Share News

దివికేగిన పేదల డాక్టర్‌

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:19 AM

దేశంలో రికార్డు స్థాయిలో పోలియో శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.

దివికేగిన పేదల డాక్టర్‌

పోలియో శస్త్రచికిత్స నిపుణుడు ఆదినారాయణరావు అస్తమయం

దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి ఆపరేషన్లు

విశాఖ పుట్‌బాల్‌ సంఘంతో సుదీర్ఘ అనుబంధం

నేడు అంత్యక్రియలు

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

దేశంలో రికార్డు స్థాయిలో పోలియో శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను నాలుగు రోజుల క్రితం మెడికవర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డాక్టర్‌ ఆర్‌.శశిప్రభ (రిటైర్డు రాష్ట్ర మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌), కుమారుడు శశికిరణ్‌, కుమార్తె శేష్‌కమల్‌ ఉన్నారు. దేశంలో పోలియో వ్యాధి నివారణకు ఆయన విశేషంగా కృషిచేశారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో సుమారు మూడు లక్షల మందికి ఉచితంగా ఆపరేషన్లు చేశారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ప్రేమ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది పోలియో రోగులు ప్రేమ ఆస్పత్రికి వచ్చేవారు.

డాక్టర్‌ ఆదినారాయణరావు నర్సింగ్‌ కళాశాల, ఫిజియోథెరపీ ఇనిస్టిట్యూట్‌ కూడా ఏర్పాటుచేశారు. వైద్య రంగానికే పరిమితం కాకుండా ఫుట్‌బాల్‌ రంగంలో ప్రవేశం సంపాదించారు. విశాఖ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌కు 1974 నుంచి 2003 వరకూ అధ్యక్షులుగా, 1982 నుంచి రాష్ట్ర అసోసియేషన్‌ ఉపాధ్యక్షులుగా పనిచేసిన ఆయన నగరంలో క్రీడాకారులను అనేక రకాలుగా ప్రోత్సహించారు. వైద్య, సేవా రంగాల్లో విశేష కృషిచేసిన ఆదినారాయణరావుకు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 2019లో గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశాయి. భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. డాక్టర్‌ ఆదినారాయణరావు మృతి విషయం తెలుసుకున్న నగర ప్రముఖులు, వైద్యులు నోవాటెల్‌ సమీపాన గల ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఆదివారం అంకోశా హాలులో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Updated Date - Jan 18 , 2026 | 01:19 AM