జీడి పిక్కల ధర డమాల్
ABN , Publish Date - May 01 , 2026 | 12:14 AM
జీడిమామిడి పిక్కల ధర అమాంతంగా పడిపోయింది. బస్తాకు రూ. 4 వేలు తగ్గిపోయింది. వైరస్ సోకిందనే బూచిని చూపి వ్యాపారులు ధరను తగ్గించేశారు. దీంతో జీడి రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారు.
వైరస్ బూచి చూపి ధర తగ్గించిన వ్యాపారులు
కొన్నిచోట్ల పప్పు దిగుబడి రాలేదనే నెపంతో కొనుగోళ్లు నిలిపివేత
గిట్టుబాటు ధరకు జీడి రైతు ఎదురుచూపులు
కొయ్యూరు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో 20 వేల ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉన్నాయి. గడిచిన రెండేళ్లుగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక జీడి రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలో బస్తా (80 కిలోల) ధర రూ.13 వేలు ఉండగా.. వారంలోపు ధర రూ. 11,500లకు దిగజారింది. అనంతరం కురిసిన వర్షాలకు జీడి పిక్కల రంగు మారడంతో మరో రూ.1,500 తగ్గించేశారు. దీంతో 80 కిలోల బస్తా రూ. పది వేలకు పడిపోయింది. అక్కడితో ఆగకుండా జీడి పిక్కలకు వైరస్ సోకడంతో పప్పు దిగుబడి తగ్గిందంటూ బస్తాకు మరో వేయి రూపాయలు తగ్గించి.. ప్రస్తుతం రూ.9 వేలకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా 80 కిలోల బస్తాకు 24 కేజీల పప్పు రావల్సి ఉండగా.. 17 కేజీల పప్పు వస్తున్నదని వ్యాపారులు ధర తగ్గించారు. అయినప్పటికీ రైతులు జీడి పిక్కలను విక్రయించడానికి సిద్ధపడడంతో వ్యాపారులంతా సిండికేటుగా మారి కొనుగోళ్లు నిలిపేశారు. అలాగే రైతుకు వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థికంగా సాయపడిన చిరు వ్యాపారులు తమ బాకీలను వడ్డీతో తీర్చాలంటూ వత్తిడి పెంచేశారు. లేకుంటే వచ్చే వ్యవసాయ సీజన్‌లో పెట్టుబడులకు తాము సహకరించలేమని నిర్మోహమాటంగా చెబుతున్నారు. దీంతో రైతులు అప్పు తీర్చుకోలేక.. పండిన పంట అమ్ముకునేందుకు అవకాశం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జీడిపిక్కల కొనుగోలుకు జీసీసీ గానీ, ఐటీడీఏ గానీ ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు.