఏకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం
సదరు సంస్థ సమీక్ష నిర్వహిస్తే
హాజరయ్యేది దిగువ స్థాయి సిబ్బందే
మారని ఉన్నతాధికారుల తీరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి అధికారులు మాత్రం అమరావతిలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అది ప్రస్తుతానికి లాభదాయకం కాకపోయినా మెట్రో నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాజెక్టును పట్టాలపైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది.
విశాఖతో పాటు విజయవాడలో మెట్రో రైలు కోసం ప్రత్యేకంగా ‘అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏఎంఆర్‌సీఎల్)’ అనే సంస్థను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏర్పాటుచేశారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఇష్టపడని విషయం తెలిసిందే. దాంతో మెట్రో రైలు ప్రాజెక్టు విశాఖలో ఉంటే...కార్యాలయం అక్కడ ఎందుకంటూ 2020లో విజయదశమి రోజున అప్పటి పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపానున్న ఎల్‌ఐసీ భవనంలో మెట్రో రైలు కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించారు. అధికారులంతా ఇక్కడి నుంచే పనిచేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఏఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా మార్చేశారు. అందులోనే మరో అధికారికి ఎండీ బాధ్యతలు అప్పగించి విశాఖపట్నం కార్యాలయంలో కూర్చోబెట్టారు. అయినా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. డ్రైవర్ లేకుండానే మెట్రో రైలు నడుపుతామని, బీచ్‌రోడ్డులో మోనో రైలు వేస్తామని...ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో రకరకాల ప్రచారం చేశారు. అలాగే కాలం గడిచిపోయింది.
వీఎంఆర్‌డీఏ భవనంలోకి మార్పు
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెట్రో రైలు ప్రాజెక్టు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయి. కొత్తగా డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో రైలు వేస్తామని ప్రకటించారు. సమగ్ర ప్రణాళిక నివేదికను సమర్పించి నిధులు మంజూరు చేయాలని ఢిల్లీ పెద్దలను కోరారు. ఇదిలావుండగా ఎల్‌ఐసీ భవనంలో నిర్వహిస్తున్న కార్యాలయానికి భారీగా అద్దె చెల్లించాల్సి రావడంతో భారం తగ్గించుకోవడానికి సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ ఉద్యోగ్ భవన్‌లోకి మార్చారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన పాత ఎండీకి మళ్లీ పూర్తి బాధ్యతలు అప్పగించారు. అప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న అధికారికి అందులోనే జాయింట్ ఎండీ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఈ ఇద్దరూ కూడా అమరావతి కార్యాలయంలోనే ఉంటున్నారు. అదే ప్రధాన కార్యాలయమని, విశాఖలో ఏర్పాటుచేసినది ప్రాంతీయ కార్యాలయమని చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు విజయవాడ మెట్రో కంటే విశాఖ మెట్రోకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నా ఆ అధికారులకు అవేమీ పట్టడం లేదు. ఇటీవలె మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు సమకూర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం వీఎంఆర్‌డీఏ భుజ స్కంధాలపై పెట్టింది. దాంతో వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ ప్రాజెక్టు అధికారులను సమీక్షకు పిలిస్తే ఎండీ హాజరు కాలేదు. ఆ తరువాత కేడర్‌లో ఉన్న అధికారి మాత్రమే విజయవాడ నుంచి వచ్చారు. ప్రస్తుతం విశాఖలో సీనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగులు తప్పితే అధికారులు ఎవరూ ఉండడం లేదు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇక్కడ చేపడుతుంటే అధికారులెవరూ అందుబాటులో లేకపోవడమేమిటనే ప్రశ్న వినిపిస్తోంది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కూడా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ దగ్గరుండి చూసుకోవలసిన అధికారులు అమరావతికే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా కేంద్రం కూడా విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టుకు సాయం చేయడానికి సానుకూలత వ్యక్తంచేసిందని సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీలో ప్రకటించిన నేపథ్యంలో మెట్రో రైలు అధికారులు కొందరైనా విశాఖకు మకాం మార్చాల్సిన ఆవశ్యకత ఉంది.