Share News

ప్రైవేటు అంబులెన్స్‌ల దందా

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:53 AM

కేజీహెచ్‌ వద్ద ప్రైవేటు అంబులెన్స్‌ల దందా పెరిగిపోయింది.

ప్రైవేటు అంబులెన్స్‌ల దందా

కేజీహెచ్‌ గేటు వద్ద భారీ సంఖ్యలో వాహనాలు

మృతదేహాలు, డిశ్చార్జ్‌ అయిన రోగుల తరలింపునకు అధిక డబ్బుల వసూలు

అంతా సిండికేట్‌

బయట నుంచి అంబులెన్స్‌లను రానివ్వని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేజీహెచ్‌ వద్ద ప్రైవేటు అంబులెన్స్‌ల దందా పెరిగిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వారిని, అలాగే కోలుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాని వారిని స్వస్థలాలకు తరలించేందుకు భారీ మొత్తంలో డిమాండ్‌ చేస్తుండడంతో సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు ఇబ్బంది పడుతున్నారు.

కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందేందుకు ప్రతిరోజూ సుమారు నాలుగు వేల మంది వరకూ వస్తుంటారు. మరో రెండు వేల మంది ఇన్‌పేషెంట్లుగా ఉంటారు. ఇన్‌పేషెంట్లలో ఆరోగ్యం కుదుటపడినవారు, చికిత్స పొందుతూ మృతిచెందిన వారిని స్వగ్రామాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తుంటారు. మృతదేహాలను వంద కిలో మీటర్లు లోపు అయినట్టయితే ఉచితంగా మహా ప్రస్థానం వాహనాల ద్వారా తరలించే అవకాశం ఉంది. సుదూర ప్రాంతాలకు చెందిన వారికి ఈ వాహనాల సేవలు అందుబాటులో లేకపోవడంతో కొన్నిరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా వైద్య సేవలు పొంది కోలుకున్నవారు కూడా ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. వంద కిలోమీటర్లకు పైబడితే మృతదేహాన్ని తరలించాలంటే కనీసం ఎనిమిది వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. బయట నుంచి వాహనాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేసినా వీరంతా సిండికేట్‌గా ఏర్పడి రానివ్వడం లేదు. దాంతో అక్కడ ఉన్న అంబులెన్స్‌ డ్రైవర్లు చెప్పినట్టే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే, డిశ్చార్జి అయిన రోగులకైతే 20 నుంచి 50 కిలోమీటర్ల దూరానికి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ చార్జీల కంటే రెండు, మూడు రెట్లు అధికంగా తీసుకుంటుండడంతో రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

సిండికేట్‌తో సిబ్బంది

కేజీహెచ్‌కు ఇతర ప్రాంతం నుంచి ప్రైవేటు అంబులెన్స్‌ను తెచ్చుకోవాలన్నా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అక్కడ ఉన్న అంబులెన్స్‌ నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని రానివ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేజీహెచ్‌ ఇన్‌ గేట్‌ నుంచి క్యాజువాల్టీ గేటు వరకు సుమారు 50 వరకు అంబులెన్స్‌లు పార్కింగ్‌ చేసి ఉంటాయి. ప్రధాన రహదారి పక్కనే అంబులెన్స్‌లను పార్క్‌ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోరు.

Updated Date - Oct 08 , 2026 | 12:53 AM