పేదల స్థలాలపై పెద్దల కన్ను
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:28 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు, అక్రమ కేటాయింపులకు అడ్డుకట్ట పడుతుందని భావించిన పేదలకు తీవ్ర నిరాశే మిగులుతున్నది.
లేఅవుట్లలో యథేచ్ఛగా ఖాళీ ప్లాట్ల ఆక్రమణ
సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూమి సైతం కబ్జా
సెంట్లు చొప్పున విక్రయం
వైసీపీ నేతలతో కూటమి నాయకులు కుమ్మక్కు
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుల వెల్లువ.. పట్టించుకోని అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు, అక్రమ కేటాయింపులకు అడ్డుకట్ట పడుతుందని భావించిన పేదలకు తీవ్ర నిరాశే మిగులుతున్నది. గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వేసిన లేఅవుట్‌లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, మిగులు ప్లాట్లపై అక్రమార్కులు కన్నేశారు. ప్రభుత్వం మారినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదని, కూటమిలోని పార్టీలకు చెందిన కొందరు స్థానిక నాయకులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పేరిట చేపట్టిన భూసేకరణ నుంచి పాట్ల పంపిణీ వరకు అనేక అక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక వైసీపీ నాయకులు బినామీల ముసుగులో లేఅవుట్‌లలో ప్రాధాన్యం కలిగిన ప్లాట్లను హస్తగతం చేసుకున్నారు. వీరి ఆగడాలపై పలువురు పేదలు అప్పట్లో అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల అక్రమాలకు చెక్ పడుతుందని భావించారు. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎవరు అధికారంలో వుంటే.. ఆ పార్టీ నేతలు ప్రభుత్వ భూములు, స్థలాల కబ్జాకు పాల్పడడం ఆనవాయితీగా మారిందన్న ఆరోపణలు సామాన్య ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో వేసిన పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్లలో మిగిలిన ఖాళీ స్థలాలు, ప్లాట్లను గృహ నిర్మాణ సంస్థ అధికారులు గుర్తించి, అర్హులైన పేదలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అక్రమార్కులు మళ్లీ రెచ్చిపోతున్నారు. లేఅవుట్‌లలోని ఖాళీ స్థలాల్లో రాత్రికిరాత్రి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.
అనకాపల్లి మండలం ఊడేరు పంచాయతీ అల్లుకంటిపాలెంలో గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్ వేసి 75 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇంకా 20 ప్లాట్లు ఖాళీగా వున్నాయి. లేఅవుట్‌లో సామాజిక అవసరాల కోసం 55 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఖాళీగా వున్న ప్లాట్లతోపాటు సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూమిపై కూటమిలో ఒక పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు కన్నేశారు. వైసీపీ నాయకులతో కుమ్మక్కై తుమ్మపాల, అనకాపల్లి పరిసరాల్లోని కొందరికి రెండు సెంట్ల చొప్పున విభజించి గత వారం రోజులుగా అమ్మకాలు జరుపుతున్నారు. సెంటుకు రూ.3-4 లక్షల చొప్పున తీసుకుంటున్నారు. స్థలం కొనుగోలు చేసిన వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, అధికారంలో వున్నది తామే కాబట్టి రెవెన్యూ అధికారులు మీ జోలికి రాకుండా చూసుకుంటామని, కొద్ది రోజుల తరువాత పట్టాలు మంజూరు చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. దీంతో స్థలాలను కొనుగోలు చేసిన వారిలో పలువురు పునాదులు తీసి, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి మండలం కొండుపాలెంలో సర్వే నంబర్ 64లో ఐదు ఎకరాల్లో వేసిన లేఅవుట్‌లో కూడా కబ్జాదారులు చొరబడ్డారు. అనకాపల్లికి చెందిన వైసీపీ నేత, మాజీ ప్రజాప్రతినిధి ఈ లేఅవుట్‌లో సుమారు ఐదు సెంట్ల స్థలాన్ని ఆక్రమించి మూడు అంతస్థులతో భవనం నిర్మిస్తున్నారు. ఇతనికి, కూటమి నేతలకు మధ్య స్నేహ సంబంధాలు వుండడంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడడం లేదని తెలిసింది. ఇంకా అనకాపల్లి మండలం తగరంపూడి, వెంకుపాలెం, సీతానగరం, గొలగాం, భట్లపూడి, శంకరం, రేబాక గ్రామాల్లో గృహ నిర్మాణ సంస్థ లేఅవుట్‌లలో కూడా ఖాళీ ప్లాట్లు, ఓపెస్ స్పేస్‌లు కబ్జాకు గురవుతున్నాయి.
వైసీపీ, కూటమి నేతలు కుమ్మక్కు!
గత ప్రభుత్వం హయాంలో జిల్లా వ్యాప్తంగా వేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్‌లలో సుమారు 20 వేల ప్లాట్లు ఎవరికీ కేటాయించలేదు. వీటిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఏయే ప్లాట్లు ఖాళీగా వున్నాయో వైసీపీ నేతల వద్ద సమాచారం వుంది. దీంతో కూటమి, వైసీపీ నేతలు కుమ్మక్కై, ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలతో, ప్రస్తుతం కూటమికి చెందిన కొందరు కిందస్థాయి నాయకులు చేతులు కలిపి, ఖాళీ ప్లాట్‌లను పంచుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల మౌనం
పేదల కోసం వేసిన ఇళ్లస్థలాల లేఅవుట్‌లలో మిగుల ప్లాట్లు, ఖాళీ స్థలాల ఆక్రమణ, విక్రయాలు, అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయ లేఅవుట్లలో నివాసం వుంటున్న పేదలు ఆరోపిస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లేఅవుట్‌లో స్థలాలు కబ్జా అవుతున్నట్టు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌లలో సమగ్ర రీ-సర్వే నిర్వహించాలని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని అర్హులైన పేదలకు స్థలాలను కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.